సంద్రంలోసైనిక శోభ | - | Sakshi
Sakshi News home page

సంద్రంలోసైనిక శోభ

Feb 16 2026 7:45 AM | Updated on Feb 16 2026 7:45 AM

సంద్ర

సంద్రంలోసైనిక శోభ

మినీ ఐఎఫ్‌ఆర్‌ మిలాన్‌–2026 ప్రారంభం

విదేశీ ప్రతినిధుల కోసం అందుబాటులో మిలాన్‌ విలేజ్‌

ఇప్పటికే విశాఖ చేరుకున్న 15 దేశాల యుద్ధ నౌకలు

రేపు నగరానికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

18న ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ని సమీక్షించనున్న రాష్ట్రపతి

తీరంలో విన్యాసం

సాక్షి, విశాఖపట్నం: సంద్రంలో సందడి మొదలైంది.. నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తూర్పు తీరం.. కళకళలాడుతోంది. ఒకేసారి అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన విశాఖ నగరంలో.. మినీ ఐఎఫ్‌ఆర్‌గా పిలుచుకునే మిలాన్‌–2026 లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నౌకాదళ స్థావరంలోని విపత్తు నిర్వహణ రక్షణ వేదిక(హెచ్‌ఏడీఆర్‌ హార్డ్‌) వద్ద మిలాన్‌ విలేజ్‌ని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా ప్రారంభించారు. మరోవైపు.. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఇప్పటికే 15 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, రక్షణ రంగ ప్రతినిధులు, అధికారులు విశాఖ చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 17న నగరానికి చేరుకొని.. 18వ తేదీన యాంకరేజ్‌ ఏరియాలో జరిగే ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ని సమీక్షించనున్నారు. దాదాపు 70 దేశాలకు చెందిన 50 యుద్ధ నౌకలు, సబ్‌మైరెన్లుతో పాటు భారత్‌కు చెందిన వార్‌షిప్స్‌, సీకింగ్స్‌, హెలికాఫ్టర్లు ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌లో భాగస్వామ్యం కానున్నాయి. భారీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, సంప్రదాయ బద్ధంగా.. చరిత్రని గుర్తు చేసేలా తయారు చేసిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మిలాన్‌ విలేజ్‌ విశేషాలు.!

మిలాన్‌ విలేజ్‌ అనేది కేవలం ప్రదర్శన వేదిక మాత్రమే కాదు... ఇది వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, రుచుల సమ్మేళనం. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల హస్తకళలు, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ప్రదర్శనలు ఉంటాయి. సందర్శకులకు, విదేశీ నౌకాదళ ప్రతినిధులకు భారతీయ వంటకాలతో పాటు అంతర్జాతీయ రుచులను ఆస్వాదించే అవకాశం కల్పించేలా మిలాన్‌ విలేజ్‌ని ఏర్పాటు చేశారు. ఈ విలేజ్‌ ఈ నెల 21 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

రెండు దశల్లో మిలాన్‌ విన్యాసాలు..

2024లో జరిగిన మిలాన్‌లో 50 దేశాలు భాగస్వామ్యం కాగా.. ఈసారి రికార్డు స్థాయిలో 70 దేశాల వరకూ విన్యాసాల్లో జతకట్టనున్నాయి. ఈ మినీ ఐఎఫ్‌ఆర్‌ రెండు దశల్లో జరగనుంది. 15 నుంచి 20 వరకూ హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా.. మిలాన్‌ విలేజ్‌ ప్రారంభం, అంతర్జాతీయ సముద్ర సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ దేశాల నౌకాదళాల మధ్య చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా 18న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆధ్వర్యంలో ‘ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూ’ లో అన్ని దేశాలు పాల్గొననున్నాయి. 21 నుంచి 25 వరకూ సీఫేజ్‌ విన్యాసాలు ప్రారంభమవుతాయి. బంగాళాఖాతంలో వివిధ దేశాల యుద్ధనౌకలు కలిసి సంక్లిష్టమైన యుద్ధ విన్యాసాలు, కమ్యునికేషన్‌ డ్రిల్స్‌, వీరోచిత ఆపరేషన్లు నిర్వహిస్తారు.

సంద్రంలోసైనిక శోభ 1
1/3

సంద్రంలోసైనిక శోభ

సంద్రంలోసైనిక శోభ 2
2/3

సంద్రంలోసైనిక శోభ

సంద్రంలోసైనిక శోభ 3
3/3

సంద్రంలోసైనిక శోభ

Advertisement
 
Advertisement
Advertisement