పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి
● ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది కోసం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌ను ఈ వారం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బంది వారి సమస్యలను తెలియజేయాలంటే అనకాపల్లిలో కార్యాలయానికి రావడం కష్టంగా ఉంటుందని, అందువల్లే ఆన్‌లైన్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు(సెల్ నంబర్. 9346912011) జరుగుతుందన్నారు. పోస్టింగ్‌లు, సెలవులు, బదిలీలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, పనిఒత్తిడి వంటి అంశాలపై 27 మంది సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఎస్‌ఐ ప్రసాద్, కార్యాలయం సూపరింటెండెంట్లు గిరి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.


