వరి కుప్పలకు నిప్పు పెట్టిన దుండగులు
కోటవురట్ల: పి.కె.పల్లిలో వరి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన అల్లు శ్రీరామ్మూర్తి, తానారి నూకరాజులకు చెందిన రెండు వరి కుప్పలకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టారు. రైతులు శనివారం ఉదయం పొలానికి వెళ్లేసరికి కుప్పలు దగ్ధమవుతూ కనిపించాయి. సమీప రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ రెండు కుప్పలను నూరిస్తే సుమారు 75 బస్తాల ధాన్యం అవుతాయని, కక్షపూరితంగానే మంట పెట్టారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడో రేపో కుప్పలు నూర్చి ధాన్యాన్ని ఇంటికి పట్టుకెళ్లేందుకు చూస్తుండగా ఎవరో కావాలనే నిప్పు పెట్టారని వాపోయారు. చేతికి ఫలసాయం రాకుండా కక్ష కట్టారని ఆరోపించారు. బాధిత రైతులు పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణరాజు రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తకు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఇటువంటి చర్యలు పగలను పెంచుతాయని, పల్లెల్లో అంతా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా మెలగాలన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.


