తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయ కర్త ప్రసాద్
మునగపాక: తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. ఆదివారం మునగపాకలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ తయారీలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదంటూ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్‌డీఆర్‌ఐ,ఎన్‌డీడీబీ ల్యాబ్‌ల రిపోర్టులు చెబుతున్నా .. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. ఈసమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీటీసీ సూరిశెట్టి రాము,సర్పంచ్ భీశెట్టి గంగప్పలనాయుడు, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్, పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ, కేశవరావు,చిరంజీవి, పెదబ్బాయి తదితరులు పాల్గొన్నారు.


