మెడకు చుట్టుకున్న మాంజా దారం
యలమంచిలి రూరల్: ఆటలాడుకుంటున్న రెండో తరగతి విద్యార్థి మెడకు మాంజా దారం చుట్టుకున్న ఘటనలో అదృష్టవశాత్తూ పెను ముప్పు తప్పింది. రెండు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఉక్కిరిబిక్కిరైన విద్యార్థి దారంతో పెనుగులాడడంతో తెగిపోయింది. రక్తస్రావంతో బాధపడుతున్న బాధిత విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడం, తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చూపడంతో విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులను నిలదీశారు. యలమంచిలి భాష్యం స్కూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలివి.. కోర్టుపేట వీధిలో భాష్యం స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ఓ టీచర్ ఆటలాడించడానికి తీసుకెళ్లారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకుండా,హెచ్‌ఎంకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను ఆటలాడించడానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఆటలాడుతుండగా జారుడుబల్లపైకి ఎక్కిన నలుగురు విద్యార్థుల్లో పెదపల్లికి చెందిన బొద్దపు సాయి దీక్షిత్ మెడకు సమీపంలో చెట్టుకు వేలాడుతున్న పదునైన దారం చుట్టుకుంది. దీంతో మెడ భాగంలో రెండు లేయర్లు తెగిపోయాయి.మూడో రౌండు తిరిగే సమయంలో విద్యార్థి దారాన్ని తెంపుకొన్నాడు.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థికి వెంటనే చికిత్స చేయించకుండా అలాగే వదిలేశారు.విద్యార్థి తండ్రి అశోక్ ఫోన్ నంబరుకు కాల్ చేసిన టీచర్ అసలు విషయాన్ని చెప్పకుండా మీ అబ్బాయికి చిన్న గాయమైంది స్కూలుకు రావాలంటూ తెలపడంతో అనుమానం వచ్చిన తండ్రి హుటాహుటిన స్కూలు వద్దకు చేరుకున్నారు.మెడకు గాయమైనా తన కొడుక్కి చికిత్స చేయించకుండా తాత్సారం చేయడంతో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గాయపడిన విద్యార్థిని పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి,అక్కడ్నుంచి యలమంచిలి సీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఎంఎల్‌సీ కావడంతో పట్టణ ఎస్‌ఐ సావిత్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.మంగళవారం ఉదయం విద్యార్థిని అనకాపల్లి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు.ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్థారించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.మంగళవారం రాత్రి స్కూల్ నిర్వాహకులు,గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు,పెదపల్లి గ్రామపెద్దలతో యలమంచిలి సీఐ ధనుంజయరావు సమక్షంలో చర్చలు జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్కూలు నిర్వాహకులు తల్లిదండ్రులను ప్రాధేయపడ్డారు.దీనిపై ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు తెలిసింది.కాగా భాష్యం స్కూలు బిల్డింగుతో పాటు సమీపంలో ఉన్న బహుళ అంతస్థుల భవానాలకు పెద్దపెద్ద తేనెపట్లు ఉన్నాయి.వాటివల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంటుందని,వాటిని తొలగించాలని కోరినా స్కూలు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని,బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి పెద్ద సంఖ్యలో విద్యార్థులను కుక్కుతున్నారని..ఇలా పలువురు తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు.


