మంత్రి పదవి కోసం ఉత్తరాంధ్రకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి కోసం ఉత్తరాంధ్రకు వెన్నుపోటు

Apr 4 2026 7:37 AM | Updated on Apr 4 2026 7:37 AM

నాడు విశాఖ రాజధానిని స్వాగతించి.. నేడు అమరావతికే జై కొడతావా?

అమరావతికే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. వెనకబడిన ప్రాంతాల పరిస్థితేంటి?

ఎమ్మెల్యే గంటా విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌

సాక్షి, అనకాపల్లి: మంత్రి పదవి కోసం... చంద్రబాబు, లోకేష్‌ మొప్పు పొందాలని విశాఖకు వెన్నుపోటు పొడుస్తావా అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి రీజనల్‌ కోఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఓట్లతో గద్దెనెక్కానన్న విశ్వాసం కూడా లేకుండా విశాఖను రాజధానిగా ప్రకటించిన మాజీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గంటా అనుచిత వ్యాఖ్య లు చేయడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు మూడు రాజధానులకు స్వాగతమని, నేడు అమరావతికే జై కొడతావా అంటూ మండిపడ్డారు. విశాఖ ప్రాంతానికి చెందిన వాడివి కాకపోయి నా తమ ప్రాంత ప్రజలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిపించి రాజకీయ భిక్ష పెడితే.. అదే ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరా వతి పేరిట చంద్రబాబు అవినీతికి పార్లమెంట్‌లో చట్టం చేస్తున్నట్లుగా ఉందంటూ ఎద్దేవ చేశారు. ముంపు ప్రాంతమైన అమరావతి రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయి వచ్చారు.. పదేళ్ల పాటు ఉమ్మడి ఏపీ ఆదాయంతో రాజధాని ఏర్పాటు చేయాలనే నిబంధనను మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం ఆ నాడు తాత్కాలిక భవనాల పేరిట హడావుడి చేశారన్నారు. నాడు, నేడు వైఎస్సార్‌సీపీ స్టాండ్‌ ఒక్కటేనని, అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి వికేంద్రీకరణే తమ సిద్ధాంతమన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి పేరిట జరుగుతున్న అవినీతికి మాత్రమే వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమన్నారు. తమ ప్రభుత్వంలో కూడా అమరావతితో పాటు విశాఖ, కర్నూల్‌ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. విశాఖ రాజధాని కాకుంటే మావిగన్‌ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలతో కలిసి రాజధాని చేస్తే తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకుందామని తమ నాయకుడు ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.2 లక్షల కోట్లు అమరావతి రాజధానికే ఖర్చు చేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా కేంద్రీకృతంతో ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

మంత్రి పదవిపై వ్యామోహంతో.. లోకేష్‌ మొప్పు కోసం టీడీపీ ఎమ్మెల్యే గంటా చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని విశాఖ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement