ఆయిల్‌పామ్ వెలవెల
చంద్రబాబు ప్రభుత్వంలో కానరాని మద్దతు ధర
గత ప్రభుత్వంలో టన్ను రేటు రూ.23,500
ప్రస్తుతం రూ.19 వేలు
ఆదుకోవాలని రైతుల వేడుకోలు
మండలంలో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలు
ఆయిల్‌పామ్ గెలలు లారీలపై లోడు చేస్తున్న కూలీలు
నాతవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయిల్‌పామ్ గెలల రేటు గణనీయంగా పడిపోయింది. జిల్లాలో 28 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. అధికంగా నాతవరం దేవరాపల్లి, కె.కోటపాడు, కోటవురట్ల, రావికమతం, చోడవరం, రోలుగుంట ఎస్.రాయవరం, కశింకోట, బుచ్చెయ్యపేట, గొలుగొండ, నర్సీపట్నం, పాయకరావుపేట, చీడికాడ, మాడుగుల, మండలాల్లో రైతులు ఆయిల్‌పామ్ తోటలు సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టన్ను ధర రూ. 23,500 ఉండేది. ప్రస్తుతం టన్ను ధర కేవలం రూ.19వేలు మాత్రమే ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూలీ రేట్లు, ఎరువుల ధరలు, పెట్టుబడి వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో పాటు, ఆయిల్‌పామ్ గెలల రేటు తగ్గిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గెలలు కోయడానికి కూలీలు రేట్లు రెట్టింపు చేసేశారు. క్రిమిసంహారక మందులు ఎరువుల రేట్లు సైతం పెరిగాయి. రైతులు పండించిన ఆయిల్‌పామ్‌గెలలు సోయా రుచి ప్రైవేటు కంపెనీ యాజమాన్యం మాత్రమే కొనుగోలు చేస్తోంది. నాతవరం మండలంలో చమ్మచింత, నాతవరం, గుమ్మడిగొండ, చిక్కుడుపాలెం, గునుపూడి తదితర ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ గెలలు కొనుగోలు చేసేందుకు తూనిక కేంద్రాలు ఏర్పాటు చేశారు.రైతులు పండించిన గెలలను అక్కడకు తీసుకెళ్లి విక్రయిస్తారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన గెలలను లారీలపై ఫ్యాక్టరీకి తరలిస్తారు.
ఎకరాకి 8 టన్నుల దిగుబడి
ఎనిమిదేళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు గల ఆయిల్‌పామ్ తోట నుంచి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సంరక్షణ, వాతావరణం బాగుంటే దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కిందట ఎకరాకి రూ.35 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అయ్యేది. ప్రస్తుతం ఎకరానికి పెట్టుబడి రూ.40వేల నుంచి రూ. 50వేల మధ్య పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆయిల్‌పామ్ తోటలు సాగు చేసే రైతులకు ఉద్యావనశాఖ ద్వారా మొక్కలను రాయితీపై అందిస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు బావి లేదా బోరుతో పాటు విద్యుత్ సదుపాయం ఉండాలి. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి తోట సంరక్షణను బట్టి పంట కాపు దశకు వస్తుంది. అంతవరకు ఈ తోటల్లో అంతర పంటగా కోకో, అరటి, కూరగాయల వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు.ఇతర పంటలు సాగుతో పోల్చుకుంటే పామాయిల్ తోటల ద్వారా గతంలో ఆదాయం ఎక్కువగా రావడంతో వీటిని వేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులు చూస్తే పెట్టుబడి రేట్లు దారుణంగా పెరిగాయి, రైతులు పండించిన పామాయిల్ గెలలు రేటు తగ్గడంతో రైతులు దిగాలు చెందితున్నారు.
ఆయిల్‌పామ్ గెలల రేటు తగ్గిన విషయంపై ఉద్యానవశాఖ డివిజన్ అధికారి శిరీషను వివరణ కోరగా ఆయిల్‌పామ్ గెలలు మన ప్రాంతంలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రేటు తగ్గుదలపై కొందరు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేశామని చెప్పారు.
టన్ను రూ 23,500
కొనుగోలు చేసేవారు
మాగ్రామంలో పామాయిల్ కొనుగోలు కేంద్రం ఉంది. గత ప్రభుత్వం హయాంలో రైతుల నుంచి టన్ను రూ.23,500 కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం టన్ను రూ. 19వేలకు మాత్రమే కొంటున్నారు. ఎరువులు క్రిమిసంహారక మందులు, కూలీలు రేట్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఏటా రేటు పెరగాల్సిందిపోయి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు
– సందీప్ చమ్మచింత గ్రామం
జిల్లాలో ఆయిల్‌పామ్ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు.ఆయిల్‌పామ్ గెల ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు వేడుకుంటున్నారు.
ఆయిల్‌పామ్ వెలవెల
ఆయిల్‌పామ్ వెలవెల


