పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం

Feb 11 2026 7:36 AM | Updated on Feb 11 2026 7:36 AM

పక్కా

పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం

ఇంటర్‌లో మెరుగైన ఫలితాల కోసం కసరత్తు

100 రోజుల ప్రణాళికతో తర్ఫీదు

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

కోటవురట్ల: జీవితం మలుపుకు మొదటి అడుగు ఇంటర్‌లోనే..పదిని పదిలంగా దాటేసినా ఇంటర్‌లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం..ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజినీరు అవ్వాలన్నా, సైంటిస్టుగా ఎదగాలన్నా ఇంటర్‌లో శ్రమించాల్సిందే. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురి తప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్‌ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్ధులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల కాగా ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా ప్రస్తుతం ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

ప్రణాళిక ఇలా..

ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతో పాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్‌ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు ప్రతీ రోజు పరిశీలన, వారానికి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలంటున్నారు. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను చేధించేందుకు గత పరీక్ష పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది.

ఎంతమంది హాజరవుతున్నారంటే..

అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరం జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాలకోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు.

పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం1
1/1

పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement