breaking news
Anakapalle District News
-
300 ఏళ్ల నాటి కార్యసిద్ధి గణపతి
చోడవరం క్షేత్రంలో విశిష్టస్వయంభూ విఘ్నేశుడు చోడవరం: చోడవరం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని తూర్పుదిశగా ఉన్న శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం ఉంది. సుమారు 300 ఏళ్లనాటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం నడుము పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. స్వామివారి తొండం చివరిభాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందనే ప్రతీతి ఉంది. పాతచెరువు ఒడ్డున ఉన్న ఈ స్వయంభూ వినాయకుని విగ్రహాన్ని పక్కనే ఉన్న శ్రీ స్వయంభూ గౌరీశ్వరాలయంలోకి తరలించడానికి అప్పట్లో తవ్వకాలు జరిపించగా ఎంతపొడవు తవ్వినా స్వామివారి తొండం చివరి భాగం కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు పూర్వీకులు చెబుతారు. తవ్వకాన్ని జరిపిన ప్రాంతాన్ని ‘ఏనుగుబోదె’గా పిలుస్తుంటారు. ఒకనాడు జీర్ణావస్థలో ఉన్న ఈ స్వయంభూ విఘ్నేశ్వరాలయాన్ని 1856లో చుండూరు వెంకన్న పంతులు ఆధ్వర్యంలో కొడమంచిలి చలపతిరావు అర్చకత్వంలో పునఃసంప్రోక్షణ జరిపారు. 1875లో కొడమంచిలి గణేష్, పలువురు కలసి స్థాపించిన శ్రీ బాలగణపతి సంఘం సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. దేవదాయ ధర్మదాయశాఖ ఆధీనంలో స్వామి వారికి పూజలు జరుగుతూ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది. ఇప్పటి వరకు ఆలయానికి ఉత్తర రాజగోపురం మాత్రమే ఉండేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ధర్మశ్రీ చొరవతో ఆలయానికి రూ.3కోట్ల వ్యయంతో తూర్పు, పశ్చిమం, దక్షిణ రాజగోపురాలు నిర్మించారు. ఈనెల 27 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. చింతామణి గణపతి దత్తక్షేత్రం అనకాపల్లి: సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో స్వామివారి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చింతామణి గణపతి ఆలయం భారతదేశంలోనే ఏకై క అతిపెద్ద గణపతి ఆలయంగా అనకాపల్లి మండలం జీవీఎంసీ విలీనగ్రామైన జాతీయ రహదారి సిరసపల్లి గ్రామంలోప్రసిద్ధి పొందింది. జాతీయ రహదారి తాడి రైల్వే స్టేషన్ సమీపంలో స్వామివారి ఆలయం ఉంది. చింతామణి గణపతిని ధ్యానించినా, పూజించినా, స్మరించినా లేదా దర్శించినా కోరిన వరాలు ఇచ్చే దైవంగా భక్తుల విశ్వాసం. అవదూత దత్త పీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ అమృత హస్తాలతో 2012 జనవరి 25వ తేదీన విగ్రహ ప్రతిష్ట చేశారు. ప్రతి ఏడాది వినాయక నవరాత్రులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏనుగు తొండంలో చూడముచ్చటగా... నాతవరం: జిల్లేడుపూడి పంచాయతీలో మర్రిచెట్టు ఊడల మధ్యలో సర్వాంగసుందరంగా నిర్మించిన నూకాలమ్మ ఆలయానికి ఎడమవైపు ఏనుగు నోటిలోంచి కన్పించే విధంగా చూడముచ్చటగా వినాయకుడి ఆలయం ఉంటుంది. అమ్మవారికి కుడి వైపున 30 ఎత్తులో నాగసర్పంతో కూడిన శివలింగం ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ దట్టమైన అటవీప్రాంతంలో తాటాకు పాకలో నూకాలమ్మ తల్లిని ఈ ప్రాంతీయులు పూజించేవారు. ఏలేరు కాలువ నిర్మించే సమయంలో నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఎత్తయిన కొండ అడ్డుగా ఉండడంతో అక్కడ సొరంగం తవ్వాలని నిర్ణయించారు. సొరంగం పనులు చేస్తుండగా యంత్రాలు మొరాయిస్తున్నాయి..కూలీలు మరణిస్తున్నారు..పనులు జరగడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో స్థానిక పశువుల కాపరి సూచన మేరకు కాంట్రాక్టర్ ప్రభాకర్ చౌదరి మరుసటి రోజు తాటాకు పాకలో ఉన్న అమ్మవారిని దర్శంచుకున్నారు. సొరంగం పూర్తయితే ఆలయ నిర్మాణం చేస్తామని మొక్కుకున్నారు. దీంతో అనుకున్న సమయం కంటే ముందుగానే సొరంగం పనులు పూర్తి చేసి స్టీల్‌ప్లాంటుకు నీరు సరఫరా చేసేశారు. అన్నమాట ప్రకారం అలయాలు సర్వాంగసుందరంగా నిర్మించి ప్రతి ఏటా పండగలు చేస్తున్నారు. ఇటీవల ఆలయ నిర్మాణకర్త ప్రభాకర్ చౌదరి మరణించడంతో జిల్లేడుపూడికి చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు పండగలు చేస్తున్నారు. వినాయుకుడి ఆలయం ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఎనుగు తొండలోంచి కనిపించేలా నిర్మించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 11సార్లు ప్రదక్షిణ చేస్తే కార్యసిద్ధి భక్తులు తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు స్వయంభూ విఘ్నేశ్వరస్వామికి 11సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి మొదటి సారిగా వచ్చిన భక్తులు ఆలయ గర్భగుడి చుట్టూ 11సార్లు ప్రదక్షిణ చేసి కోర్కెలు తీరిన తర్వాత 48 సార్లు ప్రదక్షిణ చేయడం విశేషం. నవరాత్రి మహోత్సవాల్లో స్వయంభువుని దర్శించుకోవడం మరింత శుభకరం. –కొడమంచిలి చలపతిరావు, చోడవరం స్వయంభూ వినాయక ఆలయ ప్రధాన అర్చకుడు భక్తులకు సదుపాయాలు గణపతి నవరాత్రులకు ప్రతిరోజు సు మారుగా వెయ్యిమంది భక్తులు దర్శించుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్ర త్యేక మౌలిక సదుపాయలు కల్పించడం, స్వామి దర్శనం కల్పించడం జరుగుతుంది. మధ్యా హ్నం అన్నసమారాధన ఉంటుంది. –ఎం.ఆంజనేయరాజు, నిర్వాహకుడు,చింతామణి గణపతి దత్తక్షేత్రం -
వైద్యకళాశాలకు ప్రాణం పోయండి
మాకవరపాలెం: వైద్య కళాశాల నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పునః ప్రారంభించాలని ఉత్తరాంధ్ర ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. మండలంలోని భీమబోయినపాలెం వద్ద గత ప్రభుత్వం 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కళాశాల భవనాల నిర్మాణం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉత్తరాంధ్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఇక్కడ నిర్మించే వైద్య కళాశాల ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం వారంతా విశాఖ కేజీహెచ్‌కు వ్యయ, ప్రయాసలకోర్చి వెళ్లాల్సివస్తోందన్నారు. ఈ కళాశాల భవనాలు అసంపూర్తిగా ఉండటం వలన ఇప్పటికే వెచ్చించిన నిధులు వృథా అవుతాయన్నారు. ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా ప్రధాన పాత్ర పోషించేది విద్య, వైద్యం అన్నారు. రాష్ట్రం, దేశంలో ఉన్నత విద్య, వైద్య విద్య సౌకర్యాలు లేక డాక్టర్ చదువులకు ఇతర దేశాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. భీమబోయినపాలెం వద్ద కళాశాల భవన నిర్మాణాలు ఆపివేసి, సామగ్రిని అమరావతి తరలించారన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తలపెట్టిన కళాశాలలను అర్థంతరంగా నిలిపివేయడం సరికాదన్నారు. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఒక్క ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల లేదన్నారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మెడికల్ కళాశాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి, వివిధ విభాగాల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పాల్గొన్నారు. -
గంజాయి కార్యకలాపాలపై గట్టి నిఘా
కశింకోట: విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి సమూల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. కశింకోట పోలీసు స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరును, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి సాగు చేసేవారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ప్రోత్సాహకాలు కల్పించి జీవనోపాధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఒడిశా నుంచి మన రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా కాకుండా పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పోలీసు నిఘా పెంచామన్నారు. రేంజ్ పరిధిలో సుమారు 1700 మంది అనుమానితులను బైండోవర్ చేశామన్నారు. గంజాయి సేవించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పరిశీలిస్తున్నామన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ ఎం.శ్రావణిలను ఆదేశించారు. కశింకోట, తాళ్లపాలెం కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి సిగ్నల్స్ ఏర్పాటు గాని, ప్రత్యామ్నాయ చర్యలు గాని చేపట్టడానికి సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని ఎస్పీని ఆదేశించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కలిగించాలని చెప్పారు. సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
కె.కోటపాడు: రెండు కిలోల గంజాయిని బైక్‌పై తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ మంగళవారం పట్టుకున్నారు. కె.కోటపాడులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా బైక్‌పై అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరి వ్యక్తులను పట్టుకున్నారు. వీరు పోలీసుల నుంచి పారి పోయేందుకు యత్నించగా సిబ్బందితో కలిసి ఎస్ఐ ధనుంజయ్ పట్టుకున్నారు. వారు కాకినాడ జిల్లాకు చెందిన చెక్క దుర్గా ప్రసాద్, వనుమూడి జానకిరామ్గా పోలీసులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ట్యాంక్ కవర్లో కిలో గంజాయితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి బ్యాగ్‌లో మరో కిలో గంజాయిని పోలీసులు గుర్తించారు. అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి వారు గంజాయిని కొనుగోలు చేసి తెస్తున్నట్టు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న పల్సర్ బైక్ దొంగిలించబడిందని, దీనిపై డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదై ఉందని ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు. నిందితుల నుంచి బైక్, గంజాయి, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
సేఫ్ స్టే యాప్‌కు చిక్కిన గంజాయి నిందితుడు
రోలుగుంట/నర్సీపట్నం: సేఫ్ స్టే యాప్ ద్వారా గంజాయి నిందితుడు పోలీసులకు చిక్కాడు. నర్సీపట్నం టౌన్ సీఐ జి.గోవిందరావు, రోలుగుంట ఎస్సై రామకృష్ణారావు అందించిన వివరాలు.. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు హోటల్స్, లాడ్జిల్లో సేఫ్ స్టే యాప్‌ను ఇన్స్టాల్ చేయించారు. వారికి కేటాయించిన లాగిన్ ఐడీలో హోటల్స్, లాడ్జిలకు వచ్చే వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ యాప్‌లో వివరాలు జిల్లా ఐటీ కోర్ టీమ్‌కు వెళ్తాయి. అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, బచ్చింత గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నారావు రోలుగుంట పోలీసు స్టేషన్లో 2024లో నమోదైన గంజాయి కేసులో నిందితుడుగా ఉన్నాడు. మంగళవారం నిందితుడు నర్సీపట్నం పాలిమర్ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అతని వివరాలు యాప్‌లో నమోదు కావడంతో ఐటీ కోర్ టీమ్ అప్రమత్తమైంది. అతడు గంజాయి కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడని గుర్తించి, ఆ సమాచారం పోలీసులకు చేరవేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, రోలుగుంట పోలీసులకు అప్పగించామని సీఐ గోవిందరావు తెలిపారు. రోలుగుంటలో ఎస్సై పి.రామకృష్ణారావు నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో 78 కేజీల గంజాయితో దొరికిన ముగ్గురిలో అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేయగా, మూడో నిందితుడు చిన్నారావు పరారీలో ఉన్నాడని, యాప్ వల్ల ఇన్నాళ్లకు చిక్కాడని వివరించారు. -
జీడి పిక్కల గొడౌన్ల ఆకస్మిక తనిఖీలు
రూ.23వేలపైగా జరిమానా నాతవరం: జీడిపిక్కలు గొడౌన్లపై రెండో రోజు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మర్రిపా లెం పంచాయతీ శివారు మోక్లాంగులపాలెం, వల్సంపేట పంచాయతీ లో మంగళవారం నర్సీపట్నం మా ర్కెట్ కమిటీ కార్యదర్శి భువనేశ్వరి ఆధ్వర్యంలో రెవె న్యూ పోలీసు అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నాతవరం మండలంలో రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో జీడి పిక్కలు గొడౌన్లపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. మంగళవారం నిర్వహించిన దాడిలో మోక్లాంగులపాలెంలో మార్కెట్ పన్ను చెల్లించని 20 క్వింటాళ్లపైగా జీడి పిక్కలు దొరికాయన్నారు. నిబంధనల మేరకు మార్కెట్ పన్నులు రూ. 23వేలకు పైగా జరిమానా విధించామన్నారు. ఇక మీదట నియోజకవర్గం నాలుగు మండలాల్లో దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
అచ్యుతాపురం రూరల్: కుమారపురం గ్రామానికి చెందిన రెడ్డి మాధురి (25) రాయ్‌పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డి మాధురి అంగన్వాడీ కార్యకర్తగా కుమారపురంలో విధులు నిర్వహిస్తుంది. గత జూన్ 26న అచ్యుతాపురం కూడలికి సమీపంలో పిరమిడ్ వాటర్ ప్లాంట్ దగ్గర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైందన్నారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో నెల రోజులు చికిత్స పొంది అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. మృతురాలు ప్రమాదం జరిగిన సమయంలో గర్భిణి, చికిత్స సమయంలో నెలలు నిండడంతో ఆపరేషన్ చేసి మగ శిశువుకు జన్మనివ్వగా రెండు రోజుల వ్యవధిలో ఆ పసిపిల్లడు కూడా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కుమార్తెలు, మరిదే హంతకులు
అనకాపల్లి: గాజువాక మండలం, కూర్మన్నపాలెం, రాజీవ్‌నగర్ ప్రాంతానికి చెందిన బంకిళ సంతు(37) హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతోపాటు కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తోందన్న అనుమానంతో ఆమెను ఇద్దరు కూతుళ్లు, మరిది హతమార్చినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్‌నగర్‌కు చెందిన బంకిళ సంతు, ఇద్దరు కుమార్తెలు అనూష, మైనర్ కుమార్తె, మరిది మురళీధర్‌లు కలిసి ఉంటున్నారు. సంతు భర్త ఖతర్‌లో ఉద్యోగ రీత్యా ఉన్నాడు. సంతు కుటుంబలో ఆస్తి తగాదాలు, ఆర్థిక సమస్యలపై తరచూ వివాదాలు పడుతున్నారు. భార్యాభర్తల మధ్య దాంపత్య బంధం సరిగా లేకపోవడంతో భర్త ఖతార్ వెళ్లిపోయాడన్న ఆరోపణలున్నాయి. గతంలో భర్తపై సంతు పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇద్దరు కూతుళ్లతోనూ కొంతకాలంగా గొడవలు పడుతోంది. గతంలో ఆస్తిని కూడా అమ్మకాలు చేశారు. ఈ విషయంపై కూర్మన్నపాలెం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆస్తి అమ్మగా వచ్చిన సొమ్మును సంతు దుర్వినియోగం చేసి, కుటుంబానికి చెడ్డపేరు తీసుకొస్తోందని ఇద్దరు కూతుళ్లు, మరిది కోపంతో ఉన్నారు. ఈ నెల 13న చిన్న కూతురు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. తల్లికి చెందిన సెల్‌ఫోన్ చూడగా అసభ్యకరమైన ఫొటోలు, కాల్ రికార్డులు చూసి షాక్‌కు గురై అక్కడే ఉన్న అక్క అనూషకు తెలిపింది. కూతుళ్లు, మరిది కలిసి సంతును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న సంతును ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు కూతుళ్లు, మరిది హత్య చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున మురళీధర్ స్నేహితుడైన మోహన్ కారులో మృతదేహాన్ని దువ్వాడ మీదుగా సబ్బవరం మండలం వేట జంగాలపాలెం గ్రామానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగా సంతు హత్య కేసును ఛేదించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు. సమావేశంలో పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ విష్ణుస్వరూప్, సబ్బవరం సీఐ రామచంద్రరావు, సీసీఎస్ సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు సింహాచలం, ప్రసాదరావు, రామకృష్ణ, రమేష్, స్టేషన్ సిబ్బంది శ్రీనివాసరావు, సతీష్ కుమార్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం వైకల్యం ఉంటే రూ.15 వేలు పింఛను
ఎస్.రాయవరం: వందశాతం వికలత్వం ఉన్నవారికి రూ.15 వేలు వికలాంగ పింఛను అందజేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హైమావతి అన్నారు. సర్వసిద్ది గ్రామాన్ని మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌వో అకస్మికంగా తనిఖీ చేశారు. సర్వసిద్ది గ్రామానికి చెందిన కందలాడ రాజు పుట్టినప్పటి నుంచి మంచానికి పరిమితం అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేలు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి నేరుగా బాధిగుడి వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. దివ్యాంగుడికి రూ.15 వేలు పింఛనుకు అర్హుడని, త్వరలో మంజూరు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంఅండ్‌హెచ్‌వో వెంట సర్వసిద్ధి పీహెచ్సీ వైద్యాధికారి వాసంతి, సిబ్బంది నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యం వల్లనే విద్యార్థినిపై లైంగికదాడి
నర్సీపట్నం: పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధినిపై లెక్చరర్ శ్రీధర్ పాల్పడిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్, బాలాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా చట్టాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లే ఇటువంటి లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనకు కారణమైన లెక్చరర్ జి.శ్రీధర్ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న కాలేజీలోనే ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. లైంగికదాడి జరిగి మూడు రోజులైనా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధితురాలు మైనర్ బాలిక కాబట్టి ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి పోక్సో చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపకార్యదర్శి గౌతం,జిల్లా గర్ల్స్ కన్వీనర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో మట్టి గణపతుల పంపిణీ
తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్లో ఉద్యోగులకు మంగళవారం ఉచితంగా మట్టి విగ్రహాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతి ఇంటిలోను ప్రతిష్టించి పూజలు చేయాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.వి.ముంకర, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
పార్వతీ తనయా.. నీకు మొక్కెదన్
సాక్షి, అనకాపల్లి: తొలి పూజలందుకునే ఆదిదేవుడు.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడు. వినాయక చవితి వచ్చిందంటే ఊరూరా ఒకటే సందడి. ఇళ్లలో పూజలు.. వీధుల్లో మండపాలు.. వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు.. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది రోజులపాటు సాగే సంబరమిది. ఈ ఏడాది ఘనంగా గణపతి నవరాత్రులు నిర్వహించేందుకు జిల్లా అంతటా విస్తృత ఏర్పాట్లు చేశారు. చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయం, నక్కపల్లి మండలంలో ఒడ్డిమెట్ట లక్ష్మీ గణపతి గుడి, అనకాపల్లిలో చింతామణి గణపతి దత్త క్షేత్రం జిల్లాలో ప్రసిద్ధమైన ఆలయాలు. ఇక్కడ జరిగే వేడుకలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వినాయక పందిళ్లలో నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో 126 అడుగుల వినాయక విగ్రహం, వేల్పుల వీధిలో 30 అడుగుల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యికి పైగా గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల నుంచి నిర్వాహకులు అనుమతులు పొందారు. గణేష్ ఉత్సవాలను ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు. ఉత్సవాల నిర్వహణలో అల్లర్లకు కమిటీలదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగు డాన్సులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. టిప్పర్లతో తిప్పలు -
కోనాంలోకి భారీగా ఇన్‌ఫ్లో
చీడికాడ: కోనాం జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో జలాశయం నీటిమట్టం ఒక్కసారిగా పెరుగుతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు జలాశయం ఎగువన కురిసిన అల్పపీడన వర్షాలతో ఆదివారం వరకు 160 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి 960 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయం నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి మంగళవారం సాయంత్రానికి 99.05 మీటర్లకు చేరుకుంది. ప్రమాదస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా 100 మీటర్లకు చేరుకోగానే నీటి విడుదలను పెంచనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దిగువకు 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. -
కొక్కిరాపల్లిని డీ నోటిఫై చేయాలని కౌన్సిలర్ దీక్ష
యలమంచిలి రూరల్: కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1378 ప్రకారం కొక్కిరాపల్లి గ్రామాన్ని యలమంచిలి మున్సిపాలిటీ నుంచి డీ నోటిఫై చేయాలన్న డిమాండ్‌తో అధికార టీడీపీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ మంగళవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం కౌన్సిల్ ‘కూటమి’ చేతిలో ఉన్న సమయంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో టీడీపీ కౌన్సిలర్ దీక్షకు దిగడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన నాయకులే.. జీవో అమలు చేయాలని దీక్షకు దిగడం గమనార్హం. మున్సిపాలిటీలో కూటమి నాయకులతో తీర్మానం చేయించడం కోసం ఇలా నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సి రావడమేమిటని చర్చ సాగుతోంది. -
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాల స్వీకరణ
తుమ్మపాల: ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు, పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యన్నారాయణరావు రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. ఓటర్ జాబితాపై నెలవారి సమావేశాల్లో భాగంగా కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదు కొరకు, ఓటురు తొలగింపునకు, ఓటరు ఐడీ కార్డు సవరణల కోసం 1,354 దరఖాస్తులు నమోదయ్యాయన్నారు. వీటిలో 820 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని డీఆర్వో రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు, పరస్పర అనుకూలమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు వాసునాయుడు, అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (అనకాపల్లి), పి.నాగేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, కె.హరినాధబాబు, జి.గున్నబాబు, తుట్టా రమణ, పి.దుర్గారావు, గంటా సూరిబాబు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ : క్లీనర్ మృతి
నక్కపల్లి: జాతీయ రహదారిపై గొడిచర్ల కొత్తూరు సమీపంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో క్లీనర్ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయింది. దాంతో రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన క్లీనర్ ప్రదీప్ రామ్‌నాయక్(55) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ముందుభాగం నుజ్జయింది. -
ఎస్పీ కార్యాలయానికి 46 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 46 అర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పలువురు అర్జీదారులు తమ సమస్యలపై ఎస్పీ తుహిన్‌సిన్హాకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ తగాదాలు –20, కుటుంబ కలహాలు –3, మోసపూరిత హామీలపై ఫిర్యాదులు– 4, ఇతర విభాగాలకు చెందినవి –19 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు. చట్టపరిధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కిందస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు వెదురుపర్తి విద్యార్థినులు
శ్రీజత, హాసినిలతో ఉపాధ్యాయులు కశింకోట: వెదురుపర్తి హైస్కూలుకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల లంకెలపాలెంలో జిల్లా స్థాయిలో టీం సెలక్షన్స్ జరిగాయి. దీనిలో జూనియర్ విభాగంలో హైస్కూలుకు చెందిన ఎన్.శ్రీజత, కె.హాసిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు హెచ్ఎం కె.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, పీ డీ ఎ.నూకరాజు సోమవారం తెలిపారు. వీరు వ చ్చే నెలలో ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వీరికి అభినందనలు తెలిపారు. -
అన్నదాతలకు ఎరువు కష్టాలు!
అరకొరగా యూరియా పంపిణీ పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి పడిగాపులు గతంలో ఈ పరిస్థితి లేదు.. గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ పాలనలో యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రాలేదు. అప్పట్లో పీఏసీఎస్‌కు సరిపడా యూరియా వచ్చేది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా యూరియాను ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సరిపడా యూరియాను ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం, అధికారులు లేనట్టుగా ఉంది. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది వేచి ఉన్నా దక్కని పరిస్థితి నెలకొంది. రైతులకు అవసరమయిన యూరియాను వెంటనే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –త్రిశూలం ఈశ్వరరావు, రైతు, చౌడువాడ మునగపాక/కె.కోటపాడు : వివిధ రకాల పంటల సాగుకు అనువుగా ఎరువులను రప్పించాల్సి ఉన్నా పాలకులు గాని,అధికారులు గాని పట్టించుకోలేదంటూ రైతులు వాపోతున్నారు. ప్రధానంగా యూరియా కోసం రైతులు నానా హైరానా పడుతున్నారు. సోమవారం మునగపాక పీఏసీఎస్ కార్యాలయం వద్ద అరకొరగా యూరియా అందించడంతో రైతులు క్యూ కట్టారు. ఎండలో గంటల తరబడి నిలబడి యూరియాను తీసుకువెళ్లారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా కోసం అవస్థలు పడుతున్నామంటూ రైతులు వాపోయారు. రెండు రోజుల క్రితం 12 టన్నుల మాత్రం యూరియా రప్పించడంతో వాటి కోసం రైతులు పీఏసీఎస్ కార్యాలయానికి పరుగులు తీయాల్సి వచ్చింది. కె.కోటపాడు మండలం చౌడువాడ పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు ఉదయం ఆరు గంటల నుంచే పడిగాపులు కాశారు. పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందన్న సమాచారంతో ఆ పరిధిలో గల గ్రామాలైన చౌడువాడ, గుల్లేపల్లి, రొంగలినాయుడుపాలెం, పైడంపేట, పాచిలవానిపాలెం నుంచి వందలాదిగా రైతులు పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. వరి సాగుకు అనువైన కాలంలో యూరియాను వేయడం మంచిదన్న కారణంగా ఉదయం ఆరు గంటలకే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. పాస్ పుస్తకాలతో పాటు జెరాక్స్ పత్రాలను క్యూలైన్లో ఉంచారు. పీఏసీఎస్‌కు ప్రస్తుతం 12 టన్నుల యూరియా మాత్రమే రావడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులకు ఎలా పంపిణీ చేయాలో అని సిబ్బంది తలలు పట్టుకున్నారు. యూరియా ఎప్పడు ఇస్తారో అని ఎదురు చూసిన రైతులకు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసి మధ్యాహ్నం 2 గంటల తరువాత పంపిణీ చేపట్టారు. ఒక్క బస్తా యూరియా అయినా దక్కుతుందని ఎదురు చూసినా పలువురు రైతులకు ఎరువులు అందక నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటి వరకూ వచ్చిన 36 టన్నుల యూరియాను పీఏసీఎస్ ద్వారా పంపిణీ చేశామని, సీఈవో బత్తిన సత్యనారాయణమూర్తి తెలిపారు. రైతులకు ఖరీఫ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించక, మరోవైపు కూటమి ప్రభుత్వం నుంచి సరైన తోడ్పాటు లేక అప్పులతో పెట్టుబడులు, విత్తనాలు, ఎరువుల కొరత రైతులను అవస్థల పాలు చేస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాను అందించేవారు. ఈ ప్రక్రియతో రైతులకు ఇబ్బందులు తప్పేవి. సకాలంలో ఎరువులు అందించడంతో పంటల సాగుపై ఆసక్తి చూపేవారు. కూటమి ప్రభుత్వ వచ్చాక రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో పాటు పెట్టుబడి సాయం, ఎరువులు, విత్తనాలు సైతం రైతులకు సకాలంలో అందించడంలో విఫలం కావడంతో రైతులు సాగుకు అష్టకష్టాలు పడుతున్నారు. -
ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించాలి
వైద్య సిబ్బందితో డీఎంహెచ్‌వో హైమావతి అనకాపల్లి: క్యాన్సర్‌పై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో వైద్యం అందించినట్లయితే ఆరోగ్యంగా జీవిస్తారని డీఎంహెచ్‌వో ఎం.హైమావతి తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ వైద్యులతో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలకు క్యాన్సర్ లక్షణాలు కనిపించినట్లయితే మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్, రక్తపరీక్షలు చేయించాలన్నారు. కొంతమంది వ్యక్తులకు క్యాన్సర్ 3, 4 దశల్లో ఉన్నప్పుడు తెలుసుకుంటారని, అటువంటి వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్సీడీ పీవో డాక్టర్ ఎస్తేర్‌రాణి, వైద్యులు పాల్గొన్నారు. -
రెవెన్యూ కష్టాలు ఇన్నన్ని కావయా..
తుమ్మపాల: ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)తో తమ సమస్యలు తీరడం లేదని, తమ గోడు పట్టించుకోవడం లేదని అర్జీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై వినతులు ఇచ్చినా పరిష్కారం లభించకపోవడంతో పదేపదే కలెక్టరేట్‌కు రావాల్సి వస్తోందన్నారు. తమను పలువురు సిబ్బంది చులనకగా చూస్తున్నారని, తమ బాధ చెప్పుకున్నందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో దాదాపు 80 శాతం అర్జీలు రెవెన్యూ భూ సంబంధితమైనవే అయినప్పటికీ జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. విచారణ నిమిత్తం వచ్చే అధికారులు అర్జీదారులతో మాట్లాడుతూ తీసుకున్న ఫొటోలను అప్లోడ్ చేసి సమస్య పరిష్కరించినట్టు జవాబు ఇవ్వడంతో అవాక్కవుతున్నామని చెప్పారు. కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఈవారం మొత్తం 344 అర్జీలు నమోదు కాగా వాటిలో 188 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. నా భూమిని కొడుకులు లాగేసుకున్నారు.. భూ పంపకాల్లో తనకు కేటాయించిన రెండెకరాల భూమిని ఆన్లైన్లో తొలగించి తప్పుడు సంతకాలతో కొడుకులు వారి పేరున ఆన్లైన్ చేసుకుని వృద్ధాప్యంలో ఉన్న తనను ఒంటరిగా వదిలేశారని నాతవరం మండలం పి.కె.గూడెం గ్రామానికి చెందిన లోగుడు నారాయణమ్మ ఫిర్యాదు చేశారు. తన భర్త ద్వారా వచ్చిన భూమిని ఇద్దరు కుమారులకు 6 ఎకరాల చొప్పున పంపకాలు చేసి మిగిలిన రెండెకరాలు తన వద్ద ఉంచుకున్నానని, తన తదనంతరం కుమార్తెలకు చెందాలని రాశానన్నారు. ఇది ఇష్టం లేని కుమారులు తాను బతికుండగానే తమ పేరిట మార్చేసుకున్నారని చెప్పారు. భూమిని తన పేరున ఆన్లైన్ చేసి న్యాయం చేయాలని కోరారు. రెండు నెలల క్రితం అర్జీ చేసినప్పటికీ స్పందన లేదన్నారు. -
కూలీ స్థలం కబ్జా చేశారు
తన ఇంటి స్థలం కబ్జా అయిందని పదే పదే ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదంటూ అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందిన నగిరెడ్డి సన్యాసిరావు అర్జీ సమర్పించారు. గ్రామంలో సర్వే నెం.50లో తన పేరున గల (అసెస్మెంట్ నెం.31) ఇంటిస్ధలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను కూలి పనుల నిమిత్తం కుటుంబంతో గాజువాక మండలం దువ్వాడలో ఉంటున్నానని, దీనిని ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు తన ఇంటి స్థలంలో నిర్మాణం చేస్తున్నారని, దీనిపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కలెక్టరేట్లో మూడుసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం లభించలేదని ఆయన వాపోయారు. -
కూటమి పార్టీల్లో ఫ్లెక్సీల లొల్లి
నక్కపల్లి : కూటమి పార్టీల్లో ఫ్లెక్సీల లొల్లి రాజుకుంది. హోంమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అందరి ఫొటోలు వేసి తమ పార్టీ నాయకుడు గెడ్డం బుజ్జి ఫొటో వేయకపోవడం పట్ల జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా టీడీపీ వైఖరిపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ముందుంది ముసళ్ల పండగ రాబోయే ఎన్నికల్లో జనసైనికుల సత్తా ఏంటో చూపిస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమయింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట మండలం పెంటకోటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు రుణాలు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వెనుక టీడీపీ నాయకులు పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జిల్లా, నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులందరి ఫొటోలు వేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి గెడ్డం బుజ్జి ఫొటో వేయలేదు. మిగిలిన చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా బుజ్జి ఫొటో వేయకపోవడాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా ఫేస్బుక్, వాట్సాప్‌గ్రూపులు, ఇన్స్టాల్లో టీడీపీ నాయకుల వైఖరిని ఎండ గడుతున్నారు. మంత్రి అనితతో పాటు పలువురు టీడీపీ నాయకుల పేజ్‌లను ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన, బీజేపీలకు టీడీపీ వాళ్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది ఆ రెండు పార్టీల కార్యకర్తల్లో ఆవేదన నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఎస్.రాయవరం మండలంలో జనసేన పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడి ఇంటికి కుళాయి ఇవ్వకుండా అక్కడ టీడీపీ సర్పంచ్ అడ్డుకున్నాడు. నిలదీసిన జనసేన నాయకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, జనసేన నాయకులు బాధితుడికి అండగా నిలిచారు. పట్టుబట్టి కుళాయి వేయించారు. తాజాగా నియోజకవర్గ సీనియర్ నాయకుడి ఫొటో వేయకుండా కావాలనే అవమానించారంటూ రగిలిపోతున్నారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలు పరిష్కరించాలి
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఆయా శాఖల అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. సమర్పించిన అర్జీల సమాచారం కోసం అర్జీదారులు టోల్ ఫ్రీ నంబరు 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చని అర్జీదారులకు సూచించారు. ఈ వారం మొత్తం 344 అర్జీలు నమోదు కాగా, వాటిలో 188 అర్జీలు రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారం కానివే ఉండటం గమనార్హం. ఆర్.కొత్తూరు గ్రామాన్ని నాతవరంలో విలీనం చేయాలని ధర్నా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలం ఆర్.కొత్తూరు గ్రామాన్ని అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరసన చేశారు. కొయ్యూరు గిరిజన మండలంలో గిరిజనేతరులు ఉన్న ఆర్.కొత్తూరు గ్రామాన్ని చేర్చడంతో తమ భూములకు ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు చేయడం లేదని వాపోయారు. దాంతోపాటు సమీపంలో నాతవరం మండల కేంద్రాన్ని దాటుకుని అత్యధిక దూరంలో కొయ్యూరుకు చేరుకోవాల్సి వస్తుందని, తమ ఆవేదనను అధికారులు అర్థం చేసుకుని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేయాలని కోరారు. శ్మశాన వాటిక ఆక్రమణపై గవరవరం గ్రామస్తుల నిరసన శ్మశాన వాటికను ఆక్రమిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చోడవరం మండలం గవరవరం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గ్రామంలో ఎనిమిది కులాల వారికి సర్వే నంబరు 111–8లో 1.23 ఎకరాల శ్మశాన వాటిక ఉందన్నారు. గతంలో కొంత స్థలం ఆక్రమణకు గురి కాగా, కోర్టు ఆదేశాలతో 80 సెంట్ల భూమి ప్రస్తుతం శ్మశానవాటికగా ఉందని, దాన్ని కూడా మాజీ సర్పంచ్ వెంకటస్వామినాయుడు ఆక్రమిస్తున్నారని, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు. -
రూ.25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని వినతి
నక్కపల్లి: మండలంలో బల్క్‌డ్రగ్ పార్క్, స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం నివాస ప్రాంతాలను త్యాగం చేసిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని డీఎల్‌పురం సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు కోరారు. ఈ మేరకు సోమవారం నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణకు వినతి పత్రం ఇచ్చారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం నిర్వాసితులు ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రూ.8.90 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని, ఇది ఏ మాత్రం చాలదన్నారు. నిర్వాసితులకు పెద బోదిగల్లం వద్ద పునరావాస కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారని, అక్కడ ఇల్లు నిర్మాణానికి ప్యాకేజీ ఏమాత్రం సరిపోదన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో యజమానితోపాటు 18 ఏళ్లు వయసు నిండిన వారికి వివాహమైన ఆడపిల్లలకు ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు ఆర్ కార్డులు ఇవ్వాలని, స్థానికంగా ఏర్పాటు చేసే కంపెనీల్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. చందనాడ, తమ్మలపేట అమలాపురం మూపర గ్రామాల్లో కొంతమంది ఇళ్లు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని, ఈ సమస్యా పరిష్కరించాలని కోరారు. సీపీఎం మండల కన్వీనర్ ఎం రాజేష్ పాల్గొన్నారు. -
వీవోఏ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా రూపాదేవి
అనకాపల్లి: ఏపీ వీవోఏ( వెలుగు యానిమేటర్లు) సంఘం జిల్లా అధ్యక్షురాలిగా సీహెచ్.రూపాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.వెంకటలక్ష్మి, జిల్లా గౌరవాధ్యక్షుడిగా వి.వి.శ్రీనివాసరావు, కోశాధికారిగా సిహెచ్.ఎల్.ఎన్. రాజేష్, జిల్లా కార్యదర్శులుగా కె. కనకలక్ష్మి (కోటవురట్ల), ఎం రాజ్యలక్ష్మి(నర్సీపట్నం), జి. సత్యవతి (రావికమతం), అప్పలనాయుడు(చీడికాడ), భవాని (కశింకోట), ఉష (మునగపాక), కె.సూరిబాబు (దేవరాపల్లి), లావణ్య (అచ్యుతాపురం), క్రాంతి (నాతవరం), రాము (అనకాపల్లి), మరో 25 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రూపాదేవి మాట్లాడుతూ పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. వీవోఏలకు గుదిబండగా ఉన్న మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దుతోపాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కనీస వేతనాలు, గ్రూపు ఇన్సూరెన్స్, యూనిఫాం, ఐడీ కార్డులు తదితర సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
యువత క్రీడలపై మొగ్గు చూపేలా ప్రోత్సాహం
తుమ్మపాల: క్రీడలను ప్రోత్సహించి, చురుకై న క్రీడాకారులను తయారు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి జిల్లా క్రీడా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, యువత వ్యసనాలకు బానిసకాకుండా క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా క్రీడా మైదానాలు సిద్ధం చెయ్యాలని కమిటీ సభ్యులకు సూచించారు. నర్సీపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో భూమిని సేకరించి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్విమ్మింగ్ ఫూల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని గూర్తించిన 15 మండల కేంద్రాల్లో 20 సెంట్లు చొప్పున భూమిని సేకరించడం జరిగిందన్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి వాలీబాల్ కోర్టులు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని జెడ్పీ సీఈవో నారాయణమూర్తిని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మాటాడుతూ పికెల్ బాల్ కోర్టు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించామని ఏపి విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ప్రసాద్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, జిల్లా క్రీడాలు అభివృద్ధి అధికారి ఎల్.వెంకట రమణ, జెడ్పి డిప్యూటీ సీఈవో రాజకుమార్, డీపీవో సందీప్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజుల వాణి, డ్వామా పీడీ పూర్ణిమా దేవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జీడి పిక్కల అక్రమ నిల్వలపై కొరడా
నాతవరం: జీడి పిక్కల అక్రమ నిల్వలపై వ్యవసాయ మార్కెట్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ కొరడా ఝుళిపించారు. ఆయన సోమవారం నాతవరం గ్రామంలోని జీడి పిక్కల గొడౌన్లపై సోమవారం ఆకస్మికంగా దాడులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మార్కెట్ సెస్ చెల్లించకుండా వ్యాపారులు రెండు చోట్ల నిల్వ చేసిన జీడి పిక్కల బస్తాలను గుర్తించారు. ఒక చోట 140 క్వింటాళ్లు, మరో చోట 90 క్వింటాళ్లు జీడిపిక్కల బస్తాలు మార్కెట్ పన్నులు చెల్లించకుండా అక్రమంగా నిల్వ చేసినట్టు నిర్ధారించారు. అలాగే జీడి పిక్కలు వ్యాపారం చేసే వారికి లైసెన్స్ సైతం లేదని తెలుసుకున్నారు. 140 క్వింటాళ్లకు రూ,19,500 మార్కెట్ పన్ను విధించగా.. వ్యాపారికి లైసెన్సు లేకపోవడంతో లైసెన్సు ఫీజు కింద మరో రూ.5,100 జరిమానా విధించామని సుధాకర్ తెలిపారు. 90 క్వింటాళ్ల జీడి పిక్కలకు మార్కెట్ పన్ను రూ.9వేలు, వ్యాపారికి లైసెన్స్ ఫీజు కోసం రూ.5100 జరిమానా విధించామన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. జీడి పిక్కల అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా పెట్టాలని నర్సీపట్నం మార్కెట్ కమిటీ సెక్రటరీ భువనేశ్వరికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, పాయకరావుపేట, మాడుగులు, చోడవరం మార్కెట్ కమిటీల సెక్రటరీలతో పాటు నర్సీపట్నం మార్కెట్ కమిటీ సిబ్బంది, స్థానిక ఆర్ఐ నాగరా,జు వీఆర్వో బాబు, పోలీసులు పాల్గొన్నారు. -
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
యలమంచిలి రూరల్ : ఏటికొప్పాక శివారు ప్రాంతంలో కొండను తవ్వి గ్రావెల్‌ను అక్రమంగా తరలించడానికి వినియోగించిన పొక్లెయిన్, ట్రాక్టర్‌ను యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర ఆదివారం స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన సిబ్బందిని అక్కడకు పంపించి వాహనాలను స్వాధీనపర్చుకుని యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆదివారం సెలవు కావడంతో సోమవారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. పొక్లెయిన్, ట్రాక్టర్ సీజ్ -
ఆగని అక్రమ గ్రావెల్ దందా
● సెలవు రోజుల్లో దూకుడు పెంచిన అక్రమార్కులు ● పత్తాలేని రెవెన్యూ అధికారులు అచ్యుతాపురం : సెలవులొస్తే అధికారులకు విశ్రాంతి. గ్రావెల్ అక్రమార్కులకు నిద్ర పట్టదు.సెలవు దినాల్లో స్తబ్థుగా ఉండే అధికారుల అలసత్వాన్ని ఉపయోగించుకొని గ్రావెల్ డిమాండ్‌కు తగ్గట్టుగా జడలు విప్పుతున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకూ గ్రావెల్ తరలింపు జోరుగా సాగిపోయింది. రహదారుల అవసరాలకని కొందరు మీడియా ముందు ప్రకటించినప్పటికీ ఎటువంటి అనుమతు లు లేకుండా గ్రావెల్‌ను తరలించుకుపోవడం నేరమే. వాల్టా చట్టం ఉల్లంఘనతో స్థానిక పరిస్థితు ల వాతారణ సమతుల్యత దెబ్బతింటుందనే స్పృహ లేకుండా గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. దీంతో కొండలు రూపురేఖలు కోల్పోతున్నాయి. ఇటీవల కాలంలో లే అవుట్లకు, పరిశ్రమల అవసరాలకు గ్రావెల్‌ను తరలించుకుపోవడం షరా మామూలు అయ్యింది. భూగర్భ గనుల శాఖ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన, నిర్ణీత కాల పరిమితితో గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తారు. దీనికి టన్నుకు కొంత మేరకు సీనరైజ్ చెల్లించాలి. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను తరలించుకుపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. కంపెనీలు ఎలా అనుమతిస్తున్నాయో..? సెజ్‌లోని పరిశ్రమలకు గ్రావెల్ అవసరం ఎక్కువగా పడింది. అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తరణకు కూడా అవసరం అయ్యింది. ఆయా పనులకు అధికారికంగా బిల్లులు చెల్లిస్తారు. కానీ ఎటువంటి సీనరైజ్ బిల్లులు లేకుండా గ్రావెల్‌ను సమకూర్చుకుంటున్న సదరు సంస్థలు ఎలా నగదు చెల్లిస్తున్నాయో? అని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కొన్ని లారీ నంబర్లను తమ వద్ద ఉంచుకొని వాటిని వదిలేస్తున్నారని సమాచారం. కొండల వద్ద పర్యవేక్షణ, నిఘా ఉంచాల్సిన వీఆర్ఓలు, తలయారీలు నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నారు. విజిలెన్స్ దాడులు కూడా జరగడం లేదు. దీంతో యలమంచిలి నియోజక వర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు అధికార హోదాలో జరగడం స్థానికులను ఔరా అనిపిస్తుంది. -
మూడు తరాల్లోనూ ఉపాధ్యాయులే
అచ్యుతాపురం : ఆ కుటుంబంలో మూడు తరాల వారు ఉపాధ్యాయ ఉద్యో గం చేసే అదృష్టాన్ని పొందారు. అచ్యుతాపురం మండలంలోని మడుతూరుకు చెందిన నామాల వెంకటరమణ ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీవిరమణ పొందిన తర్వాత చనిపోయారు. వెంకటరమణ కుమారుడు నామాల సత్యశ్రీనివాస్ ప్రస్తుతం హరిపాలెం ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ కుమర్తె నీలిమ తాజాగా 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టు, ఎస్జీటీ పోస్టుకు కూడా ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్ బయోలజికల్ సైన్స్‌లో జిల్లా స్థాయిలో 4వ ర్యాంక్,ఎస్జీటీ విభాగంలో జిల్లా స్థాయి లో 96వ ర్యాంక్ సాధించారు. తొలి ప్రయత్నంలోనే తన కుమార్తె రెండు పోస్టులకు ఎంపికయ్యారని, మా కుటుంబంలోని మూడు తరాల వారికి ఉపాధ్యాయ వృత్తి చేసే అదృష్టం దక్కిందని శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. -
ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక
నక్కపల్లి : మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన యువకుడు ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పిట్ల స్వామి నరేంద్ర తల్లిదండ్రులు కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తన రెక్కల కష్టం మీద ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి కొడుకును ఉన్నత చదువులు చదివించారు. నరేంద్ర ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో ఏపీఎస్పీ సివిల్ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అలాగే డీఎస్సీ ఫలితాల్లో ఎస్జీటీ విభాగంలో 84.65 శాతం మార్కులతో 100వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడిగా కూడా ఎంపికయ్యాడు. ఒకేసారి తమ కుమారుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మమకారంతో గతంలో నేవీలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని నరేంద్ర తెలిపాడు. ఉపాధ్యాయుడిగా చేరి గ్రూప్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయి ప్రజాసేవచేసే ఉన్నత ఉద్యోగం సంపాదించడమే లక్ష్యమని తెలిపారు. -
పాలిటెక్నిక్‌లో వసతి వెతలు
మురళీనగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సరైన వసతి సదుపాయం సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. వసతి గృహాలు అందుబాటులోకి రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బాలికలు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి విశాఖలో కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్), పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, చోడవరం, భీమిలి బాలికలు, పాడేరులో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో చాలా కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 9 ప్రభుత్వ కాలేజీల్లో ● భీమిలి మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో బాలికలకు వసతి సదుపాయం ఉంది. ● పాడేరు ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌లో బాలురకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. నర్సీపట్నంలో హాస్టల్ భవనం ఉన్నా.. కోవిడ్ తర్వాత మూసేశారు. హాస్టల్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ దీని నిర్వహణను పట్టించుకోలేదు. ● ఇక అనకాపల్లి, చోడవరం, పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలల్లో వసతిగృహాలే లేవు. దీంతో అక్కడ కాలేజీ దూరప్రాంత విద్యార్థులు చేరినా బయట వసతి వెదుక్కోవాల్సిన పరిస్థితి. ● కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో బాలురకు మాత్రమే స్టూడెంట్స్ మేనేజిమెంట్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో 350మంది వరకు బాలురకు అవకాశం కల్పిస్తున్నారు. ● విశాఖపట్నంలోని కంచరపాలెం పాలిటెక్నిక్ ప్రాంగణంలో బాలికల కోసం ప్రత్యేకంగా వసతి గృహాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించినా అందుబాటులోకి తేవడంలో సాంకేతిక విద్యాశాఖ విఫలమైంది. ఈ కాలేజీలో 500మందికి పైగా బాలికలు చదువుతున్నారు. పాలిటెక్నిక్‌లో 100మంది వరకు వసతి కల్పించే విధంగా భవనం నిర్మించినా ఏళ్ల తరబడి నిరుపయోగంగానే ఉంది. ● ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో వుమెన్స్ హాస్టల్‌ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఇక్కడ 50 మంది విద్యార్థులకు వసతి కల్పించారు. అయితే, ఇక్కడ ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో విద్యార్థినులకు రక్షణగా కాలేజీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరికి సమీపంలోని పాలిటెక్నిక్ బాలుర హాస్టల్ నుంచి భోజనాలు తీసుకువస్తున్నారు. భోజనాలు తీసుకురావడానికి ఆటో చార్జీలను విద్యార్థులే భరిస్తున్నారు. ‘గైస్’ కాలేజీ హాస్టల్‌కు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఇక్కడే భోజనం వండి అందించే ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ డిమాండ్‌కు తగిన విధంగా హాస్టల్ సీట్లు లేవు. గైస్‌లో నాలుగు కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో ఏయూ రీజియన్‌తో పాటు ఎస్వీ యూనివర్సిటీ రీజియన్‌కు ప్రత్యేకంగా కొన్ని సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. దీంతో ఎస్వీయూ పరిధి జిల్లాల నుంచి బాలికలు ఎక్కువగా ఈ కళాశాలలో చేరుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలోనూ ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులు చేరారు. దీంతో వీరు కాలేజీ హాస్టల్లోనే ఉండాలని అభిలషిస్తున్నారు. గైస్ హాస్టల్లో కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. డిమాండ్ వంద మందికి పైగా ఉంది. పాలిటెక్నిక్ కాలేజీ బాలికలకు కూడా ఇక్కడ వసతి కల్పిస్తున్నారు. దీని వల్ల ఇతర దూర ప్రాంత జిల్లాల బాలికలకు వసతి కల్పించలేకపోతున్నారు. ముఖ్యంగా ఫస్టియర్ విద్యార్థులకు వసతి కొరత ఉంది. కంచరపాలెం పాలిటెక్నిక్ ప్రాంగణంలో నిర్మించిన భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తే సుమారు వందమందికి వసతి కల్పించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థినులకు వసతి సమస్య తీరుతుంది. ఆ దిశగా సాంకేతిక విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అనకాపల్లి పోలీసుల సైకిల్ ర్యాలీ
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ నగరం విశాలాక్షినగర్‌లోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానం నుంచి అనకాపల్లి జిల్లా పోలీసులు ఆదివారం ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. కై లాసగిరి కూడలి నుంచి బయలుదేరి జోడుగుళ్లపాలెం నుంచి బీచ్ రోడ్డులో సీతకొండ మీదుగా సాగర్‌నగర్ వరకు ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కీలకమన్నారు. ఆరోగ్యం దేశాన్ని బలోపేతం చేసి శక్తని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
మా భూసమస్య తేలాకే సర్వే చేయండి
రోలుగుంట : మా భూసమస్య తేలిన తరువాతే సర్వే చేసుకోవాలని, తమ సాగులో ఉన్న భూములకు సంబంధించిన అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని, అధికారులు ఇష్టానుసారం భూ రికార్డులు తారుమారు చేస్తే సహించబోమని జేపీ అగ్రహారం రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని రామాలయంలో వారు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దుంగల శంకర్రావు, మాజీ సర్పంచ్ రొంగల రమణ మట్లాడుతూ పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న ఈనాం భూమి సాగు అర్హత తమకు, తమ పిల్లలకు వంశపారంపర్యంగా వర్తిస్తుందన్నారు. సాగులోను, రికార్డుల్లోను తామే ఉన్నా, రెవిన్యూ కార్యాలయంలో రికార్డులు మార్చడం, భూ సర్వే నంబర్లను తహసీల్దార్లు ఇష్టానుసారం మార్పు చేస్తున్నారన్నారు. తమకు ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండా బదిలీపై వెళ్లిపోయిన కృష్ణమూర్తి వేరొకరికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేయడం అన్యాయమన్నారు. అతనిపై కోర్టులో కేసు ఉందన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఆర్డీవో, జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇటీవల తహసీల్దార్ నాగమ్మ సర్వే చేస్తామని గ్రామంలోకి వచ్చి భూములు కాదు, గ్రామ సరిహద్దులు గుర్తిస్తామని చెప్పారని, తొలుత సరిహద్దుల అని చెప్పి, తరువాత సర్వే పూర్తి చేస్తారని అనుమానంగా ఉందన్నారు. తమ భూ సమస్యపై అధికారులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేసిన తరువాతే సర్వే ప్రక్రియ చేపట్టాలని రైతులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేపీ అగ్రహారం రైతుల డిమాండు -
సీఆర్‌సీఎఫ్‌వీ భవనానికి శంకుస్థాపన
పాయకరావుపేట : పెంటకోట తీరప్రాంతంలో కమ్యూనిటీ రీసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్ (సీఆర్‌సీఎఫ్‌వీ) పథకం కింద భవనాలు నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మత్స్యకారుల సౌలభ్యం కోసం కమ్యూనిటీ హాల్, చేపల ప్లాట్ ఫారాలు, సోలార్ లైటింగ్, తదితర ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, చించలపు పద్దూ, చిక్కాల శ్రీనివాసరావు, యాళ్ల వరహాలు, కొప్పిశెట్టి వెంకటేష్, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
విశాఖ డెయిరీ అవినీతిపై విచారణ జరపాలి
మునగపాక : విశాఖ డెయిరీ అవినీతిపై విచారణ చేపట్టాలని ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు డిమాండ్ చేశారు. మండలంలోని చూచుకొండ, గణపర్తి, పల్లపు ఆనందపురం, కుమారపురం గ్రామాల్లో విశాఖ డెయిరీ అవినీతిపై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కోరుతూ రైతులకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో పాడి రైతులకు కల్పతరకువుగా ఉన్న విశాఖ డెయిరీని తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను నష్టాల పాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత పాలకవర్గం అంతులేని అవినీతికి పాల్పడుతుందన్నారు. పాల ధరను కూడా తగ్గించడం ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విశాఖ డెయిరీని కాపాడుకునేందుకు త్వరలో జరగనున్న జనరల్ బాడీ సమావేశానికి రైతులు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో పాడిరైతులు కాండ్రేగుల రమణ,చదరం వెంకటరమణ, పొలమరశెట్టి వెంకటప్పారావు,కాండ్రేగుల నాయుడు పాల్గొన్నారు. అప్పారావు, బ్రహ్మాజీ -
చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్య
యలమంచిలి రూరల్ : చోరీ కేసులో నిందితుడుగా ఉన్న యలమంచిలి పట్టణం టిడ్కో గృహ సముదాయానికి చెందిన నరాలశెట్టి జ్యోతిష్ దుర్గాప్రసాద్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 20వ తేదీన స్థానిక టిడ్కో కాలనీ సమీపంలో మామిడి తోట వద్ద ఆత్మహత్యకు పాల్పడగా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు పట్టణ ఎస్ఐ కె. సావిత్రి ఆదివారం రాత్రి విలేకరులకు తెలిపారు. మృతుడు తల్లిదండ్రులు, భార్య, అన్నయ్య, వదినలతో కలిసి స్థానిక టిడ్కో కాలనీలో నివాసముంటున్నాడు. జులాయిగా తిరగడం, చోరీలు చేయడానికి అలవాటుపడిన మృతుడు ఈ నెల 18వ తేదీన వదినకు ఇచ్చిన రూ.2 వేలు తిరిగి ఇవ్వాలని అడగ్గా తండ్రి ఇచ్చిన డబ్బు మళ్లీ ఎందుకు అడుగుతున్నావు. నిన్ను, నీ భార్యను అన్నయ్యే పోషిస్తున్నాడు కదా అని మందలించాడు. అనంతరం ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన జ్యోతిష్ దుర్గాప్రసాద్ మళ్లీ ఈ నెల 20వ తేదీ రాత్రి టిడ్కో కాలనీకి వచ్చి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను బెదిరించాలని తన శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. భార్య,కుటుంబ సభ్యులు మంటలు ఆర్పిన తర్వాత తీవ్రంగా గాయపడిన జ్యోతిష్ దుర్గాప్రసాద్‌ను 108 వాహనంలో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం జ్యోతిష్ దుర్గాప్రసాద్ మృతి చెందాడు. తండ్రి నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడిపై తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో చోరీ కేసు నమోదై ఉంది. -
ఇలాగేనా స్ఫూర్తి నింపేది!
విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో.. పాఠశాల స్థాయిలోనే వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ పోటీలకు స్పందన కరువైంది. కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రూపొందించిన ఈ కార్యక్రమానికి ఈ ఏడాది జిల్లాలో అనుకున్న స్థాయిలో స్పందన కనిపించడంలేదు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 602 స్కూళ్లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 5 స్కూళ్ల నుంచి మాత్రమే ప్రాజెక్టులు నమోదయ్యాయి. యలమంచిలి రూరల్: చిట్టి బుర్రల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను రేకెత్తించే ఇన్స్పైర్ మనక్ స్కీమ్‌ను దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రవేశపెట్టారు. విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తొలుత ఆసక్తి గల విద్యార్థులను గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో కేవలం 5 స్కూళ్ల నుంచి 25 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. జిల్లాలో 602 పాఠశాలల నుంచి సుమారు 2500 మంది విద్యార్థులు నవ ఆలోచనలు పంపేందుకు అవకాశం ఉండగా ఇప్పటివరకు 25 మందే స్పందించారు. ఇన్‌స్పైర్‌లో ప్రతిభ కనబరిచే విద్యార్థులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇన్‌స్పైర్‌కు ఆసక్తి తగ్గడానికి కూటమి ప్రభుత్వం టీచర్లపై మోపుతున్న వివిధ రకాల ఒత్తిడులే కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి యోగాంధ్ర, మెగా పీటీఎం, సంస్కరణల పేరుతో మారిన ఎఫ్ఏ పరీక్షల మూల్యాంకనం.. ఇలా అనేక రకాలుగా టీచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోంది. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను నింపాల్సిన కీలకమైన ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉండడం లేదని ఉపాధ్యాయులు లోలోన మధనపడుతున్నారు. ఆన్లైన్లో నమోదు ఇలా.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనల్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో ప్రతిపాదనలు స్వీకరించేందుకు వచ్చే నెల 15తో గడువు ముగియనుంది. ఆన్లైన్లో పాఠశాల అథారిటీ ఆప్షన్‌లోకి వెళ్లి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, తల్లి, తండ్రి ఆధార్ సంఖ్య తదితర వివరాలు, బ్యాంకు ఖాతా ఫొటో, తయారు చేసిన ప్రాజెక్టు రైటప్, ప్రాజెక్టు చిత్రాలు లేదా 300 పదాలకు మించని వివరణ అప్లోడ్ చేయాలి. ఎంపికై న ప్రతి ప్రాజెక్టుకు జిల్లా స్థాయిలో రూ.10 వేల నగదును విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికై తే ఒక్కో ప్రాజెక్టుకు రూ.25 వేల వరకు పారితోషికం అందించడంతోపాటు రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు, జపాన్ పర్యటనకు అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు చొప్పున విద్యార్థులతో ప్రాజెక్టులను రూపొందించాలి. విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాలి. రెండేళ్లుగా జరగని ఎగ్జిబిషన్లు జిల్లాలో ఇన్స్పైర్ మనక్‌కు సంబంధించి 2023–24, 2024–25 సంవత్సరాల్లో నిర్వహించాల్సిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఇప్పటివరకు జరగలేదు. కరోనా కారణంగా ప్రదర్శనలు ఆలస్యమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో 2022–23కు సంబంధించిన ప్రదర్శనను అనకాపల్లిలో నిర్వహించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణపై నిర్లక్ష్యం చూపారన్న విమర్శలున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు, సైన్సు టీచర్లలో నిర్లిప్తత చోటు చేసుకుంది. అంతేకాకుండా ఇన్స్పైర్ మనక్‌కు టీచర్లలో ఆసక్తి కలిగించేందుకు ప్రతి ఏటా నిర్వహించాల్సిన జిల్లా స్థాయి అవగాహన, సన్నద్ధత సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదు. మరో 20 రోజుల్లో గడువు ముగియనుండడంతో జిల్లా అధికారులు దీనిపై శ్రద్ధ చూపితేనే ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. నేడు, రేపు ఓరియంటేషన్ క్లాసులు అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్లలో ఓరియంటేషన్ క్లాసు లు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అనకాపల్లి డివిజన్లో ఉన్న అన్ని పాఠశాలలకు అనకాపల్లి టౌన్ గర్ల్స్ హైస్కూల్లో, మంగళవారం నర్సీపట్నం డివిజన్ పాఠశాలలకు నర్సీపట్నం మెయిన్ జిల్లా పరిషత్ హైస్కూల్లో తరగతులు నిర్వహించనున్నారు. దీనికి పాఠశాల నుంచి హెచ్ఎం, సైన్స్ టీచర్ తప్పనిసరిగా హాజరుకావాల్సిందిగా డీఈవో గిడ్డి అప్పారావునాయుడు సూచించారు. ఇప్పటి వరకు నామినేషన్లు నమోదు చేసుకున్న స్కూళ్లు 5 -
చందా వివరాలు
నెలసరి వేతనం రూ. 21,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న కార్మికులకు ఈఎస్ఐ వర్తిస్తుంది. దివ్యాంగులకు ఈ పరిమితి రూ. 25,000. కార్మికుల వాటా మొత్తం వేతనంపై 0.75 శాతం ఉంటుంది. మొత్తం వేతనంపై 3.25 శాతం ఉంటుంది. ఈ రెండు వాటాలను కలిపి ప్రతి నెలా 15వ తేదీలోగా ఆన్లైన్లో చెల్లించాలి. రూ. 176 లేదా అంతకంటే తక్కువ దినసరి వేతనం పొందే కార్మికులకు చందా మినహాయింపు ఉంటుంది, కానీ యజమాని వాటా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం నరసింహనగర్‌లోని ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1800–11–2526ను సంప్రదించవచ్చు. -
పచ్చనేతల ప్రచార యావ..
మాడుగుల రూరల్ : అధికారంలో ఉన్న కూటమి నాయకుల ప్రచారానికి గుడి, బడి అంటూ తేడా ఏమీ లేదు. మండలంలో వి.వి.అగ్రహారం ఎంపీయూపీ పాఠశాల గేటు ప్రవేశ ద్వారం వద్ద పెద్ద డిజిటల్ బోర్డును ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేశారు. ఆరోజున దేశం పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టరు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్దాది నుంచి వి.వి.అగ్రహారం గ్రామం వరకు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద బోర్డు ఏర్పాటు చేసి, 10 రోజులు కావస్తున్నా సరే బోర్డును ఇక్కడ నుంచి తొలగించలేదని విద్యార్థులు, గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. -
సముద్రపు ఇసుక తరలింపునకు వేలంపాట?
రాంబిల్లి (అచ్యుతాపురం): కాదేదీ వ్యాపారానికి అనర్హం. మత్స్య వేట తగ్గడంతో ఆదాయ వనరుపై తీర ప్రాంతంలోని కొందరు నేతలు దృష్టి సారించారు. కేవలం గ్రామ అభివృద్ధి కోసమే అని చెబుతున్నప్పటికీ తొలసారి రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురంలో ఇసుక రీచ్‌కు వేలం పాట నిర్వహించారు. స్థానిక గ్రామ స్థాయి కూటమి నేత ఏడాది పాటు ఇసుకపై హక్కులు పొందేందుకు గానూ రూ.3 లక్షలకు పాట దక్కించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల కోసమే వేలంపాట నిర్వహించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. నేవల్ బేస్‌కు సంబంధించిన జెట్టీ వల్ల వాడనర్సాపురం సముద్ర తీరంలో చేపల వేట సాగడం లేదు. గ్రామానికి రెండో వైపు ఉన్న పైడమ్మ చెరువు ప్రాంతాన్ని నేవల్ బేస్ పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఒకప్పుడు ఆయా కొండల్లో గ్రావెల్, చేపల వేట ద్వారా వచ్చే ఆదాయంతో స్థానికంగా పండుగలు నిర్వహించుకునేవారు. ఇప్పుడు వేట సాగక మత్స్యకారులు వలస పోవడంతో నిధులు లేక వేలంపాట నిర్వహించామని నిర్వాహకులు సమర్ధించుకుంటున్నా ఆ ప్రాంతంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వాడనర్సాపురంలో ఇసుక వేలం పాట నిర్వహించినట్లుగా వచ్చిన ఫిర్యాదుపై తహసీల్దార్ స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. సముద్ర తీరంలోని ఇసుకను వేలం పాట వేసేందుకు ఎలా అనుమతిస్తామని తహసీల్దార్ ప్రశ్నించినట్టు సమాచారం. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం వాడనర్సాపురానికి చెందిన పలువురు ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఏడాది పాటు ఇసుక తరలింపు హక్కులు పొందిన వ్యక్తిపై, వేలం పాట నిర్వహించిన నేతలపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ ఈ తరహా వేలం పాట నిర్వహించలేదని స్థానిక మత్స్యకారులు కొందరు పేర్కొనడం గమనార్హం. సముద్ర తీరంలోని ఇసుక కోసం దిబ్బలను తవ్వేస్తే గ్రామానికి ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అన్ని పార్టీల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఏడాది కాలానికి రూ.3 లక్షలకు పాడుకున్న గ్రామ స్థాయి కూటమి నేత వాడనర్సాపురంలో తొలిసారి అనధికార ఇసుక రీచ్ కోసం వేలంపాట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహసీల్దార్! -
ఇంటర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అప్పారావు
మద్దిలపాలెం: విశాఖ ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. జి.వి.అప్పారావు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.రామారావు ఉపాధ్యక్షుడిగా, బి.సి.హెచ్.సుధాకర్ కార్యదర్శిగా, కె.జగదీశ్వరరావు సంయుక్త కార్యదర్శిగా, బి.సుశీల మహిళా కార్యదర్శిగా, ఎన్.మురళీమోహన్ కోశాధికారిగా, కె.సిహెచ్.నాయుడు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎం.దుర్గాప్రసాద్, ఎన్.గీతాకుమారి, బి.పుష్పకుమార్, సంతోష్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి రవిశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.అప్పలరాజు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సంఘం సేవలందించనుందని నూతన అధ్యక్షుడు జి.వి.అప్పారావు తెలిపారు. -
వీవోఏలు పోరాటానికి సిద్ధం కావాలి
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో వీవోఏలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వీవోఏల (యానిమేటర్ల) జిల్లా 4వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్‌ను అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. వీవోఏల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సభలో తీర్మానం చేశారు. వీవోఏల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, వీవోఏల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.సూరిబాబు, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శికోటేశ్వరరావు పిలుపు -
మరింత ధీమా
స్ప్రీతో కార్మికుల జీవితాలకుతాటిచెట్లపాలెం: కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు చెందిన కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో అర్హులైన సంస్థలు, కర్మాగారాలు తమను తాము నమోదు చేసుకోవాలని విశాఖ ఈఎస్ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ (ఇన్చార్జి) సౌమేంద్ర కుమార్ సాహూ తెలిపారు. నరసింహనగర్‌లోని ఈఎస్ఐ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గత బకాయిల నుంచి మినహాయింపు సాధారణంగా ఈఎస్ఐలో నమోదు చేసుకున్న సంస్థలు గత ఐదేళ్ల బకాయిలు, వడ్డీ, నష్టపరిహారంతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ పథకం ద్వారా నమోదు చేసుకుంటే ఈ భారం నుంచి మినహాయింపు పొందొచ్చు. పాత బకాయిలు, తనిఖీలు ఉండవు ఈ పథకంలో నమోదు చేసుకున్న తేదీ కంటే ముందు సమయానికి సంబంధించిన చందాలు కట్టనవసరం లేదు. అలాగే ఈఎస్ఐ కూడా గత సమయానికి సంబంధించిన క్లెయిములు, తనిఖీలు చేయదు. నమోదుకాని ఉద్యోగుల నమోదు ఇప్పటికే ఈఎస్ఐలో నమోదు చేసుకుని, ఇంకా కొంతమంది ఉద్యోగులను నమోదు చేయని సంస్థలు ఈ పథకం ద్వారా వారిని చేర్చుకోవచ్చు. వారికి కూడా నమోదు చేసిన తేదీ నుంచి చందా, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈఎస్ఐ పరిధి, ప్రయోజనాలు కార్మిక రాజ్య బీమా సంస్థ అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 22.24 లక్షల కర్మాగారాలు, సంస్థలు ఈ పథకం కింద నమోదయ్యాయి, వీటిలో 3.72 కోట్ల కార్మికులు ఉన్నారు. ఎవరెవరికి లాభం వర్క్‌మెన్ కాంపెన్సేషన్ చట్టం, 1923, మెటర్నిటీ చట్టం, 1961 నుంచి మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగుల వైద్య ఖర్చుల బాధ్యత నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్య భద్రత లభిస్తుంది. అనారోగ్యం, ప్రసవం, ఉద్యోగ సంబంధిత ప్రమాదాలు, వైకల్యం వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం అందుతుంది. నమోదు చేసుకోని సంస్థలకు సువర్ణావకాశం ఈఎస్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సాహూ ప్రయోజనాలుఎవరు అర్హులు? 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ఏ కర్మాగారాలు లేదా సంస్థలైనా ఈఎస్ఐ చట్ట పరిధిలోకి వస్తాయి. వీటిలో సినిమా హాళ్లు, రవాణా సంస్థలు, ప్రింటింగ్ ప్రె స్లు, వార్తా సంస్థలు, హో టళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రు లు, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ ఏజెన్సీలు మొదలైనవి ఉంటాయి. ఈఎస్ఐ చట్ట పరిధిలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నమోదు చేసుకోని సంస్థల కోసం ‘స్కీం ఫర్ ప్రమోషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్’(స్ప్రీ) పథకాన్ని ఈఎస్ఐ తిరిగి ప్రారంభించింది. ఈ పథకం జూలై 1, 2025 నుంచి డిసెంబరు 31, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం కింద నమోదు చేసుకునే సంస్థలకు గత బకాయిల నుంచి మినహాయింపు లభిస్తుంది. -
పెన్షన్ల పునరుద్ధరణ కోసం..
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అన్యాయంగా తొలగిస్తున్న పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌తో పాటు వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు. పరుగులు పెట్టించిన భారీ కొండచిలువ కోటవురట్ల: భారీ కొండచిలువ స్థానిక రైతుల చేతిలో హతమైంది. రాట్నాలపాలెం శివారు కొండను ఆనుకుని ఉన్న తుమ్మలపల్లి ఆంజనే యులు పొలంలో ఆదివారం వ్యవసాయ పను లు చేస్తున్నారు. అదే సమయంలో 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించేసరికి కూలీ లు హడలెత్తి పరుగులు తీశారు. ధైర్యం చేసిన కొందరు కొండచిలువను హతమార్చారు. -
టంగుటూరి స్ఫూర్తితో దేశ సేవ చేయాలి
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో యువత దేశ సేవ చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా తన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణరావు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రమామణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మెరిసిన విజయ్
ఎస్.రాయవరం: వమ్మవరం అగ్రహారానికి చెందిన ఎస్.విజయ్ డీఎస్సీలో ప్రతిభ కనబరిచాడు. మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు.వమ్మవరం ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి నుంచి 7వ తరగతి వరకు, ధర్మవరం అగ్రహారంలో 10వ తరగతి వరకు, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్,డిగ్రీ చదివాడు. అనకాపల్లి ఏఎంఎల్లో పీజీ పూర్తి చేశాడు. 2015–17లో బీఎడ్ చేశాడు. ఆ తరువాత ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ డీఎస్సీ రాసి పీజీటీ, టీజీటీ,స్కూల్ అసిస్టెంట్(మేథ్స్)లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. స్కూల్ అసిస్టెంట్‌గా చేరుతానని విజయ్ చెప్పాడు. విజయ్ను ఉపాధ్యాయులు సత్యనారాయణ, రమేష్, ప్రకాశ్, శర్మ, శ్రీనివాసరావు తదితరులు సన్మానించారు. -
ఉక్కు కోసం ఉమ్మడి పోరాటం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుందామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా, ఈ విషయంలో ముందుకు వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం లాసన్స్‌బే కాలనీలోని బొత్స క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏ రాజకీయ పార్టీ కార్యాచరణ రూపొందించినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం, మా పార్టీ లక్ష్యం.’ అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల కుటుంబాల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్తే.. తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో ‘మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వం’అని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ప్రగల్భాలు పలికారన్నారు. కానీ, నేడు అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా ప్రైవేటీకరణకు ముందడుగు వేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని బొత్స మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, ముఖ్యనేతలు గొలగాని హరి వెంకట కుమారి, జియ్యాని శ్రీధర్, రవి రెడ్డి, వుడా రవి, రొంగలి జగన్నాథం, వురుకూటి అప్పారావు, ఫరూఖీ, జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, అక్కరమాని పద్మ రాము నాయుడు, దౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకొండ స్వాతి దాస్, అక్కరమాని రోహిణి, కె.అనిల్ కుమార్రాజు, మొల్లి లక్ష్మి, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, పి.వి.సురేష్, పల్లా అప్పలకొండ, బిపిన్ కుమార్ జైన్, తోట పద్మావతి, చెన్న జానకీరామ్, గుండపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, బర్కత్ అలీ, కె.వి.శశికళ, గులిగిందల లావణ్య, బల్ల లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, కో–ఆప్షన్ సభ్యులు ఎం.డి షరీఫ్, ఫాతిమా రాణి, సేనాపతి అప్పారావు, మువ్వల సురేష్, పల్లా దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
రాబడి మూరెడు పెట్టుబడి బార్డు..
● బార్లకు దరఖాస్తులు నిల్ ● ఇప్పటి వరకూ రాని ఒక్క దరఖాస్తు ● ఈ నెల 26తో ముగియనున్న గడువు ● వైన్‌షాపుల పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులతో తగ్గిన బార్ల ఆదాయం ● బార్ల నిర్వహణకు ముందుకు రాని వ్యాపారులు ● దరఖాస్తులు చేయాలని బతిమలాడుతున్న ఎకై ్సజ్ అధికారులు నర్సీపట్నం: కూటమి ప్రభుత్వ కొత్త బార్ పాలసీకి స్పందన కరువైంది. కొత్త బార్ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క అప్లికేషన్ కూడా పడకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వం జిల్లాకు 11 బార్లు కేటాయించింది. వీటిలో జీవీఎంసీ పరిధిలో అనకాపల్లిలో 5, సబ్బవరంలో 2 బార్లను కేటాయించారు. ఒక వైపు పర్మింట్ రూమ్‌లు, మరో వైపు బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుండడం, భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం కావడంతో ఆశించిన మేరకు లాభాలు వస్తాయా లేదా అని తర్జనభర్జనతో బార్ల కోసం దరఖాస్తు చేసేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలతో పాటు సందు, గొందుల్లో బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో బార్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం బార్లలో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఫలితంగా జిల్లాలో కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినా దరఖాస్తు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. గత ప్రభుత్వ హయాంలో పోటీ పడి.. గత ప్రభుత్వ హయాంలో 2022లో వెలువడిన నోటిషికేషన్లో మూడేళ్ల కాల పరిమితితో బార్ల నిర్వహణకు అనుమతులు పొందారు. ఇ–వేలం నిర్వహించడంతో వ్యాపారులు పోటీపడి భారీ మొత్తాలకు అనుమతులు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో బెల్టు దుకాణాలు లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేది. సమయపాలన ఉండేది. దీంతో బార్లకు మంచి డిమాండ్ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుండడంతో బార్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో యలమంచిలిలో రెండు , నర్సీపట్నంలో రెండు బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు నిర్దేశించింది. 50 వేలు జనాభా దాటిన నర్సీపట్నంలో ఏడాదికి లైసెన్సు రూ.55 లక్షలు, యలమంచిలిలో రూ.35 లక్షలు ఫిక్స్ చేసింది. ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.10 లక్షలు నిర్దేశించింది. జీరో మార్జిన్ నిర్దేశించింది. ఈ నెల 26తో గడువు ముగిస్తున్న ఇప్పటికీ ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. గత ఏడాది అక్టోబరులో జిల్లాలో 144 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మద్యం షాపుల నిర్వాహకులకు 14 శాతం మార్జిన్ ఇస్తుంది. బార్లకు వచ్చే సరికి జీరో మార్జిన్ విధించింది. దీంతో వ్యాపారులు అప్లికేషన్లు వేసేందుకు ముందుకు రావటం లేదు. మినీ బార్లుగా పర్మిట్‌రూంలు మద్యం దుకాణాల నిర్వాహకులు పర్మిట్ రూంలు ఏర్పాటు చేసుకున్నారు. దుకాణాల వద్దే మందుబాబులతో మద్యం తాగిస్తున్నారు. వారికి ఆహార పదార్థాలు, వాటర్‌బాటిల్స్ కూడా విక్రయిస్తున్నారు. దీంతో పర్మిట్‌రూమ్‌లు మినీ బార్లను తలపిస్తున్నాయి. ఎక్కువమంది మందుబాబులు దుకాణాల వద్దే తాగేస్తున్నారు. ప్రతి మద్యం షాపు వద్ద తప్పనిసరిగా పర్మిట్ రూమ్ పెట్టుకోవాలని అధికారులు ఆంక్షలు పెట్టారు. లేదంటే పర్మిట్ రూమ్‌కు సంబంధించిన ఫీజు కట్టాల్సిందేనని అధికారులు హుకుం జారీ చేశారు. ఒక్కో పర్మిట్ రూమ్‌కు రూ.7.50 లక్షలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. పర్మిట్ రూమ్‌లే బార్లను తలపిస్తుండడంతో, బార్లకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో బార్ల నిర్వాహణకు ఎవరూ ముందుకు రాకపోవడంలేదు వ్యాపారులకు నచ్చజెబుతున్న అధికారులు ఎకై ్సజ్ అధికారులు రంగంలోకి దిగి మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దరఖాస్తు చేయాలని నచ్చచెబుతున్నారు. బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరే బార్లను నడుపుకోవటం మంచిదని వ్యాపారులకు అధికారులు సలహాలు ఇచ్చి మోటివేషన్ చేస్తున్నారు. -
అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయం
మాట్లాడుతున్న పాత్రుపల్లి వీరుయాదవ్ అనకాపల్లి: అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయమని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్ అన్నారు. స్థానిక ఉడ్‌పేట సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఐదు లక్షల మంది దివ్యాంగుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారని తెలిపారు. అందులో లక్ష మందిని అనర్హులుగా గుర్తించారని చెప్పారు. దీనిపై రాష్ట్రమంతటా దివ్యాంగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. దివ్యాంగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని తెలిపారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మొల్లి చంద్రశేఖర్, సభ్యులు యలమర్తి రవి, మంత్రి శ్రీనివాసరావు, కరణం శివ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి పారిపల్లెమ్మ ఎత్తిపోతల పథకం
మునగపాక: మండలంలోని వాడ్రాపల్లిలో పారిపల్లెమ్మ ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ విజయ కృష్ణన్ హామీ ఇచ్చారు. వాడ్రాపల్లిలో శనివారం ఆమె పర్యటించి, రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం ఆమె వారితో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. అయితే కొంతమంది రైతులు అధికంగా వినియోగించడం వల్ల యూరియాకు డిమాండ్ వచ్చిందన్నారు. దమ్ములో యూరియా వినియోగం తగ్గించి పొటాష్ ఎరువులను వేసుకోవాలని సూచించారు.రైతు సేవా కేంద్రాల్లో యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.నానో యూరియాను వినియోగించుకోవాలన్నారు. సాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారుల సలహాలు,సూచనలు పాటిస్తూ వరి,చెరకులో అధిక దిగబడులు సాధించాలన్నారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్‌ను స్థానికులు కొయిలాడ దశావతారం,మళ్ల రాజేష్, నరసింగరావు, శేషు తదితరులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు, మండల వ్యవసాయాధికారి జ్యోత్స్నకుమారి,తహసీల్దార్ పి.సత్యనారాయణ,ఏఈవో లక్ష్మి, వీఏఏ లక్ష్మీ సింధూజ, వీహెచ్ఏ సంతోష్, మళ్ల కన్నుంనాయుడు,బొడ్డేడ సత్యనారాయణ,మళ్ల మల్లయ్యనాయుడు,ఆడారి శివ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లను ఎందుకు బాగుచేయలేదు
చోడవరం: బీఎన్ రోడ్డు, అనకాపల్లి– మాడుగుల రోడ్లను ఎందుకు బాగుచేయలేదంటూ కాంట్రాక్టర్, చీఫ్ ఇంజినీర్‌ను ఏడీజే కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. బీన్రోడ్డు, అనకాపల్లి–మాడుగుల రోడ్లను బాగుచేయాలంటూ న్యాయవాదులు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా వేసిన పిటీషన్ వాయిదాకు రోడ్డు కాంట్రాక్టర్ ఎ.అశ్వంత్, రోడ్డు ప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ హాజరయ్యారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట,రోలుగుంట మీదుగా మెయిన్(బీఎన్) రోడ్డు, అనకాపల్లి–మాడుగుల ఆర్అండ్బీ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నాయని, వీటిని ఎందుకు బాగుచేయించలేదో తెలపాలంటూ జులై 7వతేదీన చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో చోడవరానికి చెందిన న్యాయవాదులు అన్నాబత్తుల భరత్ భూషణ్, భూపతి రాజు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ప్రసాద్ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రెండు వాయిదాల్లో నోటీసులు అందుకున్న అధికారులు కోర్టుకు హాజరుకాగా, అప్పట్లో రోడ్డు కాంట్రాక్టర్, ప్రాజెక్టు చీఫ్‌ఇంజినీర్ హాజరుకాలేదు. దీంతో ఈనెల 23వ తేదీన వాయిదాకు హాజరుకావాలని వారిని కోర్టు ఆదేశించింది. శనివారం వారిద్దరూ చోడవరం కోర్టుకు హాజరయ్యారు. ఈ రెండు రోడ్లను ఎందుకు బాగు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారని పిటీషనర్ తరఫున న్యాయవాది, చోడవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ విలేకరులకు తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్, సీఈ చెప్పారన్నారు. సెప్టెంబరు 20వతేదీకి మరోసారి కేసును కోర్టు వాయిదా వేసిందని డేవిడ్ తెలిపారు. రోడ్డు పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోతే ప్రజలు పడుతున్న ఇబ్బందుల రీత్యా అవసరమైతే హైకోర్టుకు వెళతామని పిటీషనర్ తరఫు న్యాయవాది డేవిడ్ చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
చోడవరం: మండలంలోని వెంకన్నపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ జోగారావు అందించిన వివరాల ప్రకారం..వెంకన్నపాలెం నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వస్తున్న మండలంలోని ఎం. కొత్తపల్లికి చెందిన వెదిరి రామునాయుడు (42) అక్కడే మృతి చెందాడు. నంబారు సోమినాయుడు రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. రామునాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, గాయపడిన సోమినాయుడును ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదంలో బైక్ దెబ్బతింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చీపురు పట్టిన ఎస్పీ తుహిన్ సిన్హా
● కార్యాలయ ఆవరణలో చెత్తా చెదారాలు తొలగింపు చీపురుతో చెత్త ఊడ్చుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: నిత్యం పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండే ఎస్పీ తుహిన్ సిన్హా చీపురు పట్టి చెత్తా చెదారాలు ఊడ్చారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ఆయన పోలీసు సిబ్బందితో కలిసి తమ కార్యాలయ ఆవరణలో చెత్తా చెదారాలు ఊడ్చటంతోపాటు పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని తమ సిబ్బంది నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీ బి.మోహనరావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యరావు, సురేష్, రామకృష్ణ, ఎస్ఐలు ప్రసాద్, మల్లేశ్వరరావు, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శనీయులు ప్రకాశం పంతులు
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. 154వ జయంతి సందర్భంగా టంగుటూరి చిత్రపటానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు నీతి నిజాయితీ, నైతిక విలువలు,త్యాగనిరతి, ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
అనకాపల్లి: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జేసీ ఎం.జాహ్నవి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతినెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా ఒక్కో అంశాన్ని తీసుకోవడం ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆగస్టు నెలలో ‘వర్షా కాలం పరిశుభ్రత’ అనే నివాదంతో కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణా చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరమన్నారు. ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేసి స్వచ్ఛగ్రామాలను రూపొందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణ రావు, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన, భూ పరిపాలన విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
డి.గొట్టివాడలో పూరిల్లు దగ్ధం
● రూ.3 లక్షల ఆస్తి నష్టం మాడుగుల రూరల్: మండలంలో డి.గొట్టివాడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. గ్రామానికి చెంది నంబారు గోసం నాయుడు, నంబారు చినతల్లి పూరింటిలోని రెండు గదుల్లో నివాసముంటున్నారు. అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 15 బస్తాల ధాన్యం, లక్ష రూపాయల నగదు, భూమిపత్రాలు, దుస్తులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే అన్ని కాలిపోయాయి. బాధితులు తీవ్రంగా రోదిస్తున్నారు. వీఆర్వో సంఘటనా స్థలాిన్ని పరిశీలించి నష్ట నివేదిక తహసీల్దార్ అందజేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. -
కొలువు గురువు
నక్కపల్లి: డీఎస్సీ ఫలితాల్లో పేదింటి అభ్యర్థులు ప్రతిభ కనబరిచారు. నక్కపల్లి మండలానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. దోసలపాడు గ్రామానికి చెందిన భవిరి శెట్టి రామకృష్ణ సోషల్ స్టడీస్‌లో జిల్లాలో 2వ ర్యాంకు సాధించాడు. రామకృష్ణ తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణించారు. అన్నయ్య, అమ్మమ్మ, నాన్నమ్మల వద్ద ఉంటూ ఉన్నత చదువులు చదివి డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. గొడిచర్ల గ్రామానికి చెందిన కర్రి నాగేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో సోషల్ స్టడీస్‌లో 3వ ర్యాంకు సాధించాడు. ఈయన మోటారు సైకిళ్లకు సీట్లు కుట్టే షాపు నిర్వహిస్తూ బీఈడీ పూర్తి చేశాడు. కష్టపడి చదువుకుని స్కూల్ అసిస్టెంట్‌కు ఎంపికయ్యాడు. గొడిచర్ల గ్రామానికి చెందిన చెల్లపు లావణ్య 91 శాతం మార్కులతో జిల్లాలో ఎస్జీటీ విభాగంలో ఏడో ర్యాంకు సాధించింది. ఎస్జీటీలో డొంకాడ గ్రామానికి చెందిన ప్రగడ సురేష్ 133వ ర్యాంకు, చందిన సంతోష్ 178వ ర్యాంకు సాధించారు. ఎస్జీటీలో మెరిసిన కుమారి మాడుగుల: డీఎస్సీ ఎస్జీటీ విభాగంలో సత్యవరం గ్రామానికి చెందిన ఎడ్ల కుమారి 90.47079 మార్కులతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 12వ ర్యాంకుతో మెరిసింది. తండ్రి మరిడినాయుడు వ్యవసాయ కూలి. పట్టుదలతో చదివి డీఎస్సీలో కొలువు సాధించిన కుమారిని కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో సివిల్స్ సాధనే తన లక్ష్యమని కుమారి చెప్పారు. రావికమతం: మండలంలో సుమారు 25 మంది డీఎస్సీలో సత్తా చాటారు. కొత్తకోటకు చెందిన విరోతి ఆనంద్ ఫిజికల్ డైరెక్టర్(పీడీ) 90.5 స్కోర్ సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. టి.అర్జాపురంలో సీతిని జోగినాయుడు,(ఎస్ఏ), ఎస్జీటీలుగా కోల సత్తిబాబు, మడగల సత్యవేణి, మలిచెట్ల కుసుమ, గంధం మహేష్, పిల్ల ధనలక్ష్మి, దొండపూడి నుంచి తోట స్వాతి ఎంపికయ్యారు. హిందీలో జిల్లా ఫస్ట్ జ్యోత్స్న చోడవరం: డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లో చోడవరానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. హిందీ విభాగంలో కురచా జోత్స్న జిల్లా మొదటి స్థానం సాధించగా.. సోషల్‌లో మహిళా విభాగంలో పందిరి పరమేశ్వరి జిల్లాలో 7వ ర్యాంక్ సాధించారు. వీరిద్దరూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శివకు 26వ ర్యాంక్ కె.కోటపాడు : మండలంలో చౌడువాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బంటు శివ డీఎస్సీలో ఓపెన్ కేటగిరిలో సోషల్‌లో 78.31 మార్కులతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 26వ ర్యాంక్ సాధించాడు. 2005లో డిగ్రీ పూర్తి చేసిన శివ భారత సైన్యంలో చేరాడు. 17 ఏళ్ల పాటు ఆర్మీలో విధులు నిర్వహించి, 2021లో రిటైర్ అయ్యాడు. అనంతరం ఏయూలో 2021 నుంచి 2023 వరకూ బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీకి ప్రిపేర్ కావడంతో పాటు కానిస్టేబుల్ పోస్టుకు కూడా ఇంటి వద్ద నుంచే శివ శిక్షణ పొందాడు.ఇటీవల సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శుక్రవారం రాత్రి విడుదలైన డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో ఓపెన్ కేటగిరిలో జిల్లాలో 26వ ర్యాంక్‌ను సాధించాడు. ఆర్మీలో దేశానికి సేవ చేయడంతో పాటు రిటైర్ అయిన తరువాత కూడా రెండు ఉద్యోగాలకు ఎంపిక అయిన శివను పలువురు అభినందించారు. శివ ర్యాంక్ సాధించడం పట్ల తల్లి అప్పలనర్సమ్మ, భార్య వరలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. శివకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. డీఎస్సీ ఫలితాల్లో పేదింటి అభ్యర్థుల సత్తా -
ఆరుగురు గంజాయి నిందితుల అరెస్టు
నిందితులతో సీఐ విజయ్ కుమార్ అనకాపల్లి టౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు నిందితులని అరెస్ట్ చేశామని పట్టణ సీఐ టి.వి. విజయ్ కుమార్ తెలిపారు. వారి నుంచి 240 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలానికి చెందిన సోమెలి బాలకృష్ణ(33), సోమెలి ప్రవీణ్ కుమార్(25), విస్సారపు లింగేశ్వరావు(25), చీడికాడ మండలం బయలపూడి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్(24), షేక్ హుస్సేన్(24), చేబోలు సంతోష్(28) తమిళనాడు వ్యాపారులకు గంజాయి అమ్మడానికి ఒప్పదం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జి. మాడుగులలో గంజాయిని కొనుగోలు చేసి కారులో అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకువస్తుండగా గూడ్స్రోడ్ జంక్షన్ వద్ద శనివారం మధ్యాహ్నం ఎస్ఐ సంతోష్‌కుమార్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వీరి కారుకు పైలట్‌గా మోటార్ బైక్‌పై వచ్చిన మరోక వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యాడు. పట్టుబడిన ఆరుగురు నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. పరారైన నిందితుడు కోసం గాలిస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్ అల్లు వెంకటేశ్వరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న డీఎం అండ్ హెచ్‌వో ఎం.హైమావతి అనకాపల్లి: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని డీఎం అండ్ హెచ్‌వో ఎం.హైమావతి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షా కాలంలో వరదలు, అంటువ్యాధుల నివారణ అనే అంశంపై శనివారం పోస్టర్ ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు బారినపడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ఎస్.రమణ, డీఎస్వో షరీఫ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠశాలలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు
గొలుగొండ: చోద్యం సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికై న చిటికెల సాంబమూర్తికి స్వాగతం పలుకుతూ ఇటీవల స్థానిక పాఠశాల ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. స్కూలా– టీడీపీ కార్యాలయమా? శీర్షికతో శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఉదయం 7 గంటలకే పాఠశాల ప్రధాన ద్వారం వద్ద టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. విద్యా సంస్థల వద్ద ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కూటమి హయాంలో కుంటుపడిన పంచాయతీల అభివృద్ధి
మునగపాక: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందని మండల సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి సుందరపు నీలకంఠస్వామి (తాతాజీ) ఆరోపించారు. శుక్రవారం మునగపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలకు విడుదలైన నిధులను ప్రభుత్వం వేరే పనులకు బదలాయించడం వల్ల పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 2099 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్రానికి విడుదల చేసినట్టు చెప్పారు. వాటిని వేరే అవసరాలకు బదలాయించడం విచారకరమన్నారు. రాష్ట్రానికి సంబంధించి 2025–26 సంవత్సరానికి 1,000 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు రూపాయి విడుదల చేయలేదని తెలిపారు. సర్పంచ్‌లకు గత 8 నెలలుగా గౌరవ వేతనం కూడా విడుదల చేయలేదన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేసి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సర్పంచ్‌లు ఆడారి త్రిమూర్తులు,బొడ్డేడ శ్రీనివాసరావు,కర్రి పెదబ్బాయి,ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు,మళ్ల కాశీ సురేష్, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్ తదితరులు పాల్గొన్నారు. -
30న కల్లుగీత కార్మికుల సమస్యలపై నిరసన
మాట్లాడుతున్న ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రా దేముడు అనకాపల్లి టౌన్: కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రా దేముడు డిమాండ్ చేశారు. స్థానిక ప్రైవేటు హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృత్తి సమయంలో కల్లుగీత కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, గాయపడితే రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వెలసిన బెల్ట్‌షాపుల వల్ల కల్లు గీత కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వమే నీరా కేప్‌లు పెట్టాలన్నారు. పలు సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కట్టా ఈశ్వరరావు, గండిబోయిన రాము, జుత్తిక రాము, కొలుసు మహలక్ష్మీనాయడు తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
నర్సీపట్నం: అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దని, ఒకవేళ అలా చేస్తే సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహన్‌రావు హెచ్చరించారు. స్థానిక ఏడీఏ కార్యాలయంలో ఎరువుల డీలర్లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఏపీ బస్తా 50 కిలోలు రూ.1350, 28–28–0 రూ.1800 ఉంటుందన్నారు. కాంప్లెక్స్ ఎరువుల వాడకం పెంచాలన్నారు. డీలర్లు యూరియా అధిక ధరలకు అమ్మినా, ఉండి లేదని చెప్పినా వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 8331056471 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. నర్సీపట్నం మండలంలో యూరియా 165 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 250 టన్నులు డీలర్ల వద్ద ఉన్నాయన్నారు. 36 టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. వరి ఉడుపుల వరకు ఎంత అవసరమో అంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉందన్నారు. వరినాట్లు వేసేటప్పుడు ఆఖరి దమ్ములో 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 20 కిలోల పొటాష్ వేసుకోవాలన్నారు. యూరియా మీద అధారపడటమే కాకుండా డీఏపీ కానీ, 28–28–0 వాడుకోవాలన్నారు. ఉడిచిన 15 నుంచి 20 రోజుల్లో నానో యూరియా పిచికారీ చేయాలన్నారు. -
ఎరువుల అక్రమ నిల్వలపై దాడులు చేయాలి
అనకాపల్లి: ఎరువుల అక్రమ నిల్వలపై జాయింట్ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అమరావతి నుంచి శుక్రవారం ఖరీఫ్–2025లో ఎరువుల లభ్యతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, తదితరులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ మండల స్థాయిలో మల్టీ డిసిప్లినరీ టీమ్స్‌ను సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంఏవోలతో ఏర్పాటు చేసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. యూరియా గురించి ప్రతికూల వార్తలు వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులు బట్టి వివరణ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఉన్న సాగు విస్తీర్ణంను బట్టి ఎరువుల సరఫరా, లభ్యత వివరాలను ప్రతి రోజూ కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని చెప్పారు. ప్రతి ఎరువుల షాపు వద్ద ఓ వీఆర్ఏను నియమించి అమ్మకాలను పర్యవేక్షించాలన్నారు. ఆర్ఎస్కే పరిధిలో పంటల సాగు విస్తీర్ణానికి అవసరమైన యూరియా లభ్యత వివరాలు రోజూ 8 గంటలకు మల్టీ డిసిప్లినరీ కమిటీకి తెలియజేయాలని ఆమె సూచించారు. జిల్లా వ్యవసాయ, ఎంపీడీవో కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఎక్కడైన సమస్యలు ఉంటే జిల్లా వ్యవసాయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 8331056471లో సంప్రదించాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోం
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల నిరసన డాబాగార్డెన్స్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ గళం వినిపించారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లోని 44 విభాగాలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వారు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన గేటు వద్ద నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. -
బొడ్డేరు నదిపై కుంగిన వంతెన
కుంగిపోయిన వంతెన బుచ్చెయ్యపేట: మండల శివారు విజయరామరాజుపేట, చీడికాడ మండలం కట్టవాని అగ్రహారం గ్రామాల మధ్య బొడ్డేరు నదిపై గల వంతెన కుంగిపోయింది. దీంతో రెండు మండలాల్లో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో అధిక లోడుతో లారీ వెళుతుండగా వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ సమ యంలో మూడు చోట్ల బ్రిడ్జి దెబ్బతింది. దీంతో నడిచివెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. వంతెనకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు, కాపలా ఏర్పాటు చేశారు. వంతెన కుంగిపోవడంతో ముఖ్యంగా విజయరామరాజుపేట,కట్టువాని అగ్రహారం,దండి సురవరం,దిబ్బిపాలెం, ఇంటిపాలెం,తునివలస,చీడికాడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే బుచ్చెయ్యపేట మండలంలో భీమునిపట్నం,నర్సీప ట్నం(బీఎన్) ప్రధాన రోడ్డులో వడ్డాదిలో పెద్దేరు నదిపై ఉన్న పెద్దేరు వంతెన, విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై ఉన్న తాచేరు వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్లు మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో అనకాపల్లి,అల్లూరి,విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఇప్పుడు బొడ్డేరు నదిపై గల వంతెన కుంగిపోయింది. రెండు మండలాలను కలిపే లింకు రోడ్డులో ఏర్పాటు చేసిన వంతెన కూలడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 ఏళ్ల కిందట బొడ్డేరు నదిపై ఈ వంతెన నిర్మించారు. దేవరాపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట, మాడుగుల, రావికమతం మండలాల్లో జరిగే వారపు సంతల్లో విక్రయించేందుకు రైతులు పంటలు,పాడి పశువులు,గొర్రెలు,మేకలు,నాటుకోళ్లు రవాణా చేసేందుకు ఈ రహదారినే ఎక్కువగా వినియోగిస్తారు. కూలిన వంతెన ప్రదేశంలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు వంతెన నిర్మించాలని బుచ్చెయ్యపేట,చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల తదితర మండలాల ప్రజలు కోరుతున్నారు. -
స్కూలా.. టీడీపీ కార్యాలయమా?
గంజాయి తరలింపుపై డ్రోన్‌తో నిఘా గొలుగొండ: స్థానిక ఎంపీపీ పాఠశాలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కటౌట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొలుగొండ మండలం చోద్యం సహకార బ్యాంక్ పర్సన్ ఇన్చార్జిగా నియమితులైన చిటికెల సాంబమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్‌ను ఆహ్వానిస్తూ ఈ కటౌట్లు ఏర్పాటు చేయడంపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలకు 50 మీటర్లు దూరంలోనే ఎంఈవో కార్యాలయం ఉన్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. -
అడ్డంగా బుకై ్కన మేయర్
సభ జరిగిన తీరిది.. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అజెండాలో 84 అంశాలు, టేబుల్ అజెండాలో 67 అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం 151 అంశాల్లో కేవలం రెండు అంశాలు మాత్రమే వాయిదా పడ్డాయి. ఒక్కో అంశానికి 5 నిమిషాలు చర్చించినా, సుమారు 750 నిమిషాలు (దాదాపు 12–13 గంటలు) పడుతుంది. కానీ అలా జరగకుండా తూతూ మంత్రంగా నిర్వహించి 149 అంశాలను ఆమోదించారు. డాబాగార్డెన్స్(విశాఖ) : కోళ్ల వ్యర్థాల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించిన తనపైనే ఆరోపణలు చేయిస్తున్నారని స్వయంగా టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీను ఆరోపించారు. జీవీఎంసీలో ఒక అధికారి కిశోర్ ఏళ్లుగా తిష్టవేసి కూర్చున్నారని, ఆయన తీరు బాగోలేదని ఎండగట్టారు. మేయర్ అవినీతిపై సొంత పార్టీ కార్పొరేటర్ నుంచే విమర్శలు రావడంతో మేయర్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో చేసేదేమీ లేక చర్యలు తీసుకుంటానని బెదిరించే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీసింది. కోళ్ల వ్యర్థాల దందా కూటమి నేతలదే! (సాక్షి ఇటీవలే ఈ కథనాన్ని ప్రచురించింది) జీవీఎంసీ పరిధిలో కోళ్ల వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడకు తరలించాలి. ఇందుకోసం 8 జోన్లకు ఒక్కొక్కరి చొప్పున మొత్తం 8 మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే కూటమి కి చెందిన కొందరు నేతలు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని కోళ్ల వ్యర్థాలను సేకరించి చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారు. ఈ విషయంపై ఫొటోలతో సహా కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినా, అధికారులు ఆ వాహనాలను పట్టుకుని మళ్లీ వదిలేయడం పరిపాటిగా మారింది. ఈ వ్యవహారంలో కీలకమైన కూటమి ఎమ్మెల్యేలతో పాటు, తెర వెనుక ఉండి రౌడీషీటర్ల ద్వారా వ్యవహారం నడిపిస్తున్న జీవీఎంసీలోని కీలక నేత తీరుపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ దందాకు జీవీఎంసీలో ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఒక అధికారి తీరుపైనా కౌన్సిల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కోళ్ల వ్యర్థాల దందాపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తుండటంతో, మేయర్ తన పదవి గౌరవాన్ని కూడా విస్మరించి ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో విచారణ జరపకుండా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను బెదిరించడంతో మేయర్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చర్చ జరపాలని పట్టుబట్టారు. సొంత పార్టీలోనే విపక్షం : కోళ్ల వ్యర్థాల అక్రమ తరలింపుపై శుక్రవారం జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తరలింపులో రౌడీషీటర్ల్ల ప్రమేయం ఉందని టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆరోపించారు. గంధం శ్రీనివాసరావుతో పాటు టీడీపీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ సహా మరికొంతమంది కార్పొరేటర్లు ఈ వ్యవహారంపై అధికారులను నిలదీశారు. ఒకే అధికారి చాలాకాలంగా జీవీఎంసీలో పనిచేస్తూ రౌడీషీటర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇచ్చిన వివరణపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కమిషనర్ కేతన్ గార్గ్ జోక్యం చేసుకున్నారు. తాను బాధ్యతలు స్వీకరించాక పత్రికల్లో ఈ విషయమై అనేక కథనాలు చూశానని, తప్పిదాలు ఉన్నట్టు తెలుస్తోందని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. మేయర్ వర్సెస్ గంధం కోళ్ల వ్యర్థాల అంశంపై కార్పొరేటర్ గంధం శ్రీను మాట్లాడుతున్నప్పుడు మేయర్ పీలా శ్రీనివాసరావు అడ్డుకున్నారు. తాను ఒక అక్రమ వాహనాన్ని పట్టుకుని అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చానని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అనకాపల్లిలో ఒక వ్యక్తి తన వాహనాన్ని అడ్డుకుని, అక్కడి సిబ్బందితో తనపై ఆరోపణలు చేయించి, సోషల్ మీడియాలో పెట్టారని గంధం శ్రీను చెప్పారు. ‘సమయం వృథా అవుతోంది, మిగతా అంశాల్లోకి వెళ్దాం’ అని మేయర్ పీలా చెప్పగా, గంధం మండిపడ్డారు. దీనిపై చర్చ జరగాల్సిందేనని ఆయన పోడియం వైపు దూసుకుపోయారు. ‘కూర్చోకపోతే చర్యలు తీసుకుంటా’ అంటూ మేయర్ హెచ్చరించారు. ‘నువ్వు అధికార పార్టీ సభ్యుడివై ఉండి ఇలాగే మాట్లాడుతావా?’ అంటూ మేయర్ మండిపడ్డారు. మేయర్ వైఫల్యం సభను సజావుగా నిర్వహించడంలో మేయర్ పీలా శ్రీనివాసరావు విఫలమయ్యారు. ఒక అంశంపై చర్చ వచ్చినప్పుడు మేయర్ నుంచి ఆమోదం రాకపోతే ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టడం సాధారణం. ఆందోళన చేపట్టే సభ్యులతో మేయర్‌గా హుందాగా వ్యవహరించాల్సిన పీలా శ్రీనివాసరావు, ఆ హోదా గౌరవానికి భంగం కలిగించారు. సభ్యులను ఇష్టానుసారంగా మాట్లాడడం, సభలో సభ్యులు మేయర్‌కు గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం చూస్తుంటే కౌన్సిల్ ఒక ఫంక్షన్‌లా మారిందనిపించింది. ఒక సభ్యుడు తన వార్డు సమస్యను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. గతంలో ఏ మేయర్ కూడా ఇంతగా దిగజారి సభను నడపలేదనే ఆరోపణలు కూటమి పార్టీ కార్పొరేటర్లు కూడా బహిరంగంగా చేశారు. చివరకు కమిషనర్ కేతన్ గార్గ్ జోక్యం చేసుకుని సభ్యులను వారి సీట్లలో కూర్చోమని చెప్పడం మేయర్ వైఫల్యానికి నిదర్శనం. టీడీఆర్‌లపై గందరగోళం టీడీఆర్‌ల జారీపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ పరిధిలో ఎన్ని మురికివాడలున్నాయి, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో ఎంత మంది నష్టపోయారు, ఎంత మందికి టీడీఆర్‌లు జారీ చేశారు, అసలు నిబంధనలేంటి? ఉడా లేఅవుట్లకు కూడా జీవీఎంసీ అధికారులు ఎలా టీడీఆర్‌లు ఇచ్చేశారు? చివరకు శ్మశానానికి కూడా టీడీఆర్ ఇచ్చేశారంటే అధికారులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోందని పలువురు సభ్యులు విమర్శించారు. టీడీఆర్‌లకు సంబంధించి ఆన్లైన్లో 4200 దరఖాస్తులు నమోదైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి పలువురు సభ్యులు అధికారులపై మండిపడుతూ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న సంస్థకు పనులా? విజయవాడలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఒక సంస్థకు పనులు అప్పగించేలా ఒకేసారి రెండు సంవత్సరాలకు స్వీపింగ్ యంత్రాల మరమ్మతు పనుల అంచనాలను రూపొందించడంపై ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సంస్థకు పనులు అప్పగించేందుకు అనుకూలంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని విమర్శించారు. అయితే, ఎలాగైనా ఈ అంశాన్ని ఆమోదింపజేయాలని మేయర్ ప్రయత్నించారు. సభ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, తిరిగి ఒక ఏడాదికి అంచనాలు రూపొందించేందుకు కౌన్సిల్ నిర్ణయించింది. వీటిపై అసలు చర్చేలేదు టీడీఆర్‌ల జారీ, కోడి వ్యర్థాల సేకరణ, డంపింగ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, కేటాయింపులు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధిత అంశాలు, రెవెన్యూ షాపుల కాంట్రాక్ట్, జీ–20 పనులు, బహిరంగ టెండర్లు, పార్కులు, ఖాళీ స్థలాల ఆక్రమణలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ హక్కుల రక్షణ, పాత జైల్ రోడ్డులో రాత్రి పూట ఫుడ్ కోర్టు, ప్రత్యేక కమిటీల నియామకాలు, ప్రస్తుత ఆస్తి పన్ను రీసర్వే వంటి ముఖ్యమైన అంశాలున్నప్పటికీ, కేవలం మొదటి నాలుగు అంశాలు మాత్రమే చర్చించి మిగిలిన వాటిని వదిలేశారు.స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఆమోదం తెలపాలి వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లూ శంకరరావుతో పాటు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బొడ్డు గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఆమోదం తెలపాలని పెద్ద ఎత్తున పట్టుబట్టారు. నల్ల దుస్తులు ధరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిరసన దాదాపు రెండు గంటల పాటు సాగింది. చివరకు మేయర్ దిగివచ్చి, మీరు లేఖ ఇవ్వండి, ప్రభుత్వానికి పంపుతానని చెప్పారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం 56వేల హెక్టార్లు
నాతవరం: జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సీజన్లో 56వేల హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహనరావు తెలిపారు. మండలంలో తాండవ జంక్షన్, గుమ్మడిగొండ, నాతవరం గ్రామాల్లో గల ఎరువుల దుకాణాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుమ్మడిగొండలో రైతులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 40వేల హెక్టార్లలో వరి నాట్లు వేసినట్టు చెప్పారు. వచ్చేనెల మొదటి వారం నాటికి లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. బోర్లు ఉన్న ప్రాంతాల్లో వర్షాలకు ముందే 10వేల హెక్టార్లలో రైతులు వరినాట్లు వేశారన్నారు. ఈఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల జులైలో వేయాల్సిన వరి నాట్లు ప్రస్తుతం చురుగ్గా వేస్తున్నారన్నారు. ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. ఈఏడాది కాంప్లెక్స్ ఎరువుల రేట్లు అధికంగా ఉండడంతో రైతులు వాటి బదులు యూరియా వేస్తున్నట్టు తెలిపారు. దమ్ము సమయంలో యూరియా వేయరాదని, రైతులకు అవగాహన లేకనే వేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఏడు వేల టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నాతవరం మండలంలో అన్ని రకాల ఎరువులు 411 టన్నులు ఉండగా వాటిలో 100 టన్నులు యూరియా సిద్ధంగా ఉందన్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు 350 టన్నుల యూరియా వస్తుందని, దాంట్లో 70 టన్నులు నాతవరానికే కేటాయించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆర్బీకేలతో పాటు పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నట్టు చెప్పారు. నాతవరం మండలంలో పీకే గూడెం పీఏసీఎస్ ద్వారా మాత్రమే ఎరువులు సరఫరా చేస్తున్నామని, మిగతా రెండు పీఏసీఎస్‌లకు ఈ పాస్ యంత్రాలు లేకపోవడంతో వాటికి ఎరువులు సరఫరా చేయలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నానో యూరియా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. ఆయన వెంట పాయకరాపేట ఏడీ ఉమాప్రసాద్, నాతవరం వ్యవసాయాఽధికారి సుగుణ సిబ్బంది ఉన్నారు. -
ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం
మునగపాక: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్‌కు ముందే రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి అందజేశారన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పనులు ముమ్మ రంగా జరుగుతున్న సమయంలో ఎరువులు,విత్తనాలను అరకొరగా సరఫరా చేయడం విచారకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందస్తు ఆలోచన లేక రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసుకోలేక రైతులు సతమతమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ఈనెల 26న మునగపాక మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామన్నారు. దివ్యాంగ పింఛన్లను తగ్గించడం సరికాదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పింఛన్లను తగ్గించేందుకు కుతంత్రాలు చేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,సర్పంచ్‌లు బొడ్డేడ శ్రీనివాసరావు,కర్రి పెద బ్బాయి,సుందరపు తాతాజీ,ఆడారి త్రిమూర్తులు,ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు,నాగేశ్వరరావు,మళ్ల కాశీ సురేష్, మాజీ వైస్ ఎంపీపీ దొడ్డి వరాహ సత్యనారాయణ, నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, ఆడారి కాశీబాబు, కాండ్రేగుల జగన్, దొడ్డి బుజ్జి, మొల్లేటి శంకర్, పెతకంశెట్టి రామజోగినాయుడు, కన్నుంనాయుడు,బొడ్డేడ బుజ్జి పాల్గొన్నారు. -
తగ్గేదేలే..!
గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. పోలీసుశాఖ ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా లెక్క చేయడం లేదు. విద్యార్థులు, యువతకు డబ్బు ఎర వేసి, ఏజెన్సీ నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని రప్పించి, జిల్లా నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. తనిఖీలు అంతంతమాత్రంగా జరుగుతుండడంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. గతంలో కన్నా ఈ ఏడాది గంజాయి కేసులు విపరీతంగా పెరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏవోబీ ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈగల్ విభాగం, శాంతి భద్రతల పోలీసులు సంయుక్తంగా జిల్లాలో ఐదు స్టాటిక్ చెక్ పోస్టులు, 38 డైనమిక్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు కప్పి మరీ తరలించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ 10,091 కిలోల గంజాయిని, 9 వేల హషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 170 కేసుల్లో 500 మందిని అరెస్ట్ చేశారు. ఏడుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ఇంత పెద్ద మొత్తంలో ఉంటే పట్టుబడని గంజాయి ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పనవసరం లేదు. కాలేజీ విద్యార్థులే టార్గెట్ స్మగ్లర్లు...యువత, విద్యార్థులే టార్గెట్‌గా గంజా యి రవాణా, విక్రయాలు సాగిస్తున్నారు. అటు ఏజెన్సీ, ఇటు మైదాన ప్రాంతానికి మధ్యలో గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండలాల మీదుగా జాతీయ రహదారికి, రైల్వే స్టేషన్లకు, విశాఖ నగరానికి గంజాయిని తరలిస్తున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు, విద్యార్థులు గంజాయి సేవించడం, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతుండడంతో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నర్సీపట్నం కేంద్రంగా... గంజాయి విక్రయాలకు, వినియోగానికి నర్సీపట్నం కేంద్రంగా మారుతుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కళాశాలలు, విద్యా సంస్థల వద్ద కాపు కాసి కొన్ని ముఠాలు విద్యార్థులను గంజాయి ఉచ్చులోకి లాగుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. పట్టణంలో ఇటీవల గంజా యి సేవించే యువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రాంతాల్లో గంజాయి సులభంగా లభిస్తుండడంతో విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నట్టు సమాచారం. గంజాయి విక్రయిస్తున్నవారిలో యువతులు కూడా ఉండడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ఇద్దరు యువతులను పోలీసులు విచారించి హెచ్చరించినట్టు తెలిసింది. ఏజెన్సీ నుంచి వచ్చే గంజాయి వ్యాపారులకు స్థానికంగా కొందరు షెల్టర్ ఇవ్వడంతో పాటు ఇక్కడ నుంచి పోలీసుల నిఘా లేని సమయాల్లో సులభంగా అనకాపల్లి, విశాఖనగరానికి గంజాయిని తరలించడంలో భాగస్వాములవుతున్నట్టు సమాచారం. వ్యాపారులు ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా చేయడంతో పాటు స్థానికంగా కళాశాల విద్యార్థులు, యువకులకు కూడా విక్రయిస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో కేసుల వివరాలు ఇలా.. 2024 ఏడాదిలో(జూన్ నెల నుంచి డిసెంబర్ వరకూ) గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు 81 కేసులు నమోదు చేసి, మొత్తం 3,326.43 కిలోల గంజాయి, రెండు వేల లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 220 మందిని పోలీసులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 96 మంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయి రవాణాలో వినియోగిస్తున్న 113 వాహనాలను సీజ్ చేశారు. 2025లో జనవరి నెల నుంచి 89 గంజాయి కేసులు నమోదు చేసి, 280 మందిని అరెస్ట్ చేశారు. ఈకేసుల్లో రూ.3,39,43,600 విలువైన 6,765 కిలోల గంజాయి, 5.300 లీటర్ల హషీష్ ఆయిల్, 73 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఏడు గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఆస్తులు సంపాదించిన ఇద్దరు స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేశారు. రోలుగుంట పోలీసు స్టేషన్ పరిధిలో గల రత్నంపేట గ్రామానికి చెందిన పడాల నాగేశ్వరరావు గంజాయి క్రయ విక్రయాలు, అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 15.36 ఎకరాల వ్యవసాయ భూమిని ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలు ప్రకారంగా స్వాధీనం చేసుకున్నారు. పేట్రేగిపోతున్న గంజాయి స్మగ్లర్లు యథేచ్ఛగా రవాణా విద్యార్థులు, యువతే లక్ష్యం ఏడాదిలో భారీగా పెరిగిన కేసులు ఏజెన్సీ నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా తరలింపు తనిఖీలు అంతంత మాత్రమే -
మీ చేతుల్లోనే ఆరోగ్యం, భవిష్యత్తు
క్విజ్ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న డీఎంహెచ్‌వో హైమావతి అనకాపల్లి: మీ ఆరోగ్యం, భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని డీఎంహెచ్‌వో వై.హైమావతి విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో పలు జూనియర్ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆమె శుక్రవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని, మంచి అలవాట్లు నేర్చుకోవాలని సూచించారు. కష్టపడి చదువుకోవడం కంటే ఇష్టపడి చదువుడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ ఉద్యోగులు, సీఎస్‌వో స్పందన ప్రశాంతి, ఐసీటీసీ కౌన్సిలర్స్ ప్రసాద్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
గతంలో సభ్యులందరి సమన్వయంతో..
విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుండటం బాధాకరం. గతంలో విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్‌లోని అన్ని పార్టీల (వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ) సభ్యులను సమన్వయపరచి, తీర్మానం చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం. అది కేంద్రానికి చేరింది. ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సభ్యులందర్నీ సమన్వయపరచి ప్రభుత్వానికి తీర్మానం పంపడంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? దాదాపు ఈ విషయాన్ని రెండు గంటల పాటు నాన్చడంలో అర్థమేంటి? – గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్ -
ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి
● భద్రాచలం– విశాఖపట్నం నైట్ సర్వీసుకు పగిలిన అద్దాలు చింతూరు: భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్తున్న నైట్సర్వీసు బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు భద్రాచలంలో బయలుదేరిన అల్ట్రా డీలక్స్ బస్సు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో ప్రయాణికులను దింపేందుకు ఆగింది. ఈ క్రమంలో చీకటిలోంచి ఓ రాయి వేగంగా వచ్చి బస్సు ఎడమవైపు అద్దాన్ని వేగంగా తాకి లోపలికి దూసుకొచ్చింది. కుడివైపు అద్దాన్ని దూసుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదే సమయంలో డ్రైవరు బస్సును కొంత ముందుకు తీసుకెళ్లి తిరిగి వెనక్కి తీసుకురావడంతో మరోసారి బస్సుపై రాయితో దాడి జరిగిందని వారు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బస్సును స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు తీసుకొచ్చి జరిగిన ఘటనపై డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
దండం పెడతాం.. పాఠశాల భవనం నిర్మించండి
రోలుగుంట: శిథిల స్థితిలో ఉన్న తమ పాఠశాల భవనాన్ని తొలగించి పునర్నిర్మించాలంటూ శుక్రవారం ఎం.కె.ట్నం పంచాయతీ శివారు గిరిజన గ్రామం పెదపేట పాఠశాల విద్యార్థులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో దండం పెడుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ నిరసనకు సారథ్యం వహించిన కె.చిరంజీవి మాట్లాడుతూ ఈ పాఠశాలలో పెదపేట, ఎం.పెడపేట గ్రామాల విద్యార్థులు మొత్తం 22 మందికి విద్యా బోధన సాగుతుందన్నారు. ఈ పాఠశాల భవన నిర్మాణం జరిగి సుమారుగా 40 సంవత్సరాలు దాటిందని, ఇప్పుడు ఈ శిథిల స్థితికి చేరుకోవడంతో ఆందోళన కలుగుతోందన్నారు. పాఠశాల పైకప్పు దెబ్బ తిని వర్షాలకు కారిపోతోందన్నారు. పెచ్చులు ఊడి పడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు స్పందించి భవనం పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. -
25న ఉపాధ్యాయుల మహాధర్నా
ధర్నా పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నర్సీపట్నం: పాత పెన్షన్ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 25న చలో విజయవాడ నిర్వహించనున్నారు. విజయవాడలోని అలంకార్ కూడలి వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఏడు మండలాలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం స్థానిక మున్సిపల్ స్టేడియంలో సమావేశమయ్యారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. పలువురు ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా డీఎస్సీ 2003 బ్యాచ్ ఉపాధ్యాయులు అనివార్యంగా సీపీఎస్ విధానంలోకి బలవంతంగా నెట్టబడ్డారన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ 2003 బ్యాచ్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం ఫోరం నాయకులు చుక్కల రాము, పీఆర్టీయూ నాయకులు కె.వి.రమణ, ఎ.అప్పారావు, బి.అప్పారావు, జి.వి.రమేష్, ఏపీటీఎఫ్ నాయకులు పడాల అప్పారావు, శర్మ, దొర, యూటీఎఫ్ నాయకులు ఎం.చిట్టియ్య, గాయత్రీ తదితరులు మాట్లాడారు. బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో రెండు బార్లకు ఇ–వేలం నిర్వహిస్తున్నామని నర్సీప ట్నం ఎకై ్సజ్ సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. మూడేళ్ల (2025–28)కాలపరిమితితో బార్లకు లైసెన్స్ పొందవచ్చన్నారు. ఈ నెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కోదానికి రూ.5 లక్షలు, ప్రాసెస్ ఫీజు రూ.10 వేలు చెల్లించాలన్నారు. ఆన్లైన్లో కానీ ఆఫ్‌లైన్‌లో కానీ అప్లై చేసుకుని, ఈ నెల 29 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. -
అర్ధరాత్రి యువకుల వీరంగం
యలమంచిలి రూరల్: డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం వద్ద ముగ్గురు యువకుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానై ఓ కుటుంబంపై దాడికి దారి తీసింది. తమ్ముడిపై కక్షతో 12 మంది యువకుల బృందం అన్న ఇంటికి వెళ్లి మూకుమ్మడిగా దాడికి పాల్పడింది. దాంతో వెలుగు వీవోఏ మెంట్రెడ్డి గోవింద్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు మహిళలకు కౌకు దెబ్బలు తగలాయి. గాయపడిన వీవోఏ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడికి పాల్పడిన యువకుల హల్చల్తో మండలంలోని షేకిళ్లపాలెంలో గురువారం అర్ధరాత్రి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బాధిత కుంటుంబీకులు, యలమంచిలి రూరల్ పోలీసులు తెలియజేసిన వివరాలివి.. యలమంచిలి, కశింకోట మండలాల సరిహద్దు గ్రామాలైన చిన షేకిళ్లపాలెం, అచ్చుతపురం గ్రామాల్లో గురువారం గ్రామదేవత నల్లమారమ్మ పండగ జరిగింది. ఈ జాతరలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టేజీ ప్రోగ్రాం వద్ద చిన షేకిళ్లపాలెం గ్రామానికి చెందిన మెంట్రెడ్డి చంటికి మరో ఇద్దరు పెద షేకిళ్లపాలెంకు చెందిన మరిశా శంకర్, మరికొంత మంది యువకులకు మధ్య వివాదం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న చంటి అన్నయ్య మెంట్రెడ్డి గోవింద్, అతని భార్య వేణు అక్కడకు వెళ్లారు. చంటిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పెద షేకిళ్లపాలెంకు చెందిన భీముని అశ్విన్, మరో 11 మంది యువకులు రాత్రి 11.30 గంటల సమయంలో మెంట్రెడ్డి చంటిపై దాడి చేయడానికి చిన షేకిళ్లపాలెంలో అతని ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి చంటి దొరక్కపోవడంతో మెంట్రెడ్డి గోవింద్, అతని భార్య వేణులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గోవింద్ తలకు బలమైన గాయంతో తీవ్ర రక్తస్రావం కావడంతో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా, అక్కడ్నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా, కుటుంబీకులు గోవింద్‌ను అనకాపల్లి బెనర్జీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన యువకుల్లో కొంతమంది వద్ద చాకు, కత్తి వంటి మారణాయుధాలు, కర్రలు ఉన్నాయని బాధిత కుంటుంబీకులు సాక్షికి తెలిపారు. ఈ దాడిలో గోవింద్ భార్య వేణు, మరిశా లక్ష్మిలకు కౌకు దెబ్బలు తగిలాయి. లక్ష్మి మెడలో బంగారు గొలుసును యువకులు తెంచేశారు. తెగిపోయిన గొలుసు ముక్కను పోలీసులకు చూపించారు. దీనిపై గోవింద్ తల్లి వరహాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద షేకిళ్లపాలెంకు చెందిన భీముని అరుణ్, బండారు వాసు, శానాపతి శ్రీను, చందక రవి, ప్రగడ ఆనంద్, గందూరి వాసు, భీముని అశ్విన్, బండారు నవీన్, భీముని నూకరాజు, ఎలిశెట్టి గంగాధర్, పూడి అప్పలనాయుడు, భీముని చిరంజీవి లపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్సై ఎం ఉపేంద్ర తెలిపారు. -
దొండపూడిలో ఘనంగా దుర్గాలమ్మ పండగ
రావికమతం: దొండపూడి గ్రామ ఆరాధ్య దైవం దుర్గాలమ్మ అమ్మవారి పండగ గురువారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రులు ఆర్.కె.రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, చింతలపూడి వెంకట్రామయ్య, అనకాపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, చోడవరం ఎమ్మెల్యే రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ మంత్రి వీరభద్రరావు, ప్రభుత్వ విప్ గణబాబు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
ఉచిత బస్సుకోసం పాట్లు..ఫీట్లు
త్రుటిలో తప్పిన ప్రమాదం అడ్డురోడ్డు బస్సుకోసం ఎదురు చూస్తున్న మహిళలు ఎస్.రాయవరం : ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ఫ్రీ బస్ ఎక్కేందుకు మహిళలు క్యూ కట్టారు. అడ్డురోడ్డు బస్టాండ్‌లో సుమారు 15 మందికి పైగా బస్సుకోసం ఎదురు చూస్తుండగా స్థానిక ఆటో డ్రైవర్లు వీడియో తీసి సోషల్ మీడియాల్లో హల్చల్ చేశారు. ఈ సమయంలో జంక్షన్లో విక్రయించుకునేందుకు తెచ్చుకున్న కుర్చీలపై వరుసలో కూర్చుని బస్సుల కోసం వేచి చూశారు. బస్సు రాగానే కిక్కిరిసిన బస్సులో ఎక్కి సీట్లు కోసం ఎగబడ్డారు. కగా మహిళలకు ఉచిత బస్సు పథకం తమను తీవ్రంగా దెబ్బకొడుతోందని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
సొమ్మొకరిది... సోకొకరిది..!
భారీ చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ విశాఖ షీలానగర్‌లో జూలై 13న జరిగిన దొంగతనం కేసును నగర క్రైం పోలీసులు ఛేదించారు.ఉచిత బస్సుకోసం పాట్లు..ఫీట్లు ఫ్రీ బస్ ఎక్కేందుకు మహిళలు క్యూ కట్టారు..రద్దీలో బస్సెక్కడానికి పాట్లు పడ్డారు.శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఆర్ఈసీఎస్ అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలపై ఈపీడీసీఎల్ శీతకన్ను హెచ్‌సీ కుమార్తెకు కారుణ్య నియామకం ఆర్ఈసీఎస్ కార్యకలాపాలు చేతికి వచ్చాక సంస్థ ఆస్తులు, మిగులు నిధులపై ఈపీడీసీఎల్ పెత్తనం రూ.కోట్ల ఆదాయం తీసుకుంటూ కళాశాల నిర్వహణ గాలికి.. కారుణ్య నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు కుమార్తె శిరీషకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ హోదాలో కారుణ్య నియామక పత్రంను గురువారం తమ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం పట్ల అంకితభావం, నిజాయితీతో కృషి చేస్తూ కుటుంబానికి, పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావాలని కోరారు. ఏడు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించని వైనంసాక్షి, అనకాపల్లి : కశింకోటలో గల ఆర్ఈసీఎస్ సంస్థకు సంబంధించి రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆర్ఈసీఎస్ పరిధిలో గల ఐదు మండలాల వినియోగదారుల బకాయిల చెల్లింపులు కోట్ల రూపాయలు ఏపీఈపీడీసీఎల్ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. ఏపీఈపీడీసీఎల్ ఆర్ఈసీఎస్ విలీన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగలేదు..సంస్థ కార్యకలాపాల వరకే అప్పగించాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. సంస్థ ఆస్తుల, అప్పుల సెటిల్మెంట్ జరిగే వరకు ఆ సంస్థ అనుబంధ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ బాధ్యత ఈపీఆర్సీ ఆదాయంతోనే చూసుకోవాలని స్పష్టంగా ఉంది. ఏపీఈఆర్సీ వారి ఆదేశాల మేరకు ఆర్ఈసీఎస్ సంస్థకు విద్యుత్ పంపిణీ కార్యక్రమాలకు లైసెన్స్ లేని కారణంగా ఆస్తులు, అప్పుల సెటిల్మెంట్ను పెండింగ్‌లో ఉంచి సంస్థ కార్యకలాపాలను ఏపీఈపీడీసీఎల్ వారిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని జారీ చేసింది. కానీ ఏపీఈఆర్సీ వారి ఆదేశాలకు విరుద్ధంగా ఆర్ఈసీఎస్ సంస్థకు సంబంధించి సుమారు 2 కోట్ల రూపాయల మిగులు నిధులను, రూ. 6.5 కోట్ల విలువ గల స్టోర్స్ మెటీరియల్‌ను ఏపీఈపీడీసీఎల్ వారు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా కళాశాల మిగులు నిధులు సుమారు రూ.2.28 కోట్ల రూపాయలను కూడా స్వాధీన పరుచుకున్నారు. ఉద్యోగులను, కార్యాలయాలను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సంస్థ కళాశాల పూర్తి బాధ్యతను మాత్రం తీసుకోవడం లేదు. 16 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ కళాశాలకు కూటమి ప్రభుత్వంలో ఆటంకం ఏర్పడింది. కళాశాల సిబ్బందికి సుమారు ఏడాదిగా జీతాలు లేవు..కళాశాల నిర్వహణ బాధ్యత ఏపీఈసీడీసీఎల్ తీసుకోకుండా ఆర్ఈసీఎస్ ఆదాయాన్ని మాత్రం లాగేసుకుంటున్నది. ఆర్ఈసీఎస్ బకాయిలు చెల్లింపులు, ఆదాయం మొత్తం సొంతం చేసుకుంటూ అనుబంధ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ బాధ్యతను, అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లింపులను పట్టించుకోవడం లేదంటూ కళాశాల సిబ్బంది, విద్యార్థులు వాపోతున్నారు. ఆర్ఈసీఎస్ నేపథ్యమిదీ... అనకాపల్లి జిల్లాలో ఐదు మండలాల పరిధిలో గల గ్రామాల్లో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాల నిమిత్తం 50 ఏళ్ల క్రితమే విద్యుత్ సరఫరా కార్యకలాపాలను ప్రారంభించిన అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్ఈసీఎస్) వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ పంపిణీ చేస్తూ లాభాల బాటలో పయనించింది. అన్ని రంగాలలో కలిపి ఆర్ఈసీఎస్ సంస్థకు సుమారు 2 లక్షల పైచిలుకు వినియోగదారులు ఉన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో వినియోగదారుల పిల్లలకు సాంకేతిక విద్యను అందించాలనే దూరదృష్టితో డిప్లొమా కోర్సులతో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో సెప్టెంబర్‌లో వినియోగదారులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి కశింకోటలో రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశారు. కళాశాలకు సంస్థ ప్రధాన కార్యాలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా కళాశాల నిర్వహణ బాధ్యత, ఉద్యోగుల జీతభత్యాలు, భవన నిర్మాణాలు, ప్రయోగ పరికరాల కొనుగోలు, ఇతర నిర్వహణ ఖర్చులు ఆర్ఈసీఎస్ నిధుల నుంచి చెల్లించాలని తీర్మానం చేశారు. సంస్థ బైలాను కూడా సవరించి 2009లో రాజీవ్‌గాంధీ ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. వినియోగదారుల పిల్లలకు సగం సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఆర్ఈసీఎస్ యాజమాన్యం కల్పించిన మౌలిక సదుపాయాలతో 120 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభమై అనతి కాలంలోనే 720 మంది విద్యార్థులకు విద్య అందించే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకూ వేలాది మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించి స్థిరపడేలా కృషి చేసింది. . పలుమార్లు వినతి.. స్థానిక కూటమి ఎమ్మెల్యేకు, ఏపీఈపీడీసీఎల్‌కు, జిల్లా కలెక్టర్‌కు కళాశాల సిబ్బంది పలుమార్లు వినతి ఇచ్చినా ఫలితం లేకపోయింది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే ఉంటున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీపీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కశికోటలో గల ఆర్ఈసీఎస్ –పాలిటెక్నిక్ కళాశాల, విద్యార్థులుఆదాయం ఏపీఈపీడీసీఎల్ ఖాతాకు.. 2021 సెప్టెంబర్ నుంచి 2025 మే వరకూ మధ్యకాలంలో విద్యుత్ వినిమయ బిల్లుల బకాయిల చెల్లింపులు రూ.574.32 కోట్ల ఆదాయం రాగా ..సిబ్బంది జీతాలు, రికరింగ్, నాన్ రికరింగ్ ఖర్చుల చెల్లింపు నిమిత్తం రూ.171.35 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 402.96 కోట్ల నగదును ఈపీఆర్సీ బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంది. కానీ ఏపీఈపీడీసీఎల్ వారి ఖాతాలలో జమ చేసుకున్నారు. సంస్థ ఆస్తులు అప్పులపై హక్కు, అధికారం వినియోగదారులది. సంస్థకు రూ.వందల కోట్లు ఆస్తులు ఉన్నాయి. కానీ ఏపీఈఆర్సీ వారి ఆదేశాలకు విరుద్ధంగా మిగులు నిధులను, సంస్థ పంపిణీ వ్యవస్థను, కార్యాలయాలను, ఉద్యోగులను వాడుకుని వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఏపీఈపీడీసీఎల్, కళాశాల నిర్వహణ బాధ్యత మాత్రం తీసుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం పరిమళించిన వేళ... ఎంపికై న విద్యార్థి సాత్విక్ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదలైన కష్టాలుగణపతి మండపాలకు అనుమతులు తప్పనిసరి ఇంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే... ఏపీఈపీడీసీఎల్ సంస్థ పంపిణీ వ్యవస్థను, ఉద్యోగులను, కార్యాలయాలను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్న ఏపీఈపీడీసీఎల్ వారు ఆర్ఈసీఎస్ సంస్థ రికరింగ్, నాన్–రికరింగ్ ఖర్చులను చెల్లిస్తున్నారు .కానీ..కళాశాల రికరింగ్, నాన్–రికరింగ్ ఖర్చులను భరించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సిబ్బందికి జీతాలు లేవు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించినా వాటితో కళాశాల నిర్వహణ నడిచేది. కానీ 2023–24, 2024–25 విద్యాసంవత్సరాలకు ప్రభుత్వం ఫీజురియింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు పిల్లలు (విద్యార్థుల) భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. -
ఉప్పుగల్లీల భూములపై పరిశ్రమల పడగ
అచ్యుతాపురం: గంగ పుత్రులకు కొత్త కష్టమొచ్చింది. వేటకు వెళ్లినా గతంలో వలే మత్స్య సంపద దొరకక, వేట కోసం సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే మత్స్యకార కుటుంబీకులకు మరో వనరుగా ఉప్పు గల్లీలు ఉండేవి. నాలుగు శివారు గ్రామాలుండే పూడిమడకకు ఒక వైపు పూర్తిగా సముద్రం, రెండు వైపులా ఉప్పుగల్లీలు, ఉప్పుటేరు ఉన్నాయి. అచ్యుతాపురం సెజ్ కేంద్రంగా ఇప్పటికే భూములు సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పూడిమడకకు ఆనుకొని ఉన్న ఉప్పుగల్లీలుగా ఉపయోగించే భూముల్ని బదలాయింపు చేసి ఏపీఐఐసీకి అప్పగించే పనికి ఉపక్రమించడంతో పూడిమడక ఉనికికే తీవ్ర ప్రమాదం ఏర్పడింది. అలాగని వేలాది మంది గల పూడిమడకను తరలించే అవకాశాలు కూడా క్లిష్టమే. ఇప్పటికే ఉపాధి దెబ్బతిని ఇక్కడ ఉండలేక, మరో చోటకి వెళ్ల లేక మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయం మరింత శరాఘాతం కానుంది. పూడిమడక ఉనికికే ప్రమాదం..? పూడిమడక గ్రామం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో అతి పెద్ద జాలరి పల్లి. వేలాది మంది మత్స్యకారులు ఉండే ఈ గ్రామానికి ఎంతో విశిష్టత ఉంది. నాలుగు ప్రధాన శివారు గ్రామాలుగా ఉన్న పూడిమడకలో ఉండే లైట్ హౌస్ ద్వారా మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు దిక్కులు తెలిపే సూచనలు ఉన్నాయి. సంప్రదాయ బద్ధంగా మత్స్యకారులు ఉన్న ఈ గ్రామంలో ఉప్పు పంట సైతం ప్రధాన వృత్తిగా ఉంటూ స్థానికులకు ఉపాధినిచ్చేది. సముద్రపు ఆటు పోటులు, ఉప్పుటేరు ద్వారా నీటి రాకపోకలతో ఎంతో ప్రశాంతంగా ఉండే పూడిమడకకు అచ్యుతాపురం సెజ్ వచ్చాక కష్టాలు మొదలయ్యాయి. కొంత మంది వేటను వదిలి సమీప కంపెనీల్లో కూలీలుగా మారారు. కంపెనీలతో పాటు బ్రాండిక్స్ పైప్లైన్ల వల్ల సముద్రం కలుషితమై మత్స్య సంపద తగ్గిపోయింది. ఉప్పుటేరులోకి రసాయనాలు రావడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీనికితోడు ఫిషింగ్ హార్బర్ కోసం చేపట్టిన అస్తవ్యస్త పనులు ఉప్పుటేరు రూపురేఖల్ని మార్చేశాయి. కుచించుకుపోయిన ఉప్పుటేరు చూసి తల్లడిల్లుతున్న గ్రామస్తులకు వరదనీటి ముప్పు (సముద్రంలో నీరు పెరిగినప్పుడు ఉప్పుటేరు ద్వారా వచ్చే వరద) నుంచి రక్షణగా ఉండే ఉప్పు గల్లీల భూములనూ పరిశ్రమల కోసం బదలాయించాలని భావిస్తుండడం కొత్త ప్రమాదం తెచ్చిపెడుతోంది. 166.15 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పుగల్లీలుగా పిలవబడే గయాలు, ఉప్పు పర్ర భూముల్ని ఏపీఐఐసీకి బదలాయించాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూలై 9వ తేదీన అచ్యుతాపురం తహసీల్దార్ పేరుతో వచ్చిన నోటీసుల సారాంశం మేరకు పంచాయతీ ఆమోదం తెలిపి సదరు భూముల బదలాయింపు సమాచారం ప్రజలకు తెలపాలని సూచించింది. దీనిపై ఆగస్టు మొదటి వారంలో పంచాయతీ సమావేశం భూముల బదలాయింపు వద్దని నిర్ణయించింది. ఉప్పు గల్లీలకు, ఊరుకీ ముప్పే... 1955లో ఈ ప్రాంతంలో ఉప్పు తయారీ ప్రారంభించారు. వందలాది మంది మత్స్యకార మహిళలు ఉప్పు గల్లీలో పనిచేసేవారు. 2003 సంవత్సరంలో లీజుకి తీసుకున్న వారు లీజు చెల్లించడం ఆపివేయడంతో ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది. తర్వాత టీడీపీ ప్రభుత్వం హయాంలో లీజులను నిలిపివేయడంతో ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఆ సమయంలో మహిళలు కొందరు పలు గ్రామాల్లో ఉప్పుని విక్రయించేవారు. ప్రస్తుతం కొందరు షెడ్యూల్ కులాలకు చెందిన వారు కొద్దిపాటి ఉప్పు తయారీ చేపడుతున్నట్టు సమాచారం. 2015 నుంచి ఉప్పు గల్లీలలో కార్యకలాపాలు నిలిచిపోవడం, తర్వాత సెజ్ పరిశ్రమలు రావడంతో ఈ భూమి ద్వారా వరద నీరు వర్షాకాల సమయంలో మళ్లించి ఉప ద్రవాలను తప్పించేందుకు దోహపడుతుంది. సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉన్న మొగ నుంచి వచ్చే నీరు ఉప్పుటేరు మీదుగా ఉప్పుగల్లీ ప్రాంతాల మీదుగా అవసరమైనప్పుడు రెండవ ప్రాంతం వైపు గల గట్టుని తాత్కాలికంగా తవ్వి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తద్వారా పూడిమడక గ్రామానికి వచ్చే నీటి ముంపు ప్రమాదం నుంచి బయటపడేందుకు ఉప్పు గల్లీ భూములు దోహదపడేవి. ప్రస్తుతం అస్తవ్యస్తంగా మిగిలిన ఫిషింగ్ హార్బర్ పనుల కారణంగా ఉప్పుటేరుని కుదించేశారు. ఉప్పుటేరు మీదుగా చిన్నపాటి సిమెంట్ గొట్టాలు వేసి రోడ్డుని వేయడంతో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇటు ఉప్పుగల్లీ భూముల బదలాయింపు, మరో వైపు ఉప్పుటేరు ఉనికికి భంగం కలిగే పరిణామాలతో పూడిమడకకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. విష వలయంగా ఉప్పుటేరు తాజాగా పూడిమడక ఉప్పుటేరులో చేపలు మృత్యువాతకు గురయ్యాయి. సెజ్‌లోని కొన్ని కర్మాగారాల్లో శుద్ధి చేయని రసాయనాలను ఉప్పుటేరులోకి వదలడం వల్లే చేపలు మృత్యువాతకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరి గంగ పుత్రుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో వేచి చూడాలి. -
గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్
నర్సీపట్నం: గంజాయి అక్రమ రవాణా కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని, వీరిలో మైనర్ బాలుడు ఉన్నాడని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకకు చెందిన మహ్మద్నిజాముద్దీన్(25), సంతోష్(35), చింతపల్లి మండలం, మేడూరు గ్రామానికి చెందిన వంతల బుజ్జిబాబు(30), చిన్నగెడ్డ గ్రామానికి చెందిన వంతల కార్తికేయ(22), 16 ఏళ్లు గిరిజన బాలుడు, ఒడిశాకు చెందిన హరిఖర(20), కారు డ్రైవర్ కర్ణాటటకు చెందిన సిద్ధేష్(25), కారు యజమాని నయీం(45) గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి ఎనిమిది సెల్ఫోన్లు, రెండు కార్లు, బైక్ సీజ్ చేశామన్నారు. ముందుస్తు సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు రాజారావు, రామారావు, సిబ్బంది కె.కొండబాబు, ఎస్.త్రిమూర్తులు, దేవేంద్ర గురువారం నర్సీపట్నం మండలం, రెట్టవానిపాలెం శివారులో మాటువేసి, బైక్‌పై వస్తున్న ఫైలేట్ను అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. కారు అడుగు భాగంలో ప్రత్యేక అర తయారు చేయించి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. రూ.15 లక్షలు విలువ చేసే 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించామన్నారు. -
మృతుల పేరిట ఉపాధి వేతనాల చెల్లింపు
● బుచ్చెయ్యపేట మండలంలో విడ్డూరం ● సోషల్ ఆడిట్లో బట్టబయలు బుచ్చెయ్యపేట: మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో లక్షలాది రూపాయల అవినీతి జరిగినట్టు సోషల్ ఆడిట్లో తేలింది. గురువారం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఈ వ్యవహారం బయట పడింది. పలు గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టినట్లు సోషల్ ఆడిట్ సిబ్బంది వివరించారు. రాజాం గ్రామంలో మృతి చెందిన యాదగిరి మాణిక్యం 36 రోజులు ఉపాధి పనులు చేయగా రూ, 10,800, మోటూరి రవిబాబు 8 రోజులు పని చేయగా రూ, 2,400 పేమెంట్లు చేసినట్లు గుర్తించామని సోషల్ ఆడిట్ సిబ్బంది వెల్లడించారు. ఆర్.శివరాంపురంలో బోయిన భూలక్ష్మి పనికి వెళ్లకపోయినా ఆమె పేరు మీద రూ,15,600 నగదు డ్రా చేశారు. గంటికొర్లాంలో వీఆర్పీ ఉపాధి పనులకు వెళ్తున్నట్లు మస్టర్లు వేయడమే కాక ఆమె భర్త పేరు మీద గ్రామంలో మొక్కలకు వాటరింగ్ చేసినట్లు రూ. 42 వేలు డ్రా చేశారన్నారు. గ్రామంలో 400 మొక్కలు నాటినట్లు రికార్డులు చూపగా.. సోషల్ ఆడిట్లో 174 మొక్కలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. గంటికొర్లాం వీఆర్పీ గతంలో జరిగిన మూడు, నాలుగు సోషల్ ఆడిట్లో లక్ష రూపాయల వరకు నిధులు పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. పలు గ్రామాల్లో తవ్వించిన ఫారం పాండ్స్ కొలతల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు సోషల్ ఆడిట్‌ను అధికారులు నిర్వహించారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో భానోజీరావు, ఏపీవో వరహాలుబాబు, ఎంపీపీ డి.నాగేశ్వరిదేవి, జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
నేలబావిలో జారిపడి యువకుడి మృతి
యలమంచిలి రూరల్ : పట్టణానికి సమీపంలో గురువారం శేషుగెడ్డ వద్ద నేల బావిలో జారిపడి కటారి రాజేష్(23) అనే యువకుడు మృతి చెండాడు. కశింకోట మండలం నర్సింగబిల్లి జంగాల కాలనీకి చెందిన రాజేష్, స్నేహితుడు కట్టుమూరు మధుతో కలిసి చేపలు పట్టడానికి 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన శేషుగెడ్డ వద్ద కొబ్బరి తోటలో ఉన్న నేల బావి వద్దకు వచ్చారు. చేపలకు గాలం వేసిన సమయంలో కటారి రాజేష్ ప్రమాదవశాత్తూ బావిలోకి జారి పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న కటారి రాజేష్ తండ్రి, కుటుంబసభ్యులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని కుమారుడి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. -
పల్లకీ మోత!
సైబర్ క్రైం దోషికిఅచ్యుతాపురం సైబర్ సెంటర్ దర్యాప్తులో పోలీస్ అధికారి పాత్రపై సీఐడీ అనుమానంఅచ్యుతాపురం సమీపంలోని భోగాపురం గ్రామంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లోనే అంతర్జాతీయ స్థాయి సైబర్ క్రైం జరిగేది.. ఈ ఏడాది మే 20వ తేదీన దాడులు జరపడానికి వెళ్లిన పోలీసు వాహనాలను చిత్రంలో చూడవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా బీపీవో పేరిట అంతర్జాతీయ సైబర్ క్రైం వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేరం బయటకు రావడానికి చాన్నాళ్ల ముందే ‘వినాయకుడి’లాంటి ఓ పోలీస్ అధికారి వీరి దందాను గమనించి, దండిగా పిండుకున్నాడు. సీఐడీ విచారణలో ఈ పోలీస్ అధికారి ముడుపులపై ప్రాథమిక ఆధారాలు కూడా లభించినట్లు తెలిసింది. అయితే దర్యాప్తు మరింత లోతుల్లోకి వెళ్లకుండా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అడ్డుపడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పసిగట్టి.. రూ.కోట్లు పట్టి! అచ్యుతాపురంలో వంటి ప్రాంతంలో కాల్ సెంటర్(బీపీవో) ఏర్పాటుపై అంతా ఆహా ఓహో అనుకున్నారు. సదరు పోలీస్ అధికారి మాత్రం ఇలాంటి ప్రాంతంలో బీపీవో ఎలా? అన్న అనుమానంతో ఆరా తీయడం మొదలెట్టారు. ఏదో అడ్డగోలు వ్యవహారం నడుస్తుందనే కోణంలో నిర్వాహకుల్ని బెదిరించి మరీ నెలవారీ ముడుపులు, అప్పుడప్పుడూ భారీ మొత్తాలు కలిపి రూ.కోట్లలో వసూలు చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైం బాధితులు పైస్థాయిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక టీంతో విచారణ ప్రారంభించారు. అప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం తెలిసినప్పటికీ ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరనీయకుండా సదరు పోలీస్ అధికారి చూసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆధారాలు కూడా సీఐడీ విచారణలో లభించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో..! టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో సీఐడీకి చేతులు కట్టేసినట్టయింది. సదరు ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో ఆ పోలీస్ అధికారి కులం కార్డు బయటకు తీశారు. దీంతో సదరు పోలీస్ అధికారి పేరు విచారణ నివేదికలో చేర్చకూడదంటూ సీనియర్ ఎమ్మెల్యే ఆదేశించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గం కానప్పటికీ, ఆ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. పైగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోగొట్టిన సైబర్ క్రైం వ్యవహారంలో పాత్రధారిగా ఉన్న పోలీస్ అధికారిని ఎలా వెనుకేసుకొస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే కేవలం కులం కార్డు మాత్రమే కాకుండా భారీగా ముడుపులు కూడా తీసుకున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాల్ సెంటర్ కథాకమామీషు! ముంబైకి చెందిన ఓ మహిళ అచ్యుతాపురంలో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని బీపీవో పేరిట సైబర్ క్రైం సెంటర్‌ను ఏడాది కాలంగా నిర్వహిస్తోంది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను ఇందులో ఉపయోగించుకున్నారు. పవన్ రెసిడెన్సీ వేదికగా సాగిన ఈ వ్యవహారంలో అవసరమైన స్టాఫ్‌ను హైదరాబాద్, గుజారాత్ల్లో రిక్రూట్ చేశారు. అమెరికన్ల ను వలవేసేందుకు ప్రత్యేకంగా అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్‌లో మాట్లాడేలా వీరికి తర్ఫీదు ఇప్పించారు. అమెరికా ఈ–కామర్స్ పేరుతో ఫోన్లు చేసి కూపన్లు వస్తాయంటూ ఎరవేసి డబ్బులు లాగేసేవారు. ఎవరైనా చెల్లించకపోతే తమదైన శైలిలో ఫేక్ వీడియోలతో భయపెట్టి రూ.50 కోట్ల వరకూ కొల్లగొట్టినట్టు తేలింది. ఇతర రాష్ట్రాలతో లింకులు ఉండటంతో పాటు లోతుగా విచారణ చేయాల్సిన కేసు కావడంతో సీఐడీ రంగంలోకి దిగింది. సీఐడీ విచారణలో ఓ పోలీస్ అధికారి సైబర్ క్రైం గురించి పక్కాగా తెలియనప్పటికీ.. ఏదో వ్యవహారం నడుస్తోందన్న సమాచారంతో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తేలింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారిపై కేసు నమోదు చేయకుండా టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో వ్యవహారం సద్దుమణిగినట్టు సమాచారం. -
దీనికేమంటారు స్పీకర్ గారూ..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డాక్టర్లను మేనేజ్ చేసుకొని, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని, దివ్యాంగ పెన్షన్లు తీసుకున్నారు. వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే లేఖ రాశాను. ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా పెన్షన్లు తొలగించారు. ఇంకా వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే 4,148 మందిని అనర్హులుగా గుర్తించి, వారి డూప్లికేట్ దివ్యాంగ పెన్షన్లు తొలగించాం. –ఇవి బుధవారం నర్సీపట్నం ప్రెస్మీట్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పిన మాటలు కాసేపు మీ మాటలనే ప్రామాణికంగా తీసుకుందాం.. ఇవన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మేనేజ్ చేసి తీసుకున్న పింఛన్లే అనుకుందాం.. మరి గొలుగుండ మండలం విప్పలపాలేనికి చెందిన రుత్తల సూర్యవతి 16 ఏళ్ల నుంచి దివ్యాంగ పింఛన్ తీసుకుంటున్నారు. పుట్టుకతోనే మరుగుజ్జు. బుద్ధిమాంద్యంతో 50 శాతానికి పైగా వైకల్యంతో బాధపడుతున్నారు. ఆమె పెన్షన్ కూడా తొలగించారు. గొలుగొండ మండలంలో గాదంపాలేనికి చెందిన వేములపూడి శాంతాకుమారికి 15 ఏళ్లుగా దివ్యాంగ పెన్షన్ వస్తోంది. 2010లో ఇచ్చిన కంప్యూటరైజ్డ్ దివ్యాంగ సర్టిఫికెట్‌తోపాటు యూఐడీ కార్డు కూడా ఉంది. ఆమెకు 83 శాతం అంగవైకల్యం ఉంది. మరుగుజ్జుతనం, బుద్ధి మాంద్యం, పుట్టుకతోనే ఆర్థోపెడిక్ సమస్యలున్నాయి. ఆమెను కూడా పింఛన్‌కు దూరం చేశారు. దివ్యాంగులపై కక్ష వైఎస్సార్సీపీ ఆవిర్భవించక ముందే పెన్షన్ మంజూరైన వీరిద్దరికీ కూడా రద్దు చేశారు. 40 శాతానికి మించిన వైకల్యం ఉన్నా.. వారి హృదయాలను ముక్కలు చేశారు. దీనికేమంటారు స్పీకర్ గారూ..? వైకల్యంతో పుట్టడం బాధాకరం. దివ్యాంగుల్లా నటిస్తున్నారని చెప్పడం మరింత బాధాకరం. మొదటిది విధి వైపరీత్యమైతే.. రెండోది కూటమి నేతల కుటిల నీతికి నిదర్శనం. సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచుతామని గొప్పలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక కుంటి సాకులు చెబుతూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు వికృత క్రీడ ఆడుతున్నారు. కూటమి సర్కారు కక్ష సాధింపు.. దివ్యాంగ పెన్షన్ల తొలగింపువీరిలో రీవెరిఫికేషన్ చేసినవారు 12,964 జిల్లాలో మొత్తం దివ్యాంగ పింఛనుదార్లు 30,688 అనర్హులని చెబుతున్నవారు 4,148 వృద్ధాప్య పింఛన్లు 679మందికి మంజూరు వారిలో ఆరోగ్య పింఛన్లు 120 మందికి.. వారి వైకల్యానికి మరో పరీక్ష అర్హత లేదంటూ తిరస్కారం వారి గుండెకు తీరని గాయం చివరకు పింఛనుకు దూరమైన వారు 3,349 సాక్షి, అనకాపల్లి: దివ్యాంగులుగా పుట్టడమే పాపమా..? కూటమి సర్కారు అధికారంలోకి రావడం వారికి శాపమా..? అవును.. రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం అర్హతున్న దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత విధిస్తోంది. పది పదేహేనేళ్లుగా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కూడా కోత విధించింది. అంగవైకల్యం 40 శాతానికి పైగా ఉండాలంటున్నారు. కానీ 75 శాతానికి పైగా ఉన్నా కూడా పింఛన్లు కట్ చేశారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగుల, దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడిన వారి పింఛన్లను రీవెరిఫికేషన్ పేరిట ఏరివేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకూ జిల్లాలో రూ.6 వేలు పింఛను తీసుకునే దివ్యాంగుల్లో 12,964 మందిని రీవెరిఫికేషన్ జాబితాలో చేర్చారు. వారిలో 4,148మందిని అనర్హులుగా ప్రకటించారు. కొందరికి ఆరోగ్య, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసి, చివరకు జిల్లా వ్యాప్తంగా 3349 మంది దివ్యాంగ పింఛన్లు ఎగవేశారు. మళ్లీ అంగవైకల్యం ధ్రువపత్రాలు తెచ్చుకోవాలంటూ వేధిస్తున్నారు. తొలగించిన దివ్యాంగ పింఛనుదారులకు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో నెలరోజుల్లోగా అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. తొలి నెల నుంచీ వంచనే.. కూటమి సర్కారు తొలి నెల నుంచే తన కుటిల నీతిని అమలు చేస్తోంది. పెన్షన్ మొత్తం పెంచినట్టే పెంచి, లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది మామూలే. గతంలో 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు కూడా ఇలాగే అవ్వా తాతలు, వికలాంగులను వేధించుకుతిన్నారు. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానిస్తున్నారనే అక్కసుతో అవ్వాతాతలు, దివ్యాంగుల పింఛన్ తొలగించి పగ తీర్చుకుంటున్నారు. -
కల్తీ ఎరువులు విక్రయిస్తున్న దుకాణం సీజ్
చోడవరం: కల్తీ చేసి రైతులను దోపిడీ చేస్తున్న ఎరువుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గవరవరం రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో అధికారుల బృందం బుధవారం దాడి చే సింది. గొడౌన్లలో నిల్వ ఉంచిన ఎరువులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఎరువులను కల్తీ చేసి ఒకొక్క బస్తా దగ్గర రూ.300 అదనంగా వసూలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నట్టు గుర్తించారు. డీఏపీ ఎరువులో మరో నాసిరకం ఎరువులను కలిపి డీఏపీ ధరకు విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది. మూడు రకాల నాసిరకం ఎరువులను కల్తీ చేసి అదనపు ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. దీనిపై సదురు ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
మాకవరపాలెం: రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్‌ను కారు ఢీ కొట్టింది. తాళ్లపాలెం వైపు నుంచి నర్సీపట్నం వెళుతున్న కారు బుధవారం రాత్రి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్దకు వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహన లైట్ల వెలుగులో డివైడర్ కనిపించక పోవడంతోనే ఢీకొట్టినట్టు కారు యజమాని తెలిపాడు. డివైడర్‌కు రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
దోమలను పారదోలుదాం
అనకాపల్లి: వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలు దోమలు బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక భీమునిగుమ్మం హైస్కూల్ రహదారిలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనాఫిలస్ ఆడ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని సర్ రోనాల్డ్ రాస్ చెప్పినట్లు ఆమె తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ఉమ్మడి భాగస్వామ్యంతో ఉద్యమిద్దామన్నారు. వారంపైబడిన నీటి నిల్వలు తొలగించాలని, దోమల పెరుగుదలను నివారించి ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని అన్నారు. నిద్రించేటప్పుడు దోమతెరలు తప్పకుండా వాడాలని, ఇంటి కిటికీలు, తలుపులకు దోమలు రాకుండా మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కె.వరహాలుదొర, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్ట్
యలమంచిలి రూరల్: జాతీయ రహదారిపై యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి రేగుపాలెం వద్ద 2021లో 220 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో పోలీసులు ఏ1 గా పేర్కొన్న నిందితుడు అంబర్ ఖాన్(30)ని మధ్యప్రదేశ్‌లోని షాజపూర్ జిల్లా జామ్నర్, వీటీసీ, ఛత్రబాస్ దగ్గర యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర, మరో ఇద్దరు పోలీసుల బృందం అరెస్ట్ చేసి బుధవారం యలమంచిలి తీసుకొచ్చారు. అనంతరం విశాఖపట్నం కోర్టులో హాజరుపర్చగా నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ఇద్దర్ని 2021లో అరెస్టు చేయగా ఇద్దరు తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిలో ఒకర్ని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నాడు. -
మహిళ అదృశ్యంపై కేసు నమోదు
యలమంచిలి రూరల్: పట్టణంలోని పాతవీధికి చెందిన వివాహిత మహిళ రాజాన లక్ష్మి(43) ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రాజాన వెంకట రవి మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిడిజాలలో ఉన్న చిన్న కుమారుడి వద్దకు వెళతానని చెప్పి ఈ నెల 19 ఉదయం వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి నుంచి వెళ్లినపుడు ఆమె ఎరుపు రంగు చీర ధరించి ఉన్నట్టు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. -
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
పాయకరావుపేట: కాకినాడలో జరిగిన సీబీఎస్ఈ సౌత్ జోన్ యోగా పోటీలకు శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 బృందం విభాగంలో చైతన్యసాగర్ నాయుడు, మౌళీశ్వరి, వి.చైతన్య తేజ, ఆశ్రిత్ చరణ్ కుమార్, వ్యక్తిగత విభాగంలో చరణ్‌కుమార్, అండర్ –17 బృంద విభాగంలో జి.సోమ సూర్యచరణ్, బి.దేవాన్త్ నాయుడు, పి.సోహన్, సిహెచ్.జయదీప్, రక్షిత్, సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు శ్రీరామ్ గ్లోబల్ స్కూల్, న్యూవల్, హరియాణాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సంప్రదాయ ఈవెంట్లో జి.సోమ సూర్యచరణ్ బంగారు పతకం, దేవన్త్ నాయుడు రజత పతకం, సిహెచ్ రక్షిత్ కాంస్య పతకం, పి.సోహన్ 4వ స్థానం సాధించారు. ఆయా విద్యార్థులను విద్యా సంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, యోగా గురువులు సురేష్, జయంతి అభినందించారు. -
అంధురాలికి అన్యాయం
వచ్చే నెల నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి వర్తమానం పాయకరావుపేట: పుట్టుకతోనే ఆమె అంధురాలు. దివ్యాంగుల సామాజిక పింఛన్ రూ.1500 ఉన్నప్పటి నుంచి అందుకుంటోంది. వచ్చే నెల నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నట్టు హఠాత్తుగా ప్రభుత్వం నుంచి వర్తమానం అందడంతో ఆమె కంగుతింది. కంగారు పడింది. తనకు దిక్కెవ్వరని లబోదిబోమంటోంది. పట్టణంలో నివసిస్తున్న ఈగల సత్తిబాబు, లోవతల్లి దంపతుల కుమార్తె ఈగల శాంతాదేవి. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బొబ్బిలిలోని ‘ఆసియాన్ ఎయిడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్’ పేరుతో నడుస్తున్న అంధుల పాఠశాలలో చదువుకుంది. డిగ్రీ విజయనగరంలోని ఏజీఎల్ కళాశాల పూర్తి చేసింది. తనకు పూర్తి స్థాయిలో అంధత్వం ఉందని, ప్రతి నెల రూ.6 వేల పింఛన్ వచ్చేదని ‘సాక్షి’కి వివరించింది. మార్చి నెలలో జరిగిన సదరం సర్టిఫికెట్ల పరిశీలనలో 40 శాతం మాత్రమే వైకల్యం ఉందని నిర్ధారణ జరిగినందున పింఛన్ నిలిపివేస్తున్నట్టు మండల పరిషత్ కార్యాలయం నుంచి లెటర్ వచ్చిందని తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధులని, తండ్రి ఒక రైతు వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నారని వివరించింది. తనకు ఉద్యోగం రాలేదని, పింఛను పైనే ఆధారపడి జీవిస్తున్నానని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. -
అదనపు వసూళ్లు, ఒత్తిళ్లు భరించలేం
మద్యం దుకాణాలు బంద్ చేసిన నిర్వాహకులు ఎస్.రాయవరం: రూ.లక్షల ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న లైసెన్స్ మద్యం దుకాణాలపై అదనపు వసూళ్లు, అధికారులు ఒత్తిళ్లు పెరిగిపోయాయని మండలంలో ఉన్న ఏడు మద్యం దుకాణాలకు తాళాలు వేసి బుధవారం బంద్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీలో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి దుకాణాలు పెట్టుకుంటే ప్రభుత్వం ఇస్తానన్న 20 శాతం కమీషన్లో కోత విధించి, మొదటి 5 శాతం 6 నెలలు గడిచాక 13 శాతం ఇస్తున్నారన్నారు. ఇప్పుడు కొత్తగా దుకాణాలు వద్ద మద్యం సేవించేందుకు సిట్టింగ్ పర్మిట్ రూమ్ అంటూ చలానాలు కట్టమంటున్నారన్నారు. అవి ఏర్పాటు చేసుకున్న వారు కడదామనుకుంటే సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నా లేకున్నా చలానా నగదు కట్టాలని అధికారులు ఒత్తిళ్లు చేసి, షాపు ముందు మద్యం సేవించే వారిపైనా, అమ్మిన వారిపైన అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో నష్టాలు భరిస్తున్న తమను ఇంకా వేధిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తాము దుకాణాలు తెరవలేమని బంద్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ అధికారు తమ ఇబ్బందులు పరిగణనలోనికి తీసుకుని న్యాయం చేసే వరకు దుకాణాలు తెరవబోవమని చెప్పారు. ఈ ఆందోళనలో గుర్రం నానాజీ, కోయలాడ కమల్, రామకృష్ణ, దొరాజీ తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న భోజనం’ రుచికరంగా ఉండాలి
కశింకోట: పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా మెనూ ప్రకారం అందించే బాధ్యత ప్రధానపాధ్యాయులదేనని, బాధ్యతా రహితంగా వ్యవహరిరస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు హెచ్చరించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో బుధవారం జిల్లాలోని రెండు నెలల క్రితం ఎంపిక చేసిన 56 పాఠశాలల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం విషయమై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రోజూ హెచ్ఎం తనిఖీ చేసి రుచికరంగా మనూ ప్రకారం ఉందా? లేదా? అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 56 స్కూళ్లలో ఇక్కడ సామాజిక తనిఖీ పూర్తి చేసినట్టు తెలిపారు. పాఠశాలల్లో సమస్యలపై రెండు నెలల క్రితం గ్రామ సభలు నిర్వహించి గుర్తించిన సమస్యల్లో కొన్ని పరిష్కరించి, తమ స్థాయిలో పరిష్కారం కాని సమస్కలను ప్రభుత్వానికి నివేదించాలని ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులకు సూచించామన్నారు. పాఠశాలల్లో గతంలో నాడు–నేడులో చేపట్టి నిలిచిపోయిన భవనాలపై ప్రభుత్వానికి నివేదించామన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ టి. రాజేంద్రరావు, ఎంఈఒలు మూర్తి, సురేష్‌కుమార్, జిల్లా రిసోర్సు పర్సన్లు, సామాజిక తనిఖీ స్కూళ్ల హెచ్ఎంలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
పెన్షన్లు పీకేస్తే.. ప్రజలు మిమ్మల్ని పెకిలిస్తారు
కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త ధర్మశ్రీ హెచ్చరిక అచ్యుతాపురం: అధికారం ఉంది కదా అని పెన్షన్లను ఇష్టారాజ్యంగా పీకేస్తున్నారని.. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పెకిలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండలంలోని తంతడి, రాజన్నపాలెం, నునపర్తి గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అభాగ్యుల పెన్షన్లు రద్దు చేసి ఏం సాధిస్తారని, ప్రజలకు అండగా నిలవడం నేర్చుకోవాలని హితవు పలికారు. తంతడి పరిధిలోని బార్క్ భూములు కోల్పోయిన వారి జాబితా తయారీలో బినామీలను చేరుస్తున్నారని, అటువంటి చర్యలను అంగీకరించేది లేదని హెచ్చరించారు. బార్క్ నిర్వాసితుల తరపున పోరాడతామన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టి అమలు సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదన్నారు. ఫ్రీ బస్ ప్రకటించడం గొప్ప కాదని, ముందు అన్ని గ్రామాలకు బస్సులు వెళ్లేలా చేస్తే అప్పుడు మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలోని మత్స్యకార సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, జెడ్పీటీసీ లాలం రాంబాబు, కో ఆప్షన్ జెడ్పీటీసీ నర్మాల కుమార్, పార్టీ నాయకుడు కోన బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
నర్సీపట్నంలో నిఘా కెమెరాలు పెంచండి
ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలో ప్రధాన కూడళ్లలో నిఘా కెమెరాల సంఖ్య పెంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. బుధవారం సాయంత్రం నర్సీపట్నం టౌన్ పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీషీటర్లపై మరింత నిఘా పెంచాలని సిబ్బందికి సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఉన్న ముద్దాయిలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దొరికిన వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు. పోలీసు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నర్సీపట్నంలోని ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో నిఘా కెమెరాల సంఖ్య పెంచాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని టౌన్ సీఐ గోవిందరావుకు సూచించారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. -
అక్కడ రూ.147.. కానీ.. ఇక్కడ మాత్రం రూ.377
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ బెడ్షీట్లను కాన్పూర్‌కి చెందిన సహకారి సమితి లిమిటెడ్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దాదాపు రూ.7.86 కోట్లతో 2,54, 657 బెడ్షీట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే రూ.141.75కి కొనుగోలు చెయ్యగా.. ఈస్ట్రన్ రైల్వే జోన్ రూ.189 వెచ్చించారు. కానీ దక్షిణ మధ్య రైల్వే మాత్రం 2023లో ఏకంగా రూ.377 కి కొనుగోలు చేసింది. దీనిపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. అయినా అదే కుంభకోణం మరోసారి జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రైల్వే జోన్లు అధిక ధరకు ఈ బెడ్షీట్లను కొనుగోలు చేసి భారీగానే లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చెయ్యాల్సిన అవసరం ఏముందనే అంశంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే అన్ని జోన్లలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన బెడ్షీట్లను ఎంత ధరకు కొనుగోలు చేశారు..ఎందుకు కొనుగోలు చేశారనే ఫైళ్లని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రైల్వే జోన్లు దాదాపు 63 శాతం అధిక ధరను బెడ్షీట్ల కోసం వెచ్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోందని తెలియడంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లోనూ కలకలం మొదలైంది. మొత్తంగా ఈ బెడ్షీట్ల కుంభకోణం బట్టబయలైతే.. దాదాపు 10 జోన్లలో ఉన్నతాధికారులు ఇందులో చిక్కుకునే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. -
25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్ విజయ కృష్ణన్తుమ్మపాల: ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలు, అందరికీ ఇళ్లు, భూముల క్రమబద్ధీకరణ, భూ సర్వే , కోర్టు కేసులు, అన్నదాత సుఖీభవ, రేషన్ పంపిణీ, మ్యుటేషన్లు, ఏపీ సేవా సర్వీసులు, నీటితీరువా వసూళ్లు, ఇంటి స్థల దరఖాస్తుల పరిశీలన, తదితర అంశాలపై జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావుతో కలిసి కలెక్టరేట్ మినీ కన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఇంటి స్థలం కోసం వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. వివాదం లేని ఆక్రమిత ప్రభుత్వ భూములలో ఇంటి నిర్మాణం చేసి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి వెంటనే ముగించాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ కోసం ఇంకా ఏమైనా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే దానికి గల కారణం పరిశీలించి ఆధార్ సీడింగ్ వంటి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి తీరువా వసూళ్లు ఆగస్టు నాటికి పూర్తిచేయాలని చెప్పారు. బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు బాల్య దశలో వివాహాలు జరగకుండా, కౌమార దశలో గర్భం దాల్చకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాసంతపు జిల్లా స్థాయి బాలల సంక్షేమ, రక్షణ కమిటీ సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అన్ని మండల, గ్రామ, వార్డు పరిధిలో బాలల సంక్షేమ, రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. బాలలు మత్తు మందులకు బానిస కాకుండా, వారికి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి కె.ఎల్.ఎన్.మూర్తి, బాలల సంరక్షణ అధికారి రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎంహెచ్‌వో హైమావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
మునగపాక: నాగులాపల్లిలో మూడు రోజులపాటు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు బుదవారం రాత్రితో ముగిశాయి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జన్మదినం సందర్బంగా అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. 8 జిల్లాలకు సంబందించిన మహిళలు, పురుషుల కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. కబడ్డీ ఆసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు ఇతర సభ్యుల సహకారంతో పోటీలు విజయవంతంగా ముగిసాయి. మహిళల విభాగంలో విశాఖ జట్టుకు ప్రథమ స్థానం, శ్రీకాకుళం జట్టుకు ద్వితీయ స్థానం దక్కాయి. విజేతలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయకుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాసరావు మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళా విభాగం విజేత విశాఖ జట్టు -
సంపద కేంద్రాల్లో సేంద్రియ ఎరువుల తయారీ
నక్కపల్లి: గ్రామాల్లో నిర్మించిన సంపద తయారీ కేంద్రాల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసే కార్యకలాపాలు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి నారాయణమూర్తి సూచించారు. బుధవారం ఆయన దేవవరం, ఒడ్డిమెట్ట, ఉద్దండపురం గ్రామాల్లో పర్యటించారు. ఐవీఆర్ఎస్ గ్రామాలుగా గుర్తించిన పంచాయతీల్లో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎంపీడీవోలు, కార్యదర్శులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే పర్యటించి, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవవరం సంపద తయారీ కేంద్రంలో ఇళ్ల నుంచి సేకరించిన తడిపొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను స్థానిక క్లాప్ మిత్రలు చేపట్టారు. ఇలా వేరు చేసిన చెత్త నుంచి వర్మికంపోస్టు (సేంద్రియ ఎరువులు) తయారు చేసేందుకు గాను వానపాములను విడుదల చేశారు. అనంతరం ఒడ్డిమెట్ట గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. తదుపరి ఉద్దంపురంలో రక్షిత మంచినీటి పథకాల్లో క్లోరినేషన్ పనులను పరిశీలించారు. రైతు సేవాకేంద్రాలను తనిఖీ చేసి ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయో లేవో ఆరా తీశారు. వెల్నెస్ సెంటర్లో సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో గ్రామాల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు. ఒడ్డిమెట్ట గణపతి ఆలయాన్ని సీఈవో దర్శించుకున్నారు. ఎంపీడీవో సీతారామరాజు, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు, సర్పంచ్‌లు జి.నర్సింహమూర్తి, పి.వెంకటేష్, ఉప సర్పంచ్ వేగేశ్న చంటి, కార్యదర్శశి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
అనకాపల్లి టౌన్: పలు చోరీ కేసులలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్ధానిక డిఎస్పి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చోడవరం మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో ఈ నెల ఏడు నుంచి 18వ తేదీ వరకు ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన నిందితుడు కన్నూరి విష్ణుమూర్తిని అరెస్ట్ చేసి, నుంచి నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఈ యువకుడు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. సమావేశంలో చోడవరం సీఐ పి.అప్పలరాజు, ఎస్ఐ నాగకార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు. -
బెడ్ షీట్లలో భారీ అవినీతి
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల రైల్వే శాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుంటోంది. డీఆర్ఎంలు, సీనియర్ ఇంజినీర్లు వరుసగా సీబీఐ దాడుల్లో పట్టుబడుతున్న నేపథ్యంలో మరో కుంభకోణం బట్టబయలైంది. కాదేదీ కుంభకోణానికి అనర్హం అన్నట్లుగా ఏసీ కోచ్‌లలో సరఫరా చేసే బెడ్షీట్ల కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో జోన్ పరిధిలో ఒక్కో ధరకు బెడ్షీట్లు కొనుగోలు చెయ్యడం చూస్తుంటే భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈ విషయంలో ముందువరసలో ఉంది. సాధారణంగా కొన్ని జోన్లు ఒక్కో బెడ్‌షీట్ రూ.147 కి కొనుగోలు చేస్తుండగా అనేక జోన్లు మాత్రం ఏకంగా రూ.300కి పైగా కొనుగోలు చెయ్యడం వెనుక భారీ అవినీతి దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం సీబీఐ దర్యాప్తు చేపట్టినా మళ్లీ ఈ కుంభకోణం వ్యవహారం షురూ అయ్యింది. దీంతో మరోసారి సీబీఐ దీనిపై దృష్టిసారించడంతో అన్ని రైల్వే జోన్లలో ఈ బెడ్షీట్ల కుంభకోణం బట్టబయలయ్యే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ఇండియన్ రైళ్లలో థర్డ్ ఏసీ, సెకెండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు బెడ్షీట్లు సరఫరా చేస్తుంటారు. ఈ బెడ్షీట్లను అన్ని జోన్లు దాదాపు ఒకే దగ్గర కొనుగోలు చేస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం ఓ రైలులో బెడ్షీట్లు నాసిరకంవి సరఫరా చేసినట్లు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆరాతీసిన రైల్వే బోర్డు ఉన్నతాధికారులకు దిమ్మతిరిగే షాక్ కలిగింది. ఈ బెడ్షీట్ల కొనుగోలు వెనుక భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సుమారు అన్ని జోన్లలోనూ ఇదే తరహా వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాసిరకం బెడ్షీట్లపై దర్యాప్తు చెయ్యగా దాని వెనుక ఉన్న బండారాన్ని బయటకు లాగే పనిలో సీబీఐ అధికారులు మరోసారి నిమగ్నమైనట్లు సమాచారం. 2023 నుంచి ఈ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి రాజ్యమేలుతున్నట్లు గుర్తించారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
గొలుగొండ: జోగుంపేట జంక్షన్ వద్ద స్కూల్‌బస్సుకు ప్రమాదం తప్పింది. నర్సీపట్నంలోని నలంద స్కూల్ బస్ బుధవారం ఉదయం 8 గంటలకు జోగుంపేట కాలనీకి వెళుతున్న సమయంలో జోగుంపేట జంక్షన్ వద్ద స్టీరింగ్ అదుపు తప్పింది. ఈ సమయంలో బస్‌లో 55 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. జోగుంపేట మలుపు వద్ద ప్రమాదం జరగడంతో ఎటువంటి నష్టం జరగలేదు. అదే రోడ్డుపై స్టీరింగ్ అదుపు తప్పితే పెద్ద ముప్పే ఎదురయ్యేది. కృష్ణదేవిపేట–నర్సీపట్నంలో తిరిగే బస్సులు పాతవి కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వీటిపై రవాణాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
నాతవరం : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సత్వరం నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యుడు గాదె శ్రీనివాసులనాయుడును కోరారు. ఆయన జిల్లేడుపూడిలో బుచ్చెంపేట నూకాలమ్మ తల్లిని దర్శించేందుకు మంగళవారం విచ్చేసిన సందర్భంగా జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ కన్వీనర్ పట్నాల సతీష్, నాతవరం మండల శాఖ జేఏసీ కన్వీనర్ అంకంరెడ్డి శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏళ్లతరబడి పని చేస్తున్నా ప్రభుత్వం జీతాలు పెంచలేదన్నారు. మా సమస్యలపై గతంలో అందోళనలు చేస్తే ప్రధాన సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కనీసం పట్టించుకోలేదన్నారు. కనీసం ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిస్తూ వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. త్వరలో జరిగే శాసన మండలి సమావేశాల్లో కూడా వారి సమస్యలు ప్రస్తావిస్తానని తెలిపారు. మండలానికి విచ్చేసిన ఎమ్మెల్సీని ఎంఈవోలు బ్రహ్మాజీ, కామిరెడ్డి వరహాలబాబు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయు రాష్ట్ర నాయకుడు డి. గోపీనాథ్, మండల నాయుకులు శెట్టి సుబ్రమణ్యం లాలం శ్రీనివాస్, గుడపర్తి దేముడు, సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు సిహెచ్. వెంకటలక్ష్మి కె.గోవింద్, అరుణజ్యోతి, ఎస్.సత్యవేణి బి.వి.నాయుడు టి.సాంబమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మూడు చోట్ల భారీగా గంజాయి స్వాధీనం
పాయకరావుపేట : జాతీయ రహదారిపై రవాణా చేస్తున్న రూ.40 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన బైపురెడ్డి రత్నం, తూర్పుగోదావరి జిల్లా రాగంపేట గ్రామానికి చెందిన ఎర్రమిల్లి నాగవీరశివ, కాకినాడ జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన కొళ్ల నాగసతీష్ కలిసి యక్స్ యువి పిడబ్ల్యూడి 500 డబ్ల్యూ 8 మహేంద్ర కారులో జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తుండగా విశ్వసనియ సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ వద్ద సీఐ జి.అప్పన్న తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేసి పట్టుకున్నారని తెలిపారు. కారులో నాలుగు బస్తాల గంజాయిని గుర్తించి, కారుతో పాటు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో బైపురెడ్డి రత్నం భర్తకు గతంలో పరిచయం చేసిన నర్సీపట్నానికి చెందిన వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని 200 కేజీల గంజాయిని సరఫరా చేయడానికి రూ.3 లక్షలు అడ్వాన్సుగా తీసుకుని పంపించడం జరిగిందన్నారు. రత్నం భర్త రాజు గంజాయి రవాణా కేసులో 5 నెలల క్రితం చైన్నెలో అరెస్టయినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆటోలో ఒడిశా నుంచి గబ్బడ మీదుగా నర్సీపట్నానికి, అక్కడ నుంచి నక్కపల్లి మండలం నెల్లిపూడి వద్ద నిల్వ చేశారని, అనంతరం రాజమండ్రికి తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. గంజాయి, కారుతో పాటు, 4 సెల్ఫోన్లు, రూ.3 వేల నగదు కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. సీఐ అప్పన్న, ఎస్ఐలు జె.పురుషోత్తం, పోలీసు సిబ్బందిని ఎస్సీ తుహిన్ కుమార్ సిన్హా అభినందించాని తెలిపారు. ముగ్గురు అరెస్టు..నలుగురు పరార్ నర్సీపట్నం : గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారైనట్టు డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు, తిరువళ్ళూరుకు చెందిన తరుణ్ కుమార్ గోపి(24), అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, దోమ లగొంది గ్రామానికి చెందిన గడుగు కొండబాబు(39), చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలానికి చెందిన ఎ.దినేష్(30) గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు పరారయ్యారని, నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. ముందస్తు సమాచారంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, గొలుగొండ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐలు రామారావు, రాజారావు, సిబ్బంది వాసుబాబు, సాయి సురేష్, నగేష్ టీమ్ మంగళవారం గొలుగొండ మండలం, కొమిర గ్రామ శివారులో మాటువేసి కారు, ముందు రెండు బైక్‌లపై వస్తున్న ఇద్దరు పైలెట్లను అదుపులోకి తీసుకున్నారు. కారులో 24 కేజీల చొప్పున 9 బస్తాల్లో 216 కేజీల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.50 లక్షలు ఉంటుందన్నారు. ఒడిశా రాష్ట్రం, చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో జనాభాయ్ దగ్గర వారు కేజీ రూ.5 వేలు చొప్పున కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. అక్కడ నుంచి భూసులకోట మీదగా కొమిర గ్రామ శివారుకు తరలించి, అక్కడి నుంచి నర్సీపట్నం మీదుగా తమిళనాడుకు రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నిందితులపై పాత కేసులు ఉన్నాయన్నారు. వారిపై పీడీయాక్టు ప్రయోగించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నిందితుల ఆస్తులను సైతం జప్తు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. కేసును చేధించిన సీఐ, ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. బొడ్డరేవు వద్ద 320 కిలోలు... మాడుగుల రూరల్ : వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీ శివారు బోడ్డరేవు గ్రామ పరిసరాల్లో నిర్వహించిన దాడుల్లో, 320 కిలోల గంజాయిని పట్టుకుని, 16 మంది నిందితులను అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారైనట్టు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాలివి. ఈ నెల 18 వ తేదీ సోమవారం రాత్రి ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ జి. నారాయణరావు, ఏఎస్ఐ, వారి సిబ్బందితో కలిసి బోడ్డరేవు గ్రామ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా ఆటో నెంబరు ఎపి31టిడి2387లో 16 బ్యాగుల్లో 320 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు శంకరం పంచాయితీ శివారు తాడివలస గ్రామానికి చెందిన వారు కాగా, మిగిలిన 14 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారు. ఈ దాడుల్లో గంజాయి రవాణా చేస్తున్న ఆటోతో పాటు మూడు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎ1 నిందితుడు యలమంచిలి పోలీసుస్టేషన్లో, ఎ2 నిందితుడు ఎన్డీపీసీ చట్టం కింద కేసుల్లో నిందితులుగా వున్నారన్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. నిందితులను మంగళవారం సాయంత్రం అరెస్టు చేసి, రిమాండుకు పంపించామన్నారు. విలేకరుల సమావేశంలో కె. కోటపాడు సీఐ పైడిపునాయుడు, ఎస్ఐ జి. నారాయణరావు పాల్గొన్నారు. ఈ కేసులో పనిచేసిన సిబ్బందిని ప్రశంసిస్తూ నగదు బహమతులను డీఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. -
108 డిఫెన్స్ మద్యం బాటిళ్ల స్వాధీనం
పెదగంట్యాడ: గాజువాక పరిసర ప్రాంతాల్లో అక్రమంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. పెదగంట్యాడ కూడలి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నరసింహారెడ్డి అనే వ్యక్తి నుంచి 15 డిఫెన్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నరసింహారెడ్డి గాజువాక బీసీ రోడ్డులోని వెంకటేశ్వర ఫర్నిచర్ దుకాణం యజమాని జీలకర్ర సుబ్బారావు నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు ఆ ఫర్నిచర్ దుకాణంలో సోదాలు చేయగా, మొత్తం 108 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ మద్యం ఎక్కడ నుంచి వస్తోందని సుబ్బారావును ప్రశ్నించారు. నేవల్ అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేసి, అందుకు బదులుగా మద్యం సీసాలను ఇస్తారని సుబ్బారావు చెప్పాడు. ఈ కేసులో నరసింహరెడ్డి, జీలకర్ర సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని గాజువాక ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. -
● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య
పాయకరావుపేట: కేవలం విద్యనే కాకుండా విద్యార్ధుల్లో అంతర్గతంగా దాగి వున్న నైపుణ్యాలను వెలికి తీసే కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యాలు నిర్వహించాలని ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల 49 వ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు విద్యా సంస్ధల వివిధ శాఖల విద్యార్ధుల మధ్య గాతా రహే మేరా దిల్ పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సీని నేపద్య గాయని కౌసల్య, కీబోర్డ్ ప్లేయర్ రవి శేఖర్ హాజరయ్యారు. గాయని కౌసల్య మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రసిద్ధ గేయ రచయిత ఆనంద్ బక్షి పాటలను ఎంపిక చేసుకోవడం ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చిందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారని, నిత్యం సాధన చేస్తే భవిష్యత్‌లో మంచి గాయకులుగా రాణించగలరని అన్నారు. ఈ పోటీలు 6 వ తరగతి నుంచి డిగ్రీ వరకు జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కౌసల్యను విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ సత్కరించారు. సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, భానుమూర్తి, డాక్టర్ బంగార్రాజు, డా. రామకృష్ణారెడ్డి, బి.సీతారాణి, మేనేజర్ శ్రీనివాస్, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కనికరం లేని పాలకులు
ఈ బురద రోడ్డే దిక్కుఅనారోగ్యంతో ఉన్న బాలింతను డోలీపై తీసుకువెళుతున్న గిరిజనులు (ఫైల్)ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఎన్నో పోరాటాలు రోడ్డు కోసం ఆదివాసీ గిరిజనలు చేయని పోరాటాలు లేవు. వందలసార్లు రోడ్డు వేయాలని మండల కేంద్రం వద్ద ఆందోళన చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మూడు రోజుల క్రితం నర్సీపట్నంలో వినూత్నంగా డోలిమోతలకు నిరసన తెలిపారు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందించారు. గ్రామంలో వారి సమస్యలకు అద్దంపట్టే విధంగా మోకాళ్లపై చిన్నారులు నిరసన చేశారు. రోడ్డు లేక చదువులకు దూరం అవుతున్నామని ఆందోళన చేశారు. అయితే అవేవీ పాలకుల్లో కనికరం కలిగించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దే త్వరలో ఆందోళన చేస్తామని రోడ్డువేసే వరకు అక్కడే గిరిజనలు నివాసం ఉంటామని తెలుపుతున్నారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు గిరిజనుల రోడ్డు సమస్యపై గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారి సమస్యను దృష్టిలో ఉంచుకొని 2023లో జివో నెంబర్ 726 ఇంపాక్ట్ నిధుల నుంచి మంజూరు చేశారు. అటవీశాఖ అనుమతులు కోసం చర్యలు తీసుకున్నారు. రోడ్డు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అటవీశాఖ అనుమతులు రావడం కాస్త ఆలస్యం కావడం, ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు జరగలేదు. తరువాత కూటమి సర్కార్ రావడంతో పాటు అటవీశాఖ అనుమతులు వచ్చినా పనులు ప్రారంభం చేయకపోవడం గమనార్హం. ఆందోళన ఉధృతం చేస్తాం అన్ని అనుమతులు వచ్చినా రోడ్డు వేయలేదు. వర్షాకాలంతో మా కష్టాలు చెప్పలేనంతగా ఉన్నాయి. ఈ సీజన్లో ఆగాకర, బీర పంటలు అధికంగా వేస్తున్నాం. పండిన పంట కావిళ్లుపై తీసుకురావడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికై నా అనారోగ్యం వచ్చినా నరకం చేస్తున్నాం. చిన్నారులు బడికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. మా సమస్యపై మండల, డివిజన్ కేంద్రాల్లో ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మా సమస్యలు తీర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. –సత్తిబాబు, డొంకాడ గ్రామం -
అశ్లీల నృత్యాల నిర్వాహకులపై కేసు నమోదు
ఏటికొప్పాకలో అశ్లీల నృత్యాల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ ధనుంజయరావు యలమంచిలి రూరల్ : యలమంచిలి మండలం ఏటికొప్పాకలో శ్రీకృష్ణాష్టమి వేడుకల ముసుగులో అశ్లీల నృత్యాల నిర్వాహకులపై యలమంచిలి రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.ఈ నెల 17వ తేదీ రాత్రి గ్రామంలో శ్రీకృష్ణుని గుడి వద్ద ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ముగ్గురు యువతులతో అశ్లీల నృత్యాలు వేయించారు. పొట్టి దుస్తులతో అసభ్యకరంగా డాన్సులు చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు అసభ్యకర నృత్యాల నిర్వాహకులను గుర్తించారు. గ్రామ వీఆర్వో బసనబోయిన జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వాటి ముసుగులో అసభ్యకర నృత్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ ధనుంజయరావు హెచ్చరించారు. ఏటికొప్పాకలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన యువకులకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
రాంబిల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ రాంబిల్లి (అచ్యుతాపురం): ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం రాంబిల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనఖీ చేశారు. డీఆర్ఐ దాడుల నేపథ్యంలో ఎస్పీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన రిసెప్షన్ కౌంటర్‌ను, కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. కేసుల పురోగతిని సమీక్షించి, రికార్డులను తనిఖీ చేశారు. పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, ఎస్ఐ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో ఎన్ఎస్టీఎల్ అద్భుతాలు
గోపాలపట్నం (విశాఖ): శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యాసంస్థలు, నేవీ అధికారుల సమష్టి కృషితో ఎన్ఎస్టీఎల్ అద్భుతాలను సృష్టిస్తోందని డీడీ ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ అన్నారు. మంగళవారం ఎన్ఎస్టీఎల్ 56వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశాన్ని రక్షణ రంగంలో సాధికారత వైపు నడిపించడంలో ఎన్ఎస్టీఎల్ 56 ఏళ్ల ప్రయాణం ఎంతో కీలకమన్నారు. ఈ ప్రయాణంలో కృషి చేసిన ఉద్యోగులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ 1969 ఆగస్టు 20న కేవలం 10 మందితో ప్రారంభమైన ఎన్ఎస్టీఎల్.. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు 184 మంది శాస్త్రవేత్తలు, 662 మంది ఉద్యోగులు సేవలందిస్తోందన్నారు. జలాంతర యుద్ధ ఆయుధాలు, వ్యవస్థల అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందన్నారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్(మెటీరియల్స్ అండ్ సిస్టమ్స్) ఆర్.వి.హరప్రసాద్, మెటీరియల్ అసిస్టెంట్ చీఫ్(డాక్ యార్డ్ అండ్ రిఫిట్) రియర్ అడ్మిరల్ అరవింద్ రావల్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులు, సిబ్బందిని సత్కరించారు. ఉత్తమ గ్రంథాలయ వినియోగదారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే మొత్తం 40 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. వరుణాస్త్ర కోసం రూపొందించిన ‘బెలూన్ రికవరీ సిస్టమ్’ సాంకేతికతను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ(బీడీఎల్)కు బదిలీ చేశారు. డాక్టర్ సమీర్ వి.కామత్ చేతుల మీదుగా ఈ సాంకేతికతను బీడీఎల్ డైరెక్టర్(ప్రాజెక్ట్స్) పి.వి.రాజారామ్‌కు అందజేశారు. ఎన్ఎస్టీఎల్ అభివృద్ధి చేసిన జీటీ–ఐఆర్ఎస్ఎస్ను ఆయన రియర్ అడ్మిరల్ అరవింద్ రావల్‌కు అందించారు. స్వదేశీ రాడార్ క్రాస్ సెక్షన్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్ ‘నిర్వాణ’ను కూడా విడుదల చేశారు. ఎన్ఎస్టీఎల్ హిందీ మ్యాగజైన్ ‘మథన్’8వ సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, నిర్వహణ కమిటీ సభ్యులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
వర్షాలతో వడివడిగా వరినాట్లు
నక్కపల్లి: గడచిన నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు మేలు చేశాయి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరిసాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. నారు మొలకెత్తినప్పటికీ అవసరమైన నీటి సదుపాయం లేకపోవడం, వర్షాలు పడకపోవడంతో ఆదుర్దా పడ్డ రైతులకు తాజాగా మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అవసరమైన నీరు అందుబాటులోకి రావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. మంగళవారం దేవవరం, చినరామభద్రపురం గ్రామాల్లో ప్రారంభమైన వరినాట్లను జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, మండల వ్యవసాయాధికారి ఉమాప్రసాద్లు పరిశీలించారు. పొలాల్లోకి దిగి రైతులతో కలిసి వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు మాట్లాడుతూ వరిపంట కాలంలో 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం వేసుకోవాలన్నారు. మొదటి దమ్ము చేసేటప్పుడు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసి దమ్ము చేయడం ద్వారా పచ్చిరొట్ట ఎరువులు కలుపు ఎరువుగా మారతాయన్నారు. సింగిల్ ఫాస్పేట్ వేయకపోతే చివరి దమ్ములో 50 కిలోల డీఏపీ, 15 కిలోల పొటాష్ వేస్తే దుబ్బు చేసే దశ అనగా సుమారు 25 నుంచి 35 రోజుల దశలో కలుపు తీసిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా వేస్తే సరిపోతుందన్నారు. అంకురం దశలో అడుగు పొట్ట దశలో ఉన్నప్పుడు ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పాటాష్ వేయాలన్నారు. -
గోశాల అక్రమాలపై విచారణ
ఎస్.రాయవరం: మండలంలో గోశాల పేరుతో పశువుల అక్రమ తరలింపుపై ‘రక్షకులు కాదు.. గో భక్షకులు’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. పెనుగొల్లు గ్రామంలో ఉన్న గోశాలను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రామ్మోహన్రావు మంగళవారం పరిశీలించారు. ఫిర్యాదీ సోమిరెడ్డి రాజు నుంచి మరిన్ని వివరాలు తీసుకున్నారు. ఈ నెల 12న తమ శాఖ అధికారులు వచ్చి గోశాలను పరిశీలించారని, గోశాలలో ఒక్క పశువు కూడా లేదని నివేదిక ఇచ్చారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు తాము వచ్చినట్టు చెప్పారు. తమ శాఖ నివేదిక పూర్తయిన తరువాత గోశాల అనుమతి రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. గోశాల అనుమతులతో చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీర్రాజు, నక్కపల్లి వైద్యులు గీతంవర్మ, అనకాపల్లి జిల్లా వైద్యులు నోడల్ అధికారి హన్నాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ముంపు తగ్గినా ముప్పు తప్పలేదు
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం (బీఎన్) రహదారిలో డైవర్షన్ రోడ్లు నీటి ముంపు నుంచి బయటపడినా ఇంకా ప్రమాదం పొంచి ఉంది. విజయరామరాజుపేట తాచేరు వంతెనపై ఉన్న డైవర్షన్ రోడ్డు పూర్తిగా గండి పడింది. వడ్డాది పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుకు మాత్రం నీటి ఉధృతి తగ్గింది. అయితే కరెంట్ ఆఫీసు పక్క వైపు గండి పడింది. పెద్దేరు నదిలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇంకా డైవర్షన్ రోడ్డుపై నుంచే నీరు ప్రవహిస్తోంది. దీంతో రెండు డైవర్షన్ రోడ్లకు ఇంకా మరమ్మతులు చేపట్టలేదు. విశాఖ, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం వైపు వెళ్లే వాహనదారులు రవాణా సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వడ్డాది, విజయరామరాజుపేట, మంగళాపురం తదితర గ్రామాల్లో పలు పంటలు నీటి ముంపు నుంచి ఇంకా బయట పడలేదు. ‘తాండవ’లో పెరుగుతున్న నీటిమట్టం నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోందని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నీటిమట్టం సాయంత్రానికి 375.8 అడుగులకు చేరిందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో 1800 క్యూసెక్కులు వచ్చి ప్రాజెక్టులో చేరుతోందన్నారు. ప్రస్తుతం తాండవ ప్రధాన గేట్ల ద్వారా పంట కాలువలోకి రోజుకు 310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ‘రైవాడ’ నుంచి 500 క్యూసెక్కులు విడుదల దేవరాపల్లి: రైవాడ జలాశయం నుంచి స్పిల్ వే గేటు ద్వారా 500 క్యూసెక్కుల వరద నీటిని మంగళవారం సాయంత్రం శారదానదిలోకి విడుదల చేశారు. 7వ నెంబర్ గేటు ద్వారా నీటిని విడుదల చేసినట్లు జలాశయం డీఈఈ జి.సత్యంనాయుడు తెలిపారు. జలాశయంలోకి 2000 క్యూసెక్కుల (ఇన్‌ఫ్లో) వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.35 మీటర్లకు చేరుకుంది. శారదానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది దాటే ప్రయత్నం చేయవద్దని డీఈఈ సూచించారు. -
ఎన్టీపీసీ విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎన్టీపీసీ చీఫ్ విజిలెన్స్ అధికారి రస్మితా ఝా పరవాడ: దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీలో మూడు నెలలపాటు జరిగే ‘విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్’ మంగళవారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) రస్మితా ఝా ఈ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజిలెన్స్ అనేది మనందరి భాగస్వామ్య బాధ్యత అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను, కేసులను సకాలంలో పరిష్కరించాలని, పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ విధానాలను బలోపేతం చేయాలని ఆమె అధికారులను కోరారు. ఉద్యోగులు, విక్రేతలు, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. నాటకాలు, క్విజ్లు, వీడియోలు, విక్రేతల సమావేశాల ద్వారా ఈ ప్రచారాన్ని సృజనాత్మకంగా నిర్వహించాలని ఆమె అన్నారు. గతేడాది ఈ ప్రచారం విజయవంతమైందని, ఈ ఏడాది కూడా విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం నవంబర్ 17 వరకు కొనసాగుతుందన్నారు. -
మెలిపాక విద్యార్థికి పీజీ నీట్లో 1913వ ర్యాంక్
మునగపాక: మండలంలోని మెలిపాకకు చెందిన డాక్టర్ గుర్రం శ్రీనివాస్ కుమార్ పీజీ నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1913వ ర్యాంక్ సాధించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం విడుదలైన ఫలితాల్లో శ్రీనివాస్ కుమార్ 612/800 మార్కులతో మెరుగైన ర్యాంక్ తెచ్చుకున్నారు. ఎండీ జనరల్ మెడిసిన్‌లో చేరేందుకు అర్హత సాధించారు. తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేసి న్యురాలజిస్టుగా ప్రజలకు సేవలందించాలన్న లక్ష్యం తనకుందని శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఆయన తండ్రి శ్రీనివాస్ చూచుకొండ పీహెచ్సీలో ఆరోగ్య విస్తరణ అధికారిగా సేవలందిస్తున్నారు. తల్లి గృహిణి కాగా సోదరి వీర వెంకట శరణ్య ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. -
ప్రమోషన్ సున్నా
మూడింతల సర్వీస్ ఉన్నా.. అనకాపల్లి జిల్లాలో బి.వెంకట్రావ్ (పేరు మార్పు) అనే కానిస్టేబుల్ 2009లో సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. దాదాపుగా 16 ఏళ్ల పాటు వివిధ పోలీస్స్టేషన్లలో సివిల్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. కానీ హెడ్ కానిస్టేబుల్‌గా (హెచ్‌సీ) పదోన్నతి రాలేదు. ఇటీవల పదోన్నతి శిక్షణ కూడా పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకుని ఐదు నెలలుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. కోర్టులో కేసు ఉందని పదోన్నతుల ప్రక్రియ నిలిపివేశారు. కొందరి కోసం అందరి ప్రమోషన్లు ఆపడం తగదని వాపోతున్నారు. సాక్షి, అనకాపల్లి: ప్రజలకు రక్షణగా ఉండే పోలీస్ వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్న సివిల్ కానిస్టేబుళ్లు పదోన్నతి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్‌గా ఆరేళ్ల సర్వీసు పూర్తయ్యాక సాధారణంగా పదోన్నతి ఇస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. ఇటీవల సీనియర్ కానిస్టేబుళ్లకు మూడు వారాలపాటు పదోన్నతి శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తయి ఐదు నెలలు గడిచినా వారికి పదోన్నతులు రాలేదు. రాష్ట్రంలో ఇలాంటి బాధితులు 869 మంది ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 150 మంది సీనియర్ కానిస్టేబుళ్లు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రమోషన్ ట్రైనింగ్.. రాష్ట్రవ్యాప్తంగా 869మంది సీనియర్ కానిస్టేబుళ్లను గుర్తించి ఈ ఏడాది మార్చి 7వ తేదీ నుంచి 27 వరకు ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ విధి విధానాలు, బాధ్యతల గురించి వారికి తగిన తర్ఫీదు ఇచ్చారు. ఈ ట్రైనింగ్ జరుగుతుండగా ఏపీఎస్సీ నుంచి ఏఆర్, ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్షన్ అయిన కొంతమంది కానిస్టేబుళ్లు ఈ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వెయ్యడంతో ఈ ప్రక్రియను మధ్యలో నిలిపివేశారు. ప్రతి జిల్లాలో 30 నుంచి 40 వరకు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శిక్షణ ఇచ్చి ఈ పోస్టులు భర్తీ చేస్తారని, తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు నిరాశ ఎదురైంది. ఇలాంటి సీనియర్ సివిల్ కానిస్టేబుళ్లు అనకాపల్లి జిల్లాలో 60 మంది, విశాఖ జిల్లాలో 65 మంది, అల్లూరి జిల్లాలో 25 మంది ఉన్నారు. కోర్టు కేసు ఉందని ప్రభుత్వం తమ ప్రమోషన్ల ప్రక్రియను పక్కన పెట్టడం తగదని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న బాధిత కానిస్టేబుళ్లు కోరుతున్నారు. -
సహనానికి పరీక్ష
కశింకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల సహనాన్ని పరీక్షిస్తోంది. బస్సులు సరిపోక నిలుచొని ప్రయాణించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రద్దీ వల్ల కొన్ని బస్సులు బస్టాపుల్లో నిలపకుండా వెళ్లిపోతుండటంతో ప్రధానంగా విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీ బస్సులు వచ్చే వరకు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల స్కూళ్లు, కళాశాలలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని, తిరుగు ప్రయాణంలో ఇళ్లకు చేరడం ఆలస్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు. దీని దృష్ట్యా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఎక్కువ బస్సులు నడపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆధార్ జెరాక్స్ అనుమతించాలి ఆధార్ ఒరిజినల్ కార్డు ఉంటేగాని కండక్టర్లు అనుమతించడం లేదని, దీంతో యథావిధిగా టికెట్ తీసుకొని ప్రయాణించాల్సి వస్తోందంటున్నారు. దీంతో చేతి చమురు వదులుతోందని, ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ జెరాక్స్ కాపీతో కూడా అనుమతించాలంటున్నారు. ఉచిత ప్రయాణానికి ఏ కేటగిరి బస్సులు ఎక్కి ప్రయాణించాలో తెలియడం లేదని, ఈ విషయమై విస్తృత ప్రచారం కల్పించాలంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు మహిళలు ఏ పనీ లేకపోయినా ఉచిత ప్రయాణమని ఉత్సాహంతో అనవసరంగా తిరుగుతూ అతి తక్కువ దూరానికే బస్సులు ఎక్కి, దిగుతుండటం, గమ్యాలకు చేరకుండానే మధ్యలో దిగిపోవడం చేస్తున్నారని, వారికి టిక్కెట్లు ఇవ్వాల్సి రావడం కూడా ఇబ్బందిగా పరిణమిస్తోందని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. -
వ్యక్తి అదృశ్యం
కశింకోట: హైదరాబాద్‌కు చెందిన షేక్ షాజిద్ కనిపించడం లేదంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసిన మేరకు సోమవారం కేసు నమోదు చేశామని సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. పదేళ్ల క్రితం కశింకోటకు వలస వచ్చి ఇక్కడ జాతీయ రహదారిపై బిర్యాని పాయింట్ నడుపుతూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న బిర్యానీ సామాన్లు కొనుగోలు చేయడానికి స్కూటీపై అనకాపల్లికి వెళ్లి తిరిగి రాలేదన్నారు. చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో భార్య షాహిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
పొలాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి
దేవరాపల్లి: భారీ వర్షాలకు నీటి ముంపునకు గురైన పంట పొలాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహన్‌రావు రైతులకు సూచించారు. ఈ మేరకు మండలంలోని ఎం.అలమండ, కొత్తపెంట, తారువ, పెదనందిపల్లి, చిననందిపల్లి, దేవరాపల్లి గ్రామాల్లో సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. పొలాల్లో చేరిన నీటిని గట్లు తెగ్గొట్టి భయటకు పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో 19 గ్రామాల్లో సుమారు 270 ఎకరాల్లో నీరు నిల్వ ఉండటాన్ని గుర్తించామన్నారు. తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు రైవాడ జలాశయంతో పాటు లోతట్టు పంట పొలాలు, శారదానదీ పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. ముషిడిపల్లిలో నాగారాయుడు చెరువు, తామరబ్బ వంతెన వద్ద శారదానది ఉధృతిని పర్యవేక్షించారు. అప్రమత్తంగా ఉండాలని రైతులకు, స్థానిక ప్రజలకు సలహాలు, సూచనలు చేశారు. -
ప్రమాద స్థాయిలో కోనాం జలాశయం నీటిమట్టం
జలాశయం గేట్లు ద్వారా విడుదలవుతున్న నీరు చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడున్నర మీటర్లు పెరిగి ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో సోమవారం ఉదయం ప్రధాన గేట్లు ద్వారా 1200 క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేసినట్టు ఏఈ దొర తెలిపారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు రావడంతో నీటిమట్టం ఒక్కసారిగా మూడున్నర మీటర్లు పెరిగి 99.80 మీటర్లకు చేరుకుంది. అధికారులు అప్రమత్తమై వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు అదే విధంగా పంపించారు. సోమవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లోను బట్టి 850 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 99.80 మీటర్లు కాగా.. ప్రమాద స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు. -
జోరువానలో క్వారీ బాధితుల నిరసన
వర్షంలో గొడుగులతో నిరసన తెలుపుతున్న క్వారీ బాధితులు నర్సీపట్నం : మాకవరపాలెం మండలం, జి.కోడూరు క్వారీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద జోరువానలో గొడుగులు వేసుకుని బాధితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్టా నాగరాజు మాట్లాడుతూ క్వారీ లీజురద్దు చేయాలని బాధితులు 27 రోజులుగా ఆర్డీవో కార్యాలయం నిరాహారదీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. తక్షణమే క్వారీ రద్దు చేసి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. -
పీజీఆర్ఎస్పై వర్షం ప్రభావం.. తగ్గిన అర్జీలు
తుమ్మపాల: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై పడింది. అర్జీదారులు అంతంత మాత్రంగా వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పలు ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాలను వర్షం కారణంగా నిలిపివేశారు. ●పీజీఆర్ఎస్లో పరిష్కరించిన వినతులను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని, పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలు అర్జీదారుడికి వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అర్జీలు జిల్లా అధికారి లాగిన్‌లో ఉంటే జిల్లా అధికారి, మండల అధికారి లాగిన్‌లో ఉంటే మండల అధికారి నేరుగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి పరిష్కరించాలన్నారు. మొత్తం 94 అర్జీలు నమోదు కాగా.. 52 రెవెన్యూ అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ, పీజీఆర్ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, రమామణి, డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు, డీఆర్డీఏ, హౌసింగ్, డ్వామా, మెప్మా పీడీలు శచిదేవి, శ్రీనివాస్, పూర్ణిమ దేవి, కె.సరోజినీ, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.హైమావతి, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి నాయకులపై ఫిర్యాదు పంచాయతీ ఆస్తులకు రక్షించడంలో నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలతో పాటు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కూటమి నాయకులపై కేసు నమోదు చేయాలంటూ అనకాపల్లి మండలం బట్లపూడి పంచాయతీ రాయుడుపేట గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో చేపట్టిన మోదకొండమ్మ సామాజిక భవనం మెట్లను ఈ నెల 10న కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడంపై చేసిన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణానికి సహకరిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని మళ్లీ అర్జీ అందజేశారు. సాగు హక్కుల కోసం దళితుల వినతి జీడి, మామిడి పంటలు సాగు చేసుకుంటున్న భూములను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించి సాగు హక్కులు కల్పించాలంటూ అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్‌ను వేడుకున్నారు. రాళ్లురప్పలతో ఉన్న కొండ పోరంబోకును 40 ఏళ్ల కిత్రం ప్రభుత్వం ఇచ్చిందని, కొండను చదును చేసుకుని జీడి సాగు ద్వారా ప్రతి ఏటా వచ్చిన ఫలసాయంతో జీవిస్తున్నామని, ఇప్పుడు భూములు లాక్కుంటే తమ బతుకులు రోడ్డుపాలవుతాయని వాపోయారు. సర్వే నం.60లో తమకిచ్చిన భూములు మినహా 260 ఎకరాల భూమి ఉందని, ప్రభుత్వ అవసరాలకు సదరు భూమిని వినియోగించుకుని తమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. -
గొలుసు కట్టు చెరువులు కాపాడుకోవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్ తుమ్మపాల : గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గొలుసు కట్టు చెరువులు దెబ్బతింటే నీరు వృథా అవుతుందని, వీటి నిర్మాణాలు పటిష్టంగా, సక్రమంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి సోమవారం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ, తాగునీటి సమస్యలు, జల్‌జీవన్‌మిషన్ పనులు, క్యాటిల్ షెడ్లు, షేడ్ నెట్లు, సోక్ పిట్స్, గొలుసుకట్టు చెరువులు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య డ్రైవ్‌ను నిర్వహించాలన్నారు. బావులు, కుళాయిలు, బోర్ల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికి చెత్త సేకరణ సజావుగా జరగాలన్నారు. గ్రామాల్లో ఆస్తి పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి పంచాయతీలోనూ 20 సోక్ పిట్స్‌ను నిర్మించాలని, తద్వారా నీటి నిల్వలు వృద్ధి చెందుతాయన్నారు. షెడ్ నెట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, క్రాప్ మిత్రలకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శచీదేవి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్ , డిప్యూటీ సీఈవ, జిఎస్డబ్ల్యూఎస్ అధికారి మంజులవాణి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి పాల్గొన్నారు. -
బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్‌తో ఆటో దగ్ధం
దేవరాపల్లి: దేవరాపల్లిలో బ్యాటరీ ఆటో దగ్ధమైన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అల్లు వెంకటరావు ఆదివారం రాత్రి ఇంటి ముందు తన ఆటోను పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం అకస్మాత్తుగా ఆటోలో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంకటరావుకు సమాచారం ఇచ్చారు. బాధితుడు వచ్చి చూసేసరికి ఆటో పూర్తిగా మంటల్లో చిక్కుకుని ఉంది. మంటలు అదుపు చేస్తూనే చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేసరికే ఆటో పూర్తిగా కాలిపోయింది. ఆటోలోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే మంటలు రేగినట్టు భావిస్తున్నారు. సుమారు రూ.1.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని, జీవనాధారం కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. -
వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు
నాతవరం : మండలంలో గన్నవరం గ్రామానికి చెందిన రామోజు లోవరాజు అనే బుజ్జమ్మ కన్పించలేదని అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు నాతవరం ఎస్ఐ సిహెచ్.భీమరాజు తెలిపారు. వివరాలివి. గ్రామంలో టెంట్‌హౌస్ షాపు నిర్వహిస్తున్న రామోజు వెంకట బాబ్జి అనే వ్యక్తి తన భార్య బుజ్జమ్మ (40) ఉదయం నుంచి కనిపించడం లేదని సోమవారం సాయంత్రం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద ఎటువంటి తగాదాలు పడలేదని, ఏ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందో తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు నాతవరం పోలీస్‌స్టేషన్ లేదా ఫోన్ నంబర్ 9491516935కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
నక్కపల్లి ఆస్పత్రిలో ఆధునిక వైద్య పరికరాలు
నక్కపల్లి: స్థానిక 50 పడకల ఆస్పత్రిలో ప్రభుత్వ నిధులతో పాటు హెటెరో, డక్కన్ కెంపెనీల సహకారంతో సుమారు రూ.60 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పలు వైద్య పరికరాలు, అభివృద్ధి పనులను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం రూ.17.50 లక్షలతో ఎక్స్‌రే ప్లాంటు, రూ.18.50 లక్షలతో సీఆర్ఎం మెషీన్ సమకూర్చింది. హెటెరో కంపెనీ యాజమాన్యం రూ.12.20 లక్షలతో ఆధునిక వసతులతో కూడిన ఎక్స్‌రే గది, ఎల్ఈడీ డోరు నిర్మించింది. మరో రూ.7లక్షలు వెచ్చించి పెయింటింగ్స్ వేయించారు. డక్కన్ కెమికల్స్ కంపెనీ యాజమాన్యం రూ.12 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. వీటిని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని వార్డులను ఆమె సందర్శించి, రోగులను పరామర్శించారు. రోగుల అవసరాలకు తగ్గట్టుగా నక్కపల్లి 50 పడకల ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచుతామన్నారు. అత్యవసర వైద్యం కోసం ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు హెటెరో, డక్కన్ కంపెనీ యాజమాన్యాలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. హెటెరో కంపెనీ ప్రతినిధులు కుళ్లాయిరెడ్డి, రాజారెడ్డి, ఎంవీఎస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీప్రకాష్ వార్షికోత్సవాలు
గాతా రహే మేరా దిల్లో అలరించిన విద్యార్థులు పాయకరావుపేట : శ్రీప్రకాష్ విద్యా సంస్థల 49వ వ్యవస్థాపక దినం సందర్భంగా సోమవారం అట్టహాసంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేలా గాతా రహే మేరా దిల్ కార్యక్రమం నిర్వహించగా, విద్యార్థులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. వేడుకలకు తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ముగింపు కార్యక్రమానికి సినీ నేపఽథ్య గాయని కౌసల్య హాజరవుతున్నారని తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన ప్రముఖ కీబోర్డ్, హార్మోనియం, వాయిద్యకారులు దుర్గాప్రసాద్ రాతో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ గాయకురాలు ఆర్.సునీత వ్యవహరించారు. ఈ కార్యక్రఓమంలో సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, భానుమూర్తి, డాక్టర్ బంగ్రారాజు, డా. రామకృష్ణారెడ్డి, సీతారాణి, మేనేజరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం
ప్రమాద స్థలిలో మరణించిన సంతోష్ ,ఉష పీఎం పాలెం: బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్ ఎదురుగా హైవేపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. నగర పరిధిలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వాసుపల్లి సతీష్(19) భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు చేపలుప్పాడలో ఉంటున్న తాతగారి ఇంటికి వెళుతుంటాడు. పలాసకు చెందిన ఉష(18)తో యువకుడికి పరిచయం ఉంది. తనను కలుసుకోవడానికి వచ్చిన ఆమెతో బైక్‌పై పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తాతగారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వీరిద్దరూ బైక్‌పై పరదేశిపాలెం మీదుగా బయల్దేరారు. చంద్రంపాలెం హైస్కూల్ ఎదురుగా హైవేపైకి వచ్చేసరికి ముందు వెళ్తున్న బస్సు, లారీలను తప్పించబోయి లారీకి బైక్ తగలడంతో కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలై సంఘటనా స్థలిలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రాము తెలిపారు. -
వరద గుప్పెట్లో...
ప్రమాదస్థాయికి రిజర్వాయర్లు బుచ్చెయ్యపేట : వడ్డాదిలో పూర్తిగా మునిగిపోయిన డైవర్షన్ రోడ్డు రోలుగుంట : బండారువీధిలో ఇళ్లలోకి వర్షపు నీరుసాక్షి, అనకాపల్లి : విశాఖపట్నం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. జిల్లాపై విరుచుకుపడుతోంది. మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం రాత్రికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఈదురు గాలులతో వర్షం కొనసాగే అవకాశాలున్నాయని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. జిల్లా యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడమేనన్నది స్పష్టమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేయలేదు. దీని ఫలితంగా.. జిల్లాలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోడ్లపైకి వరదనీరు... మాడుగుల మండలం శంకరం పంచాయతీలో 7 గిరిజన గ్రామాలు జల దిగ్బంధంలో నిలిచిపోయాయి. నిత్యవసర సరుకులు కూడా తెచ్చుకోలేని విధంగా ఆ గిరిజన గ్రామాల చుట్టూ ఉరకగెడ్డ చుట్టముట్టింది. భీమునిపట్నం–వడ్డాది–నర్సీపట్నం(బీఎన్ ) ప్రధాన రోడ్డులో వడ్దాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు నీటి ఉధృతికి కోతకు గురై పూర్తిగా నీటిలో మునిగిపోయి దెబ్బతింది. వడ్డాది పెద్దేరు నదిపై శిథిల వంతెనను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. వీటి కారణంగా విశాఖ నుంచి వడ్డాది మీదుగా పాడేరు వెళ్లే బస్సులు, వడ్డాది నుంచి చోడవరం మీదుగా అనకాపల్లి వెళ్లే బస్సులు, నర్సీపట్నం వెళ్లే బస్సులతో పాటు ఇతర వాహన రాకపోకలు స్తంభించాయి. వాహనచోదకులు పలు ఇక్కట్లుకు గురయ్యారు. నీట మునిగిన పంటపొలాలు.. నాతవరం మండలంలో 14 పంచాయతీలు పరిధిలో ప్రవహిస్తున్న ఏలేరు కాలువ వర్షపు నీటితో పొంగిప్రవహించడంతో కాలువకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఖరీఫ్‌కు సిద్ధమైన వరి మడులతో పాటు తర పంటలు నీట మునిగాయి. జలాశయాలు పెద్దేరు, తాందవ, కళ్యాణపులోవ, కోనాం, రైవాడ ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరుతో ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీరుతో తాండవ, వరాహనది, తాచేరు, పెద్దేరు, శారదనది, పాలగెడ్డ, చింతగెడ్డ, నీటి ప్రవహం వల్ల పంట పోలాలు మీద నీరు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లా రహదారులు...రాకపోకలకు అగచాట్లు మాడుగుల మండలంలో కె.జె.పురం నుంచి ప్రధాన కూడలికి వెళ్లే రహదారి మీద నుంచి వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుంది. కె.జె.పురం గ్రామం మీదుగా నడుస్తున్న ఆర్టీసీ బస్సు సర్వీసులు వర్షాలకు విజయరామరాజుపేట వద్ద బొడ్డేరు నది మీద కాజ్వే కొట్టుకోని పోవడంతో పాడేరు, మాడుగుల నుంచి విశాఖ, అనకాపల్లి, వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు కె.జె.పురం మీదుగా నడుపుతున్నారు. విశాఖ డిపోకు చెందిన విశాఖ–పాడేరు, అనకాపల్లి నుంచి పాడేరు ఏక్సప్రెస్ బస్సులును కె.జె.పురం గ్రామం మీదుగా నడుపుతున్నారు. మెట్రో ఏక్సప్రెస్లు ఈ రహదారిలో నిలుపుదల చేశారు. కాగా పల్లె వెలుగు బస్సులు పూర్తి స్థాయిలో నడపకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకు గురైన పేట డైవర్షన్ రోడ్డు బుచ్చియ్యపేట మండలంలో భీమునిపట్నం–వడ్డాది–నర్సీపట్నం(బిఎన్) ప్రధాన రోడ్డులో వడ్దాది వద్ద పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు నీటి ఉధృతికి కోతకు గురై పూర్తిగా నీటిలో మునిగిపోయి దెబ్బతింది. వడ్డాది పెద్దేరు నదిపై శిథిల వంతెనను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీని కారణంగా విశాఖ నుంచి వడ్డాది మీదుగా పాడేరు వెళ్లే బస్సులు, వడ్డాది నుంచి చోడవరం మీదుగా అనకాపల్లి వెళ్లే బస్సులు, నర్సీపట్నం వెళ్లే బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముంచెత్తిన పెద్దేరు మాడుగుల మండలంలో పెద్దేరునది సత్యవరం వద్ద కోతకు గురైంది. ఇప్పటికే పొలం పెద్దేరులో కలసి పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పెద్దేరు పొంగినపుడల్లా తమ పొలం పెద్దేరులో కలిసి పోతుంటూ వాపోతున్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని బాదిత రైతులు కోరుతున్నారు. జిల్లాలో వర్షపాతం ఇలా.. గడిచిన రెండు రోజుల్లో అనకాపల్లి జిల్లాలోని సగటు 113.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కె.కోటపాడు 180.7 మి.మీ, దేవరాపల్లి 173, మాడుగుల 166.5మిమీ, చీడికాడ 157.5 మిమీ, చోడవరం 149 మి.మీ, రావికమతం 142.8మి.మీ, సబ్బవరం 136.9 మిమీ,రోలుగుంట 131.2, అనకాపల్లి 129.0 మి.మీ, బుచ్చియ్యపేట 127.0మి.మీ, పరవాడ 115.8మి.మీ,నర్సీపట్నం 109.1 మి.మీ, యలమంచిలి 105.7 మి.మీ, అచ్యుతాపురం 101.2 మి.మీ, , మాకవరపాలెం 90.1 మి.మీ, మునగపాక 103.2 మి.మీ, పాయకరావుపేట 76.8 మి.మీ, కశింకోట 100.1 మి.మీ, గొలుగొండ 94.8 మిమీ, కోటవురట్ల 76.7 మిమీ, నాతవరం 70.7 మిమీ, రాంబిల్లి 66.9 మి.మీ, ఎస్.రాయవరం 67.1 మి.మీ, నక్కపల్లి 64.5 మి.మీ వర్షపాతం నమోదైంది. బుచ్చెయ్యపేట : లూలూరులో నీట మునిగిన వరి పొలాలుమాడుగుల : సత్యవరం వద్ద పొంగి ప్రవహిస్తున్న పెద్దేరు జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు నీట మునిగిన పంట పొలాలు రోడ్లపై వరద ప్రవాహం..వాహన చోదకుల ఇక్కట్లు ప్రమాదస్థాయికి చేరుకున్న రిజర్వాయర్లు పొగిపొర్లుతున్న తాండవ, తాచేరు, పాలగెడ్డ, శారదానదులు మొద్దునిద్ర వీడని యంత్రాంగం ముందస్తు సహాయక చర్యలపై తీవ్ర నిర్లక్ష్యం వరాహనది ఉగ్రరూపం కోటవురట్ల: నాలుగు రోజులుగా ఎగువ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వరాహనది వరదనీటితో పోటెత్తింది. పాతరోడ్డు సమీపంలోని వరాహనదిలోకి సర్పానది కూడా కలియడంతో పందూరు వద్ద వరదనీటి ఉదృతి ఎక్కువగా ఉంది. దాంతో పందూరుకు రామచంద్రపురం జంక్షన్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డురోడ్డు వెళ్లేందుకు చుట్టూ 6 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కాగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున నదిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాండవ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 375.2 అడుగులు ఉంది. వర్షాలు కురుస్తున్నందున ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో నీరు తాండవ ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. తాండవ ప్రాజక్టు నుంచి ప్రధాన గేట్లు ద్వారా పంట కాలువలోకి రోజుకు 310 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పెద్దేరు జలాశయంలో ప్రమాదస్థాయికి నీటిమట్టం చేరుకుంది. గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా..136.8 మీటర్లకు నీటిమట్టం చేరింది. దీంతో 770 క్యూసెక్కులు నీరు విడుదల చేశారు. చీడికాడ మండలంలో కోనాం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 101.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 99.80 మీటర్లకు చేరింది. వర్షాల కారణంగా 800 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలేశారు. కళ్యాణపులోవ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 460 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 451.2 అడుగులు ఉంది. రైవాడ జలాశయాంలో గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా..ప్రస్తుతం 112.90 మీటర్లు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతుంది. సోమవారం రాత్రికి ప్రమాదస్థాయికి( 113.50 మీటర్లు)కు చేరుకుంటే నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. -
నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూ క్యాంపస్: వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంధ్య మైరెన్స్ సహకారంతో వైజాగ్ మారథాన్ నాల్గవ ఎడిషన్ నవంబర్ 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం బీచ్‌రోడ్డులోని ఒక హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 32 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్నవారు వైజాగ్ మారథాన్ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం ఈ మారథాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీలో పాల్గొనే వారందరికీ టీషర్ట్, మెడల్, ఎనర్జీ డ్రింక్, అల్పాహారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంధ్యా మైరెన్స్ డైరెక్టర్ కె. ఆనంద్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిశోర్, అపోలో హాస్పిటల్స్ సీవోవో శ్రీరామచంద్ర, దుద్దుపూడి శ్రీనివాస్, లక్ష్మీ శ్రీధర్ పాల్గొన్నారు. -
తాండవకు వరదతాకిడిపై అప్రమత్తం
నాతవరం : తాండవ రిజర్వాయరులో నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం ఆర్డీవో విల్లూరి వెంకట రమణ అన్నారు. ఆయన సోమవారం తాండవ రిజర్వాయరును సందర్శించారు. ప్రాజెక్టులో సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 375.2 అడుగులు ఉందని డీఈ అనురాధ తెలిపారు. రిజర్వాయరు ప్రమాదస్ధాయి నీటి మట్టం 380 అడుగులు కాగా 378 అడుగులకు నీరు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేసి స్పిల్‌వే గేట్లు ద్వారా నదిలోకి నీరు విడుదల చేస్తామన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో నీరు తాండవ ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుందన్నారు. -
ఇకపై అర్ధరాత్రి వరకు బార్లు బార్లా...
● 1వ తేదీ నుంచి నూతన బార్ విధానం ● జిల్లాకు 10 బార్ల కేటాయింపు ● నోటిఫికేషన్ విడుదల ● 18 నుంచి 26 వరకు దరఖాస్తుల స్వీకరణ ● 28న కలెక్టరేట్లో డ్రా ద్వారా కేటాయింపు అనకాపల్లి టౌన్ : కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీ ప్రకారం జిల్లాకు 10 బార్లు కేటాయించినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి వి.సుఽధీర్ తెలిపారు. సోమవారం కొండ కొప్పాకలో ఉన్న స్థానిక జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుతో ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్స్‌లు పూర్తవుతున్నాయని తెలిపారు. దీంతో జిల్లాలో కొత్తగా కేటాయించిన 10 కొత్త బార్లలో జీవీఎంసీ పరిధిలో 7 బార్లు, జిల్లాలో 3 బార్లు ఉన్నాయి. వీటిలో నర్సీపట్నంలో 2, యలమంచిలిలో 1 బారు కేటాయించినట్లు చెప్పారు. కొత్త బార్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. జనరల్ కేటగిరీలో బార్లకు ఈ నెల 18 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను కొండ కొప్పాక ఎకై ్సజ్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు. 28వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో డ్రా ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. దరఖాస్తుతో పాటు ధరావతు సొమ్ముగా నాన్ రిఫండబుల్ రూ.5 లక్షలు, అప్లికేషన్ ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలి, లేని పక్షంలో ఆ బార్‌కు డ్రా తీయడం జరగదని తెలిపారుు. సుప్రీంకోర్టు మర్గదర్శకాలకు అనుగుణంగా స్కూళ్లు, దేవాలయాలకు దూరంగా బార్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బార్ లైసెన్సు కోసం 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, రూ.5 లక్ష లు దాటితే రూ.75 లక్షలు చెల్లించాలి. లైసెన్సు ఫీజు ను 6 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. అయితే ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బార్ నిర్వహణ సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. -
సామాన్యుడి ‘టోల్’ తీస్తున్నారు..
నర్సీపట్నం : కారుల్లో తిరిగే వారికి ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం..సామాన్య ప్రజలను విస్మరించింది. జాతీయ రహదారుల మీద ప్రయాణించే వారిలో ధనికులు, మధ్య తరగతి వర్గాలకు ఒక రకంగా, సాధారణ ప్రజలకు మరో రకంగా చూసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కారుల్లో ప్రయాణించే వారికి కొంతైనా భారం తగ్గించిన, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఆర్టీసీ ప్రయాణికుల గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం ఒక పక్క ప్రయాణం కోసం కారుకు రూ.150 వరకు టోల్ రుసుం చెల్లిస్తున్నారు. 2000 సంవత్సరం తరువాత రాష్ట్రంలో జాతీయ రహదారులు విస్తరణ పెరిగింది. ఈ రహదారులపై ప్రయాణించే ప్రతి వాహనదారుడి నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఏటేటా ఈ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. మొదటిలో రవాణా వాహనాలు, ధనికులు ప్రయాణించే కార్లు మీద మాత్రమే వేసిన టోల్ ఛార్జీల భారం తరువాత ఆర్టీసీ బస్సులపైనా పడింది. ఈ బస్సులపై పడిన భారం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులపై వడ్డించడం మొదలు పెట్టింది. టోల్ గేటు ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో 5 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలంటే రూ.10 టిక్కెట్ ఛార్జీకు అదనంగా మరో రూ.10 టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో సుమారుగా లక్ష మంది ప్రయాణం చేస్తున్నారు. వేంపాడు టోల్ గేటు మీదగా ప్రయాణించే ప్రయాణికులే రోజుకు దాదాపు రూ.30 వేలు టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. జిల్లాలో నక్కపల్లి మండలం, వేంపాడు, సబ్బవరం మండలం మర్రిపాలెంలో టోల్గేట్లు ఉన్నాయి. నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగొల్లు జంక్షన్లో బస్సు ఎక్కిన ప్రయాణికుడు రెండు కిలోమీటర్ల దూరంలో టోల్‌గేటు అవతల ఉన్న కాగిత గ్రామం ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే రూ.10 టోల్ ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. కార్లపై తగ్గిన భారం... ఆగస్టు 15 నుంచి కారుల్లో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కొంత భారం తగ్గించింది. కార్లు సొంతంగా వినియోగించుకునే వారు రూ.3 వేలు చెల్లిస్తే 200 సార్లు టోల్ గేటు మీదుగా రాకపోకలు సాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కార్డు ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. కార్లను మధ్య, ఎగువ తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. వారిపై పడుతున్న భారం గురించి ఆలోచన చేసిన కేంద్ర ప్రభుత్వం నిత్యం పల్లె వెలుగు, సిటీబస్సుల్లో తిరిగే రోజు కూలీలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు గురించి ఆలోచించలేదు. టోల్‌గేటు ఉన్న జిల్లా వాహనదారులకు, పరిసర గ్రామాల వాహనదారులకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కొంత రాయితీలు ఇస్తుంది. అదే జిల్లాలో ప్రయాణించే సామాన్య ప్రజలు వినియోగించే పల్లె వెలుగు బస్సుల నుంచి ఎటువంటి మినహాయింపు లేకుండా టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ టోల్ భారం తగ్గించి ఊరట కల్పించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. నక్కపల్లి టోల్ గేట్, (ఇన్సెట్) పల్లె వెలుగు బస్సులో ప్రయాణికులు -
దుర్గంధభరితంగా ఎన్టీఆర్ ఆస్పత్రి
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిని కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో వివిధ విభాగాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డులు, ఆస్పత్రిలో పలు విభాగాల్లో చెత్తాచెదారం పేరుకుని, అపరిశుభ్రంగా ఉండడంతో మండిపడ్డారు. రెండో అంతస్తులో వరండాలో వర్షపునీరు ఎక్కువగా ఉందని, తక్షణమే తొలగించాలని, రోగులు వర్షపు నీటిలో జారిపడే అవకాశాలు ఉన్నాయని ఆదేశించారు. ఆస్పత్రి అవరణలో బైక్‌లు అడ్డదిడ్డంగా పార్కు చేశారని, ఆస్పత్రి పరిసరాలు దుర్గంధంతో నిండి ఉన్నాయని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ఆస్పత్రిలో కొన్ని విభాగాల్లో చీకటిగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంటే లైట్లు ఎందుకు వేయడం లేదని, మరోసారి ఇలా కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డి–అడిక్షన్(మాదక ద్రవ్యాల విభాగం) సెంటర్లో వైద్యులు ఎవరో, అటెండర్ ఎవరో, రోగి, సిబ్బంది ఎవరో అర్థం కాకుండా ఉందని, రోగుల బెడ్ వద్ద గుంపులు గుంపులుగా జనం ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన టీ క్యాంటీన్ వద్ద కూడా అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య, సెక్యూరిటీ కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఆస్పత్రి ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ పరిశీలించారు. ఆస్పత్రి ఎదురుగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు పాల్గొన్నారు. -
నీటమునిగిన పంటలు పరిశీలించిన అధికారులు
కె.కోటపాడు : భారీ వర్షాలకు ముంపునీటిలో ఉన్న పంటలను ప్రాథమికంగా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు ఆదేశించారు. మండలంలో సోమవారం ఉదయం వర్షం కురుస్తున్నా మండల వ్యవసాయధికారి సోమశేఖర్‌తో కలిసి మేడిచర్ల, ఎ.భీమవరం, కె.కోటపాడు గ్రామాల్లో నీట మునిగిన వరి పంటను గుర్తించారు. వర్షం తగ్గాక నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తరువాత నేనో యూరియాను ఎకరానికి 500 ఎంఎల్ పిచికారి చేయాలని, పంటకు కుళ్లు తెగులు ఆశిస్తే హెక్సా కోనజోల్ ఎకరానికి 400 ఎంఎల్ పిచికారి చేయాలని సూచించారు. -
నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. పార్టీ రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ జాన్బ్రిట్టాస్తో కలసి పోలవరం ముంపు మండలాల పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం చింతూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పునరావాసానికి రూ.33 వేల కోట్ల నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు లేక నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తమ పర్యటనల్లో గుర్తించిన సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గిరిజనులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఎక్కడచూసినా నాసిరకం నిర్మాణాలు కనిపిస్తున్నాయన్నారు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి వంటి అవసరాలు లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారని జాన్‌బ్రిట్టాస్ అన్నారు. వీఆర్‌పురం: రూ.వేలకోట్లతో రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులగోడు పట్టించుకోవడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, రాజ్యసభ సభ్యులు ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. రామవరంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల కాలనీ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు కాకముందే శ్లాబ్‌లు కారిపోతున్నందున బరకాలు వేసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కేటాయించిన రైతులకు ఎకరాకు రూ.25 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బొంప్పెన కిరణ్ ఎం వాణిశ్రీ, రాష్ట్ర నాయకులు తులసీదాసు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఎటపాక: పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ల్యక్షం చేస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం విమర్శించారు. మండలంలోని నర్సింగపేట పోలవరం నిర్వాసిత కాలనీలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడంతో నిర్వాసితుల సమస్యలు కూడా జాతీయ సమస్యగా గుర్తించాలని సూచించారు. కాంటూరు లెక్కలు కాకి లెక్కలని, నిర్వాసితులందరికీ న్యాయం చేసిన తరువాతనే ప్రాజెక్టు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలనీల్లో నిర్వాసితులు బతుకులు దుర్భరంగా మారాయని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే సరైన మార్గమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిల్లో సురేంద్ర, బొప్పెన కిరణ్, మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు, మట్ల శ్రీవాణి, ఐవీ, మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ -
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పోరాటం
సబ్బవరం: అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించకపోతే పోరాటానికి సిద్ధమని సిటు రాష్ట్ర కార్యదర్శి చంద్రావతి హెచ్చరించారు. స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సిటు) 10వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లు గ్రామాల్లో మాతా శిశు మరణాలను తగ్గించి పిల్లలకు కౌమార విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మె చేయగా, వేతనాల పెంపు, గ్రాట్యుటీ చట్టాల అమలు హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు సమ్మె శిబిరాలకు వచ్చి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కనీసం పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. అంగన్వాడీల కనీస విధులతోపాటు, అదనపు బాధ్యతలు, యాప్‌ల పేరిట వేధించడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అంగన్వాడీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిటు రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా కోశాధికారి వీవీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక ఈ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలిగా జి.కుమారి, అధ్యక్షురాలిగా ఎం.దుర్గారాణి, ప్రధాన కార్యదర్శిగా నాగశేషు, కోశాధికారిగా వీవీ రమణమ్మ ఎన్నికయ్యారు. పాలకవర్గ సభ్యులుగా ఎన్.వరలక్ష్మి, కె.రామలక్ష్మి, పి.భవాని, ఆర్.మహాలక్ష్మి, తనూజ, ఎం.రమణి, చిన్నమ్మలు, సత్యవేణి, మంగ, టి.సంతోషి, అంజలి, సీహెచ్ రామలక్ష్మితో పాటు మరో 11 మంది సభ్యులను ఎన్నుకున్నారు. -
ఎఫ్డీపీ నిర్వహణకు ఏర్పాట్లు
మురళీనగర్ (విశాఖ): జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎఫ్.డి.పి) ను విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం నుంచి నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికై న 300 కళాశాలల్లో విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉందని కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ తెలిపారు. ‘న్యూమరికల్ అప్రోచ్ ఇన్ డిజైన్ థింకింగ్’ అనే అంశంపై ఈ కార్యక్రమం ఈనెల 18 నుంచి 23 వరకు జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి దాదాపు 50 మంది అధ్యాపకులు, పరిశోధకులు ఈ ఆఫ్‌లైన్ శిక్షణలో పాల్గొంటారు. కార్యక్రమంలో డిజైన్ థింకింగ్‌లో సంఖ్యా విధానాలు, అడ్వాన్స్డ్ పద్ధతులు, ౖఫైనెట్ ఎలిమెంట్స్ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు. -
పోలీస్ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన
నక్కపల్లి: పోలీస్ శాఖ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. మండల కేంద్రం నక్కపల్లిలో హెటెర్ కంపెనీ యాజమాన్యం సమకూర్చిన రూ.2.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆధునిక వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరిష్ కుమార్ గుప్తా ముఖ్యఅతిథులుగా హజరయ్యారు. హోం మంత్రి శంకుస్థాపన చేయగా శిలాఫలకాన్ని డీజీపీ, హోంమంత్రులు ఆవిష్కరించారు. శిలాఫలకంపై గ్రామ ప్రధమ పౌరురాలు, స్థానిక సర్పంచ్ జయరత్నకుమారి, మండల ప్రథమ పౌరురాలు, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ పేర్లు వేయలేదు. శిలాఫలకంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్ససత్యనారాయణ, ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎంఎల్సీ వేపాడ చిరంజీవి, జెడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర పేర్లు వేశారు. భవనం నిర్మిస్తున్న స్థానిక సర్పంచ్ , మండల పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా ప్రాదేశిక సభ్యురాలు పేర్లు వేయకపోవడం గమనార్హం. దళిత మహిళలం కావడంతోనే మాపై చిన్నచూపు చూసి శిలాఫలకంలో తమ పేర్లు వేయలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రధానమంత్రి పాల్గొనే అధికారిక కార్యక్రమంలో సైతం స్థానిక సర్పంచ్‌కు ప్రొటోకాల్ పాటిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నక్కపల్లిలో జరిగిన సీఎం చంద్రబాబు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో అప్పటి మహిళా సర్పంచ్‌ను స్టేజీపైకి ఆహ్వానించారని వారు గుర్తు చేస్తున్నారు. శిలాఫలకంలో ప్రొటోకాల్ పాటించకపోవడం, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు వేయకపోవడంపై సీఐ కుమార స్వామి వద్ద ప్రస్తావించగా కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకున్న ప్రొటోకాల్ జాబితా ప్రకారమే శిలాఫలకాన్ని తయారు చేయడం జరిగిందన్నారు. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఇటువంటి కార్యక్రమాల్లో స్థానిక సర్పంచ్ల పేర్లు వేయలేదన్నారు. -
జల జీవనం
బుచ్చెయ్యపేట: తాచేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరుచోడవరం: మండలంలో నీట మునిగిన వరి పొలంతుమ్మపాల/అనకాపల్లి టౌన్: భారీ వర్షాలతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం తెల్లవారు నుంచి తెరపివ్వకుండా వాన కురిసింది. వాగులు, వంకలు, పలు చోట్ల రోడ్ల మీదుగా వర్షపునీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి పంటలు నీట మునుగుతున్నాయి. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావంతో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయినా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా యంత్రాంగం ఆదేశించడంతో సచివాలయ, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో స్థితిగతులపై దృష్టి సారించారు. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. నీట మునిగిన చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి చోడవరం: వరద ముంపు ఆదిదేవుడైన వినాయకుడికి కూడా తప్పలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం వరద ముంపులో ఆదివారం చిక్కుకుంది. స్వామివారి ప్రధానాలయం ఏనుగుబోదు చెరువు గర్భంలో ఉండటంతో తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. దీంతో స్వామివారి గర్భాలయంలో చెరువు ఊటనీరు బయటకు రావడంతో ఆలయంలో స్వామివారి మూలవిరాట్్ విగ్రహం మునిగిపోయింది. గర్భాలయంలోకి ఊరుతున్న నీటిని బయటకు పంపించేందుకు మోటార్ల సాయంతో చర్యలు చేపట్టారు. తుపాను వర్షాలకు చోడవరం పరిసర ప్రాంతాల్లో పొలాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో చోడవరం– అనకాపల్లి ,చోడవరం–నర్సీపట్నం ప్రధాన రహదారిపై పెద్దపెద్ద గోతులు పడి వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. పట్టణంలో బాలాజీనగర్, న్యూశాంతినగర్, చీడికాడ రోడ్డు ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై ప్రవహించింది. పిడుగుపడి 28 గొర్రెలు మృతి ఉరుములు, మెరుపులతో ఆదివారం పిడుగు పడి దుడ్డుపాలెం గ్రామంలో 28 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కూర్మదాసు తాతారావుకు చెందిన 18 గొర్రెలు, కూర్మదాసు రమణకు చెందిన 5 గొర్రెలు, మొల్లి గోవిందకు చెందిన 5 గొర్రెలను గ్రామ సమీపంలో ఉన్న కొండపైకి శనివారం రాత్రి తీసుకెళ్లి ఉంచారు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా మొత్తం గొర్రెలన్నీ పిడుగుపాటుకు మృతి చెంది ఉన్నాయి. వీటి సుమారు రూ. 3 లక్షలు విలువ ఉంటుందని బాధిత పెంపకందారులు చెప్పారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 08924 222888 08924 225999 08924 226599 రోడ్లను ముంచెత్తిన వరద నీరుబుచ్చెయ్యపేట: మండలంలో ఆదివారం ఒక్క రోజులోనే 60 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించగా పలు గ్రామాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వరి, మినుము, పెసర, నువ్వులు, కూరగాయ పంటలు నీట మునిగాయి. వడ్డాది పెద్దేరు నది, విజయరామరాజుపేట తాచేరు నదిపైన ఉన్న డైవర్షన్ రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డాది, పేట డైవర్షన్ రోడ్ల వద్ద పోలీసులు ప్రమాదాలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాసరావు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులను పోలీసులు మూసివేయడంతో వాహనదారులు గౌరీపట్నం, బుచ్చెయ్యపేట, మంగళాపురం మీదుగా చోడవరం, అనకాపల్లి, విశాఖ, నర్సీపట్నం ప్రాంతాలకు ఇరుకు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (నంబర్: 08943 294391) ఏర్పాటు చేసినట్టు తహసీల్దార్ లక్ష్మి తెలిపారు. జిల్లాలో వర్షపాతం (రాత్రి 10 గంటల వరకు) సాక్షి, అనకాపల్లి: గడిచిన 24 గంటల్లో జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మండలం మి.మీ. చీడికాడ 150.6 కె.కోటపాడు 146.8 దేవరాపల్లి 144.2 మాడుగుల 141.6 చోడవరం 131.8 రోలుగుంట 125.0 రావికమతం 122.6 బుచ్చెయ్యపేట 114.8 అచ్యుతాపురం 100.8 యలమంచిలి 96.8 నర్సీపట్నం 92.4 మాకవరపాలెం 86.4 మునగపాక 77.8 పాయకరావుపేట 76.8 కశింకోట 75.6 అనకాపల్లి 73.2 గొలుగొండ 71.2 కోటవురట్ల 59.4 నాతవరం 56.8 రాంబిల్లి 55.4 నక్కపల్లి 53.8 ఎస్.రాయవరం 46 -
ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వారి వేధింపులకు భయపడి మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, దళిత మహిళా నేత మంచ నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు లైంగికంగా వేధిస్తున్నారని, పనులు కావాలంటే పక్కన పడుకోవాలని మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక దళిత మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించారని, అందరి ముందు అవమానించారని ఆమె అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే నజీర్ కారణంగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందని, ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులకు భయపడి ఒక మహిళ రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని ఆమె పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే రాజు తన పార్టీ నాయకుడు చెప్పిన వారికి సీటు ఇవ్వలేదనే కారణంతో ఒక మహిళా ఉద్యోగినిని అందరి ముందు బండ బూతులు తిట్టారని, దాంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయారని ఆమె తెలిపారు. ఇలా ప్రజా ప్రతినిధులే మహిళలను వేధిస్తుంటే, ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మరింతగా అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళిత మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నా దళిత హోంమంత్రి వంగలపూడి అనిత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఆ కామ పిశాచులను అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆరోపించారు. అనంతపురంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై 14 మంది టీడీపీ కార్యకర్తలు లైంగికదాడికిపాల్పడి హత్య చేస్తే, వారిపై చర్యలు లేవని, కనీసం హోంమంత్రి బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించలేదని ఆమె అన్నారు. ఇలాంటి చేతగాని హోంమంత్రిగా అనిత అనర్హురాలని, తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళితులంతా ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి ఆగ్రహం -
ఈపీడీసీఎల్‌లో బదిలీల బంతాట!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గతంలో జరిగిన జిల్లాల విభజనకు అనుగుణంగా ఈపీడీసీఎల్‌లో సర్కిళ్లను విభజించారు. అయితే ఇప్పుడు ఆయా సర్కిళ్లకు అనుగుణంగా ఉద్యోగులను బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఈ బదిలీల ప్రక్రియలో జూనియర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా బదిలీ అయిన సర్కిల్లోనే ఉద్యోగ విరమణ వరకు విధులు నిర్వర్తించాలన్న ప్రభుత్వ షరతుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు కొత్తగా జిల్లాల పునర్విభజన జరగవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడే బదిలీలు చేపట్టవద్దని ఉద్యోగులు కోరుతున్నారు. అయినా అధికారులు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. బదిలీ మార్గదర్శకాలపై అసంతృప్తి రెండేళ్ల కిందట జరిగిన సర్కిళ్ల పునర్విభజనకు అనుగుణంగా బదిలీలు చేసేందుకు ఈపీడీసీఎల్ అధికార యంత్రాంగం సిద్ధమైంది. గతంలో ఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరుతో కలిపి మొత్తం 5 సర్కిళ్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత సర్కిళ్ల సంఖ్య 11కి పెరిగింది. అవి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సర్కిళ్లు. అయితే సర్కిళ్లు విభజించినప్పటికీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జూనియర్లని బలిచేసేలా మార్గదర్శకాలు.! సర్కిళ్ల ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నట్లు ఇటీవలే మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కొత్తగా వచ్చిన సర్కిళ్లకు బదిలీపై వెళ్లాల్సి ఉంటుందని.. ఏ సర్కిల్‌కు వెళ్లాలో నిర్ణయించుకోవాలంటూ ఆప్షన్లు ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన ఆరు సర్కిళ్లలో బదిలీలుండనుండగా.. ఉద్యోగి నేస్తం పోర్టల్‌లో ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో జూనియర్లనే ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం విధించిన షరతు జూనియర్లలో మరింత ఆందోళన రేపుతోంది. ఈ ప్రక్రియలో సీనియర్లకు మాత్రమే ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చారు. దీంతో 90 శాతానికి పైగా సీనియర్లు బదిలీ నుంచి తప్పించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. కొద్దిమంది సీనియర్లు మాత్రమే అనారోగ్యం వంటి కారణాలతో సొంత జిల్లాకు బదిలీ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జూనియర్లకే ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బదిలీ అయిన ఉద్యోగి తన ఉద్యోగ విరమణ వరకు అదే సర్కిల్లో పనిచేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ షరతు వల్ల జూనియర్లు పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో.. జూనియర్ అసిస్టెంట్లు 470 సీనియర్ అసిస్టెంట్లు 626 టైపిస్ట్/యూడీస్టెనో/ఎల్డీ స్టెనో 66 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 107 పునర్విభజన జరిగితే మళ్లీ బదిలీలు చేస్తారా? వచ్చే వారం పది రోజుల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జూనియర్లకు ఇబ్బందులకు గురి చేయకుండా.. పాత పద్ధతిలోనే బదిలీలు చేపట్టాలని, బదిలీలలో పారదర్శకత పాటించాలని కోరుతున్నాయి. మరోసారి జిల్లాల పునర్విభజన జరిగితే కొత్త సర్కిళ్లు ఏర్పడతాయని, అప్పుడు మళ్లీ బదిలీలు చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
విజయవాడ కనకదుర్గమ్మకు పసుపు, కుంకుమ
అనకాపల్లి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ప్రతినిధులకు గవరపాలెం శతకంపట్టు కనకదుర్గ అమ్మవారి దేవస్ధానం నుంచి పసుపు, కుంకుమ అందజేశారు. విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శతకంపట్టు కనకదుర్గ అమ్మవారి దేవస్ధానం ప్రతినిధులు మాట్లాడుతూ శరన్నవరాత్రుల మహోత్సవం కోసం బెజవాడ కనకదుర్గమ్మకు ప్రతీ ఏడాది పసుపు, కుంకుమ అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు కాండ్రేగుల నాయుడు, పి.వి.రమణ, భీమరశెట్టి వర, గవరపాలెం గౌరీ పరమేశ్వరి, మరిడిమాంబ అమ్మవారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్నరేషన్ మాఫియా
కొనేది రూ.18... ఎగుమతి చేసేది రూ.40 ● ఈ నెల 8వ తేదీ రాత్రి యలమంచిలి మండలం ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద 130 బస్తాల్లో 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని యలమంచిలి డీటీ వినయ్‌కుమార్, వీఆర్వోలు పట్టుకున్నారు. ● గత నెల 10వ తేదీన యలమంచిలి మున్సిపాలిటీ తెరువుపల్లి న్యూ వెంకటేశ్వర రైసు మిల్లు నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యంతో పాటు వాహనాన్ని యలమంచిలి రూరల్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు పంపిణీ అవుతున్న బియ్యం ఇలా నిత్యం వాహనాల్లో అక్రమ రవాణా జరుగుతోంది. ప్రతి నెలా రేషన్ పంపిణీ చేసే మొదటి రెండు వారాల్లో చౌక బియ్యం రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. యలమంచిలి రూరల్: జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. కార్డుదారుల వద్ద వేలిముద్ర తీసుకోకముందే బియ్యాన్ని వాహనాల్లో తరలిస్తున్నారు. అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కూటమి పార్టీల నాయకుల అండదండలతోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ షాపులు, లబ్ధిదారుల వద్ద బియ్యం కొనుగోలు చేసి కాకినాడ పోర్టుకు, ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిపోతున్నా దీనిని అరికట్టడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడినా కేసులు పెట్టి మమ అనిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. 80 శాతం నల్లబజారుకే.. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని పలువురు అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 5,09,688 తెల్ల కార్డులు, 25,804 అంత్యోదయ కార్డులు ఉండగా 15,15,602 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున నెలకు సుమారు 7,578 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రేషన్ బియ్యానికి రూ.43 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. జిల్లాలో కార్డుదారులందరికీ ప్రతి నెలా బియ్యం సరఫరా చేయడానికి దాదాపు రూ.32.59 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అందులో 20 శాతం మాత్రమే సక్రమంగా వినియోగం అవుతోంది. సుమారు రూ.26 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పడుతోంది. ఏడాదికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టే 391 కోట్లలో 312 కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకే తరలిపోతోంది. రేషన్ బియ్యం ఎక్కువగా రైస్ మిల్లులకు చేరుతోంది. రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున చౌక బియ్యం నిల్వలు ఉంటున్నా మిల్లుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి అధికారులు తనిఖీలు చేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు ఏం చేస్తున్నట్టు? నిత్యం రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణా, రీసైక్లింగ్ జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. తమ కళ్ల ముందే అంతా జరుగుతున్నా వారికేమీ పట్టడం లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సమాచారం తెలిసినపుడు ఆ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. సెలవు రోజుల్లో అయితే పౌరసరఫరాల శాఖ అధికారుల తీరు మరీ దారుణం. –చాకలి నూకరాజు, ఆర్టీఐ యాక్టివిస్టు, యలమంచిలిజిల్లాలో యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు ఏరియాల్లో భారీగా చౌక బియ్యం కొనుగోలు చేసే రైసుమిల్లుల యజమానులు ఉన్నారు. దళారులు, డీలర్ల నుంచి కేజీ బియ్యం రూ. 16 నుంచి రూ.18లకు కొని కొనుగోలు చేసి తమ రైసు మిల్లుల్లో నిల్వ చేస్తున్నారు. ఆపై రైసు మిల్లుల యజమానులు, కొంతమంది ఎగుమతిదారులు కిలోకు రూ.30 వరకు సంపాదిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం కిలో రూ.40 వరకు ఉంటోంది. డీలర్లు, రైసు మిల్లుల యజమానులు, ఇతర అక్రమార్కులపై 6 ఏ కేసులు నమోదైనా కఠిన చర్యలు తీసుకోవట్లేదు. పౌరసరఫరాల శాఖ అధికారుల డొల్లతనంతో టన్నుల్లో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి, కాకినాడ పోర్టు, చేపల చెరువులు, కోళ్ల ఫారాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. రేషన్ బియ్యాన్ని నిల్వ చేసే రైసు మిల్లుల్లో బియ్యం నిల్వల తనిఖీలు, రికార్డులను తరచుగా తనిఖీ చేస్తే రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. -
రక్త ‘పరీక్ష’లే..!
మహారాణిపేట: ఉత్తరాంధ్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో ముఖ్యమైన రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీనివల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను నిర్ధారించే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు గత కొన్ని రోజులుగా జరగడం లేదు. ఈ పరీక్షలకు అవసరమైన ‘రీజెంట్స్ లిక్విడ్’ సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గతంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ నుంచి ఈ లిక్విడ్ సరఫరా అయ్యేది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. బయట నుంచి కొనుగోలు చేయడానికి కేజీహెచ్‌లోని కొంతమంది వైద్యాధికారులు ఇష్టపడకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులు ఏబీజీ పరీక్షలో రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డయాకై ్సడ్ శాతాలను విశ్లేషిస్తారు. కిడ్నీ వైఫల్యం, గుండె లోపాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నిర్ధారించడానికి ఈ పరీక్షలు అత్యంత కీలకం. గతంలో కేజీహెచ్‌లో రోజుకు 40 నుంచి 80 మంది రోగులకు ఈ పరీక్షలు చేసేవారు. బయట ల్యాబరేటరీలలో ఈ పరీక్షకు రూ. 900 నుంచి రూ. 1,300 వరకు ఖర్చవుతుంది. ఆర్థిక స్తోమత లేని పేద రోగులు ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. యంత్రాలకు మరమ్మతులే కారణం ఈ విషయంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి మాట్లాడుతూ, ఏబీజీ పరీక్షలకు స్వల్ప అంతరాయం కలిగిందని తెలిపారు. యంత్రాలకు మరమ్మతులు జరుగుతున్నాయని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ‘రీజెంట్స్ లిక్విడ్’ లేకపోవడం గురించి మాత్రం ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. -
తాతయ్యనాయుడుకు ఉత్తమ అవార్డు
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్ధల అనుబంధ సంస్ధ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి.తాతయ్య నాయుడు ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డును ఆంధ్ర విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ రాజశేఖర్ చేతుల మీదుగా అందుకున్నారని అంతేకాక ఆయనను జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్పేసెస్ డిగ్రీ కళాశాల కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి.తాతయ్య నాయుడు మాట్లాడుతూ తమ కళాశాల యాజమాన్యం, విద్యార్థుల సహకారంతో గత విద్యా సంవత్సరంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఈ అవార్డు పొందడం ఆనందనీయమని తెలిపారు. అవార్డు పొందిన నాయుడిని ఆంధ్రా విశ్వ విద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఆచార్యులు డి.సింహాచలం విద్యా సంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ అభినందించారు.