డెడ్‌లైన్ దాటితే సస్పెన్షన్!
ఇంటి పన్ను వసూళ్ల శతశాతం పూర్తికి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు
ఈ నెల 15కల్లా పూర్తి చేయాలని అధికారుల ఒత్తిడి
ఆందోళనలో పంచాయతీ కార్యదర్శులు
తుమ్మపాల: ఈ నెల 15 నాటికి శతశాతం ఇంటి పన్నుల వసూలు చేయాల్సిందేనంటూ అధికార యంత్రాంగం విధించిన డెడ్‌లైన్ తో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే రకరకాల సర్వేలు, శానిటేషన్ పనుల ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, నీటి పన్నులు, లైటింగ్ చార్జీలు, ఇతర గ్రామ పన్నుల వసూళ్లను ఈనెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలతో పాటు సస్పెన్షన్ నోటీసులు జారీ చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు.
గ్రామాల్లో సాధారణంగా ఇంటి పన్నులు చెల్లించే ప్రక్రియ సులభంగా సాగదు. ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ ఆదాయం తగ్గడం, ఉపాధి సమస్యలు వంటి కారణాలతో అనేక కుటుంబాలు పన్నులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన గడువు కార్యదర్శులకు మానసిక ఒత్తిడిని తీవ్రంగా పెంచుతోంది.
నిత్యం ఒత్తిళ్లతో ఆస్పత్రి పాలు
పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనన మరణ నమోదులు, పలు రకాల ధ్రువీకరణలు, పథకాల అమలు, గ్రామ సభలు, ఆన్‌లైన్ ఎంట్రీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి పనులతో పాటు కొన్ని ఆన్‌లైన్ సర్వేలు, ప్రతి రోజు తెల్లవారు 6 నుంచి పారిశుధ్య పనులతో మొదలు పెట్టి సాయంత్రం వరకు అనేక పనులు కార్యదర్శుల భుజాలపైనే ఉన్నాయి. మరోపక్క యూనిక్ ఫ్యామిలీ సర్వే టార్గెట్ కూడా కొనసాగుతుంది. వీటన్నింటికి తోడు ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాలు కూడా 15 నాటికి శతశాతం చేరుకోవాలనే ఒత్తిడి మరింత పెరగడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల మానసిక ఒత్తిడికి లోనై పలువురు కార్యదర్శులు ఆస్పత్రుల పాలవుతున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు.
సగానికి పైగా బకాయిలు...
జిల్లాలో ఉన్న 24 మండలాల్లోను 646 గ్రామ పంచాయతీల్లో 3.90 లక్షల గృహాలు, షాపులు, ఇతర పన్నుల వనరుల ద్వారా మొత్తం రూ.44 కోట్ల పన్నులు ఉండగా ఈ నెల 15 నాటికి పూర్తిగా వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అయితే వీటిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12 కోట్లు కాగా పాత బకాయిలే రూ.32 కోట్ల వరకు ఉన్నాయి. అన్నింటిని కలిపి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు 40 శాతం మేర అంటే దాదాపు రూ.20 కోట్ల వరకు వసూళ్లు పూర్తి చేశారు. అయినప్పటికీ బకాయిగా ఉన్న మిగిలిన రూ.25 కోట్ల కూడా ఒక్క పైసా బకాయి లేకుండా 15 నాటికి పూర్తి చేయాలని కార్యదర్శులపై హుకుం జారీ చేశారు.
ఆపదలోనూ పరామర్శించని జిల్లా అధికారులు
ఒత్తిడి విధానం కాకుండా ప్రోత్సాహక విధానం అవలంభించి వసూళ్లు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. వ్యక్తిగత, విధి నిర్వహణలో వత్తిడికి లోనై ఆసుపత్రుల పాలైన పంచాయతీల అధికారులను సంబంధిత జిల్లా అధికారులు కనీసం పరామర్శించి ధైర్యం కూడా చెప్పలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో మార్చి నాటికి వసూళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరిలోనే పూర్తిచేయమంటున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత నిధులు కూడా చెల్లిస్తున్నారు. ఈ నెల 15 వరకు ఇచ్చిన గడువును పెంచి సాంకేతికతపై ప్రజలకు అవగాహన పెంచాలని కోరుతున్నారు.
వాస్తవాలకు భిన్నంగా అంచనాలుప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వసూళ్ల లక్ష్యాలను నిర్ణయించే ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం వాస్తవ స్థితిగతులకు భిన్నంగా నివేదికలు తయారుచేస్తున్నారు. గత సంవత్సరపు వసూళ్ల శాతం, పెండింగ్ బకాయిలు, కొత్తగా నమోదైన ఇళ్ల సంఖ్య వంటి అంశాల ఆధారంగా ఈ లక్ష్యాలను నిర్ణయిస్తున్నప్పటికీ గడిచిన ఏడాదిలో కొరతగా ఉన్న సౌకర్యాలను మరుసటి ఏడాదిలో అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో ఇంటి యాజమానులు పన్ను చెల్లింపులకు సౌకర్యాల ఏర్పాటుపై మెలిక పెడుతున్నారు. చెత్త సేకరణ సక్రమంగా లేకపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు...ఇవన్నీ ప్రజలు ప్రస్తావిస్తుండడంతో ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేయడం కార్యదర్శులకు సవాలుగా మారింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడంపై జిల్లా అధికారులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమీక్షలు పెట్టి కార్యదర్శులను వివరణలు కోరడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వార్షిక గోప్య నివేదికల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో పంచాయతీ కార్యదర్శులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు.


