తుమ్మపాల : రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలను రూపొందించుకోవాలని, కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఏపీ ఫైనాన్స్ శాఖ సెక్రటరీ డి.రోనాల్డ్ రోస్, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలతో కలిసి 2026–27 బడ్జెట్ – ఔట్ రీచ్ అవగాహన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు, అధికారులకు సూచించారు. హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతి అధికారి జిల్లా అభివృద్ధిపై జవాబుదారీగా ఉండాలని, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల నిధులు వృథా కాకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు.
తలసరి ఆదాయంలో జిల్లాకు 13 స్థానం
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 99శాతం జీతాలు, వడ్డీలు, పెన్షన్లకే సరిపోతోందని జిల్ల ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆస్తులు, అప్పుల కేటాయింపులో ఆదాయం తెలంగాణకు, అప్పులు ఏపీకి కేటాయింపు జరిగిందని, అయినప్పటికీ అన్ని సమస్యలు ఎదురొడ్డి ముందుకు నడుస్తున్నామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షల కోట్లు ఉంటే, ఏపీ తలసరి ఆదాయం రూ.2.60 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో అనకాపల్లి జిల్లా 13వ స్థానంలో ఉందన్నారు.


