వెళ్లిపోండి | - | Sakshi
Sakshi News home page

వెళ్లిపోండి

Feb 7 2026 9:49 AM | Updated on Feb 7 2026 9:49 AM

వెళ్లిపోండి

వెళ్లిపోండి

మీ వల్లే ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అనకాపల్లి జిల్లాకు 26వ స్థానం వచ్చిందంటూ కలెక్టర్‌ చిర్రుబుర్రు

సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం

జూమ్‌ మీటింగ్‌లో పరుషపదజాలం

వ్యవస్థలో లోపాలను సరిదిద్దకుండా ఉద్యోగులను బలి చేయడం సరికాదని సిబ్బంది ఆవేదన

ఇష్టం లేకపోతే...

సాక్షి, అనకాపల్లి: ‘ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోండి. మీ నిర్లక్ష్యం కారణంగా జిల్లా చివరి స్థానంలో ఉంది’ అంటూ సచివాలయాల ఉద్యోగులపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరుషపదజాలం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, జిల్లా యంత్రాంగం వైఫల్యం, వ్యవస్థలోని లోపాల వల్ల ప్రజలు తీవ్ర అసంతృత్తితో ఉన్నారని, అందువల్లే ఐవీఆర్‌ఎస్‌లో ఎక్కువ మంది రెండో నంబర్‌ బటన్‌ నొక్కారని, వాటిని సరిచేయకుండా తమను టార్గెట్‌ చేయడం సరికాదని, కలెక్టర్‌ మాట్లాడిన తీరు సరిగా లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నోట్‌ విడుదల చేశారు. సచివాలయ ఉద్యోగుల నోట్‌, వైరల్‌ అయిన వీడియో మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పనితీరుపై సమాచారాన్ని సేకరించి జిల్లాలకు గ్రేడింగ్‌ ఇస్తోంది. ఈ గ్రేడింగ్‌లో జిల్లాకు 26వ స్థానం చివరి స్థానం వచ్చింది. దీంతో ఈ నెల 5వ తేదీ గురువారం కలెక్టర్‌ ఉద్యోగులతో నిర్వహించిన జూమ్‌ సమీక్ష సమావేశంలో సచివాలయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివిధ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు బాలేదు..అందుకే ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఉద్యోగుల పనితీరు గ్రేడింగ్‌లో 26వ స్థానంలో ఉన్నామంటూ ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఫోన్‌ కొనాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలన్న దురాశతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లాకు చెడ్డపేరు సంపాదించి పెట్టారని ఆగ్రహించారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉండడం లేదని, వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తెలియజేశారని, ప్రజలిచ్చిన ఈ సరిఫికెట్‌ను నెత్తి మీద అంటించుకుని తిరగండని అంటూ కలెక్టర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మనమిత్ర వాట్సప్‌ సేవల ను ప్రచారం చేయమని ఆదేశిస్తే పంచాయతీ సెక్రటరీలు నిర్లక్ష్యం వహించారని దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కన్నా వెనుకబడి పోయామని కలెక్టర్‌ ఆగ్రహించినట్టు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు.

మనమిత్ర వాట్సాప్‌ సర్వీసులను గిరిజనులు బాగా ఉపయోగించుకుంటున్నారని, మన జిల్లా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ రోజుకి 20 మందికి వాట్సాప్‌ సర్వీసుల గురించి వివరించి, ప్రజలు వాటిని బాగా ఉపయోగించేలా చూడాలని ఆదేశించారు. ఈసారి ర్యాంకింగ్‌లో డబుల్‌ డిజిట్‌ వస్తే సహించేది లేదని హెచ్చరించారని సమాచారం.

కలెక్టర్‌ అలా అనడం బాధాకరం

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బాధ్యతాయుతమైన పరిపాలనా అధికారి పరుషపదజాలంతో మాట్లాడడం చాలా బాధాకరమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా తమకు సంబంధం లేని సేవలను కూడా అందిస్తున్నామని, పెన్షన్‌ పంపిణీ వంటి కీలకమైన సేవలను, గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులు రోజూ నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పరిపాలన విధానాల్లో లోపాల బాధ్యతను పూర్తిగా క్షేత్రస్థాయి ఉద్యోగుల మీద వేయడం న్యాయం కాదన్నారు. సిస్టమ్‌ ఫెయిల్యూర్స్‌, ట్రైనింగ్‌ లోపాలు, విధానపరమైన గందరగోళం ఉంటే..అది ఉద్యోగుల వైఫల్యం కంటే పాలనాపరమైన లోపంగానే చూడాలని, ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయంటూ దానికి కారణాలపై సమీక్ష చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందన్నారు. ప్రతి సమస్యకీ సచివాలయం ఉద్యోగులే జవాబుదారులుగా చేయడం సరికాదన్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై ప్రజలకు అవగాహన లేక..ఏవేవో బటన్లు నొక్కితే..ఆ తప్పుల బాధ్యతను కూడా తమపై వేయడం న్యాయసమ్మతం కాదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని, నిజాయితీగా సేవ చేస్తున్న ఉద్యోగులను బలిచేయవద్దని వారు కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల సమైక్య సంఘం నుంచి నోట్‌ కూడా విడుదల చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement