యలమంచిలి మండలం పోతురెఢ్డిపాలెం హైవే కూడలి వద్ద దుర్ఘటన
యలమంచిలి రూరల్: నిశిరాత్రి..పోతురెడ్డిపాలెం హైవే రక్తసిక్తమైంది.అమ్మవారి జాతరను తిలకించి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు స్నేహితులను మృత్యువు పొట్టనపెట్టుకుంది.కలిసి,మెలిసి పెయింటర్లుగా పనిచేస్తున్న ముగ్గురు యువకులు తమ జీవితం రంగులమయం కావాలని ఎన్నో కలలుకన్నారు.ఏ ఒక్కరికి పెయింటింగ్ పని దొరికినా ముగ్గురు కలిసి చేసుకునేవారు.తమలో ఒకరిని ఇంటి వద్ద బైక్‌పై డ్రాప్ చేసేందుకు వెళ్లిన ఆ ముగ్గురిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మరణంలోనూ మేము ఒకరినొదిలి మరొకరం ఉండలేమంటూ ఆ ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘోర దుర్ఘటన మూడు నిరుపేద కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.యలమంచిలి రూరల్ పోలీసులు,బాధిత కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాలు ఇవి...
యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.పురుషోత్తపురంలో గురువారం రాత్రి జరిగిన గొల్లమారెమ్మతల్లి పండగను తిలకించిన ముగ్గురు స్నేహితులు బైక్‌పై పక్కనున్న పోతురెడ్డిపాలెం గ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. హైవే కూడలి వద్ద విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని(24),ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవింద్(25),పోతురెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారు దుర్గాప్రసాద్(16) పెయింటర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గొల్లమారెమ్మతల్లి పండగకు ఈ ముగ్గురూ వెళ్లారు. పండగలో ఆనందంగా గడిపిన అనంతరం దుర్గాప్రసాద్‌ను పోతురెడ్డిపాలెంలో దింపిరావడం కోసం బైక్‌పై బంగారు నాని,గోవింద్,దుర్గాప్రసాద్ అర్ధరాత్రి సమయంలో బయల్దేరారు.వీరు బయల్దేరిన ఐదు నిమిషాలకే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు యలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు.
లిప్తపాటులో...మృత్యుకాటు
పండగలో ఆనందంగా గడిపిన అనంతరం దుర్గాప్రసాద్‌ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురు యువకులు ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి హైవేను దాటుతున్న సమయంలో అవతల రహదారిపై వస్తున్న లారీని గమనించిన యువకులు దానికంటే ముందుగానే పోతురెడ్డిపాలెం గ్రామానికి వెళ్లే సర్వీసు రోడ్డులోకి వెళ్లేందుకు బైక్‌ను ముందుకు నడిపారు
సరిగ్గా అదే సమయంలో లారీకి ఎడమ వైపు నుంచి ట్రావెల్ బస్సు అతివేగంగా రావడంతో బైక్ వెనుక భాగాన్ని ఢీకొంది.వెంటనే ఇద్దరు యువకులు ఎగిరి బస్సు ముందున్న అద్దాలకు ఢీకొని, రోడ్డుపై పడిపోయారు.ముగ్గురు యువకుల తల భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు.
పెళ్లయిన నాలుగు నెలలకే..
ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవింద్‌కు నాలుగు నెలల కిందటే వివాహమైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు.ప్రమాద విషయం తెలియగానే గోవింద్ భార్య దుర్గ,తల్లిదండ్రులు అప్పారావు,భవానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.గోవిందు పురుషోత్తపురంలో అత్తవారింటికి పండగ నిమిత్తం వచ్చి విగతజీవిగా మారాడు.బంగారు నానికి భార్య కుమారి మూడేళ్లలోపు వయసున్న కుమార్తె,కుమారుడు ఉన్నారు. నాని మృతదేహాన్ని చూసి కుమారి గుండెలవిసేలా రోదించింది. తండ్రి మరణించిన విషయం కూడా తెలియని పిల్లలు అమాయకంగా దిక్కులు చూస్తుంటే అక్కడున్నవారు కంటతడి పెట్టారు.ఇటీవల ఉగాది పండగకు నాని కొనుగోలు చేసిన డ్యూక్ బైకే ప్రాణాలు తీసిందంటూ విలపించారు. మరొక మృతుడు బంగారు దుర్గాప్రసాద్ 7వ తరగతి వరకు చదువుకుని పెయింటింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.మృతి చెందిన కుమారుడిని చూసి అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.ఏం పాపం చేశామని ఈ రంపపు కోత అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.


