యాత్రకు వెళ్తుండగా విషాదం
● అతివేగమే ప్రాణం తీసింది ● కారు నడిపిన వ్యక్తి దుర్మరణం
నుజ్జయిన కారు ముందు భాగం
ఆరిలోవ : బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు శ్రీకాకుళం జిల్లాలోని రాజులమ్మ యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం నుంచి హనుమంతవాక మీదుగా ప్రయాణిస్తుండగా, బీఆర్టీఎస్ మధ్య లైన్‌లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారు ఎదురుగా వస్తున్న 68 నంబర్ సిటీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న బంగారు రాజేష్ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమవడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెల్త్ సిటీ ఆస్పత్రికి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేవలం బస్సులు, వీఐపీ వాహనాలకు కేటాయించిన మధ్య లైన్‌లోకి కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు.


