జేసీ సీటు ఖాళీ...సేవల్లో తీవ్ర జాప్యం
సుమారు ఆరు నెలలుగాపూర్తిస్థాయిలో అందని జేసీ సేవలు
కీలకమైన పోస్టు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు
నియమించి 26 రోజులైనా బాధ్యతలు చేపట్టని కొత్త జే సీ
ఎక్స్ వేదికగా సీఎంకు ఫిర్యాదు చేసిన జిల్లా వాసులు
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్(జేసీ) సీటు ఖాళీగా ఉండడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానమైన రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ వ్యవహారాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందించే సేవల్లో తీవ్ర జాప్యం నెలకుంటోంది. ఇక్కడ జేసీగా పనిచేసిన జాహ్నవి వ్యక్తిగత కారణాలతో పలుమార్లు సెలవు పెట్టడడంతో ఆరు నెలలుగా పాలనాపరమైన పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇన్‌చార్జి బాధ్యతలను డీఆర్వో సత్యనారాయణకు అప్పగించినప్పటికీ పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. పాత జేసీ జాహ్నవి ప్రసూతి సెలవులో వెళ్లడంతో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మల్లవరపు సూర్యతేజను గతనెల 12న ప్రభుత్వం ఇక్కడ జేసీగా నియమించింది. 26 రోజులుదాటినా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ఇక్కడకు వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని తెలిసింది. ఆయన రానప్పటికీ కొత్త అధికారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసే వారు, వివిధ పనుల కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా జనవరి నెలలో ‘అనకాపల్లి ఉత్సవ్ ’నిర్వహించడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఈవెంట్లతో కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రెవెన్యూ సమస్యలు, ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో జేసీని నియమించాలని జిల్లాలో ఉద్యమకర్తలు, ప్రజలు ‘ఎక్స్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు
చతికిలపడిన కీలక విభాగాలు
జిల్లా పాలనలో జాయింట్ కలెక్టర్(జేసీ)ది కీలక భూమిక. ప్రధానంగా సివిల్ సప్లయిస్, భూసేకర ణ, గనులు, ఖనిజాలు, వివిధ సంక్షేమ శాఖలు, ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ, విపత్తు నిర్వహణ వంటివి జేసీ పరిధిలోనే ఉంటాయి. ప్రధానంగా రెవెన్యూ విభాగంలో పెండింగ్‌లో ఉన్న కేసులు, అప్పీళ్లను పర్యవేక్షిస్తారు. జేసీ లేకపోవడంతో భూ వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, భూ రికార్డుల కంప్యూటరీకరణ అటకెక్కాయి. పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీ, భూముల రీసర్వే, ఏపీఐఐసీ భూసేకరణ, సబ్సిడీ బియ్యం పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియలో సమన్వయం లోపించింది. పింఛన్లు, గృహ నిర్మాణ పథకాల పురోగతిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువైంది.
పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
కొత్తగా నియమితులైన జేసీ బాధ్యతలు స్వీకరించి,పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలి. జీవో వచ్చి 26 రోజులైనా ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం వెనుక ఉన్న కారణం తెలియడం లేదు. జేసీ సేవలు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో ఆరు నెల లుగా పాలన కుంటుపడింది. తక్షణమే జేసీ నియమించాలని తాను ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరాను. జిల్లా లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి.
–కాండ్రేగుల వెంకటరమణ, ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాల ప్రభావితుల ఉద్యమకర్త
జేసీ సీటు ఖాళీ...సేవల్లో తీవ్ర జాప్యం
జేసీ సీటు ఖాళీ...సేవల్లో తీవ్ర జాప్యం
జేసీ సీటు ఖాళీ...సేవల్లో తీవ్ర జాప్యం


