జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీల విజేత కేజే పురం
దేవరాపల్లి: మండలంలోని తారువలో శ్రీభక్తాంజనేయ స్వామి తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ప్రథమ స్థానంలోను, వల్లంపూడి సిద్ధివినాయక ఎడ్లు ద్వితీయ స్థానంలోను, కూండ్రం మరిడిమాంబ ఎడ్లు తృతీయ స్థానంలోను నిలిచాయి. దేవరాపల్లి వేతమ్స్ నాయుడు ఎడ్లు నాల్గవ, కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ఐదవ, దేవరాపల్లి వీరాంజనేయ ఎడ్లు ఆరవ స్థానంలోను నిలిచాయి. విజేతలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చేతుల మీదుగా వరుసగా రూ. 25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4వేల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామి వారికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితరులు దర్శించుకున్నారు. సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, రాత్రి పలు సాసంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.


