సింహగిరిపై ‘దొంగల’ వేట | - | Sakshi
Sakshi News home page

సింహగిరిపై ‘దొంగల’ వేట

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?

భక్తులను బంధించి ప్రశ్నించిన స్థానాచార్యులు

తాము దొంగిలించలేదని

కన్నీటిపర్యవంతమైన భక్తులు

వినోదోత్సవమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యం

సింహాచలం: ‘మీరు స్వామి వారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్‌’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు.

అసలేం జరిగింది? : సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివార్షికకల్యాణోత్సవా ల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకు లు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం.

బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు

రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్‌, ఇంజనీరింగ్‌ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేష్మి, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్‌పూర్‌కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్‌, హేమ, తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు.

సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి!

స్థానాచార్యులు రాజగోపాల్‌ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ట్విస్ట్‌ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్‌గా నిలిచింది.

పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ

భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement