సుందరపు భూబాగోతం | - | Sakshi
Sakshi News home page

సుందరపు భూబాగోతం

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

సుందరపు భూబాగోతం

సుందరపు భూబాగోతం

సాక్షి, అనకాపల్లి :

ళితుల భూములను లాక్కొనేందుకు యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ భారీ స్కెచ్‌ వేశారు. దాదాపుగా రూ.200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమి కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. ఆ భూములే తమకు జీవనాధారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1978లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వే నెం.2లో 16 దళిత కుటుంబాలకు 42 ఎకరాలు ఇచ్చింది. ఒక్కొక్కరికీ 2 ఎకరాల 78 సెంట్లు చొప్పున ఇచ్చారు. తమ కిచ్చిన భూముల్ని దౌర్జన్యంగా లాక్కొనేందుకు జనసేన ఎమ్మెల్యే స్కెచ్‌ వేశారంటూ పంచదార్ల గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే చర్యలకు వ్యతిరేకంగా పంచదార్ల గ్రామ బాధిత దళిత కుటుంబాలు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారంతో 11వ రోజుకు చేరుకుంది. దళితులు, పేదల భూముల్ని కబ్జా చేసేందుకు వచ్చిన పొక్లెయిన్‌లను అడ్డుకుంటూ..ఈ నెల 2వ తేదీ నుంచి తమ భూముల్లో వంటా వార్పు కార్యక్రమానికి దిగారు. స్థానిక ఎమ్మార్వో, పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరుడు దిన్నిబాబు భూముల స్వాధీనానికి ప్రయత్నించగా పొక్లెయిన్‌ను బాధిత దళితులు అడ్డుకున్నారు. 1–బీ రికార్డులన్నీ తమ వద్దే ఉన్నాయని, ఆ భూములపై హక్కులన్నీ తమవేనని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వారం రోజుల క్రితం జీడి, మామిడి, అరటి, కొబ్బరి చెట్లను నరికేందుకు వచ్చిన వారిని బాధిత దళితులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే భూముల్ని ఖాళీ చేసేయాలంటూ రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది తమపై ఒత్తిడి చేస్తున్నారని, ఆ భూముల్లోకి వెళ్తే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

47 ఏళ్ల క్రితమే దళితులకు కేటాయింపు

దళితులు, పేదలకు కేటాయించిన భూముల్ని ఇప్పుడు సెజ్‌ నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు పేరిట స్థానిక జనసేన ఎమ్మెల్యే లాక్కోవడానికి తన అనుయాయుల్ని రంగంలోకి దింపారు. సెజ్‌ కోసం ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు పేరిట విలువైన భూములను లాక్కొనేందుకు భారీ స్కెచ్‌ వేశారు. తాము స్థలాలు కోల్పోతే తమకు కూడా స్థలాలే కేటాయించాలంటూ కొన్నాళ్లుగా బాధితులు నిరసనకు దిగారు. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామ పరిధి లోని సర్వే నంబర్‌–2లో 1 నుంచి 24 వరకు ఉన్న సబ్‌ డివిజన్లలో దళితులకు చెందిన భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1978లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దళిత కుటుంబాలకు ఈ భూముల్ని కేటాయించింది. అప్పటి నుంచీ ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న బక్క జీవులను ఇప్పుడు తన్ని తగిలేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

చంపేస్తామని బెదిరిస్తున్నారు..

నాది పంచదార్ల గ్రామం. 2 ఎకరాల 78 సెంట్లు భూమి ఉంది. ప్రభుత్వానికి మేము పన్ను కూడా చెల్లిస్తున్నాం. పట్టాలున్న మా భూమికి భూమి రేట్లు పెరిగాయని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఎంఆర్‌వోతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఐదు పొక్లెయిన్‌లతో అక్రమంగా మా భూముల్లో మట్టిని తవ్వి చదును చేస్తుంటే అడ్డుకున్నాం. మమ్మల్ని పొక్లెయిన్‌ డ్రైవర్‌ తొక్కించేస్తామంటూ భయపెట్టారు. అడ్డుకుంటే మీ పిల్లలపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. దళితులమని కూడా చూడకుండా దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాపై పోలీసులు కేసులు పెట్టి స్టేషన్‌కు కూడా తీసుకెళుతున్నారు.

– కనకరత్నం, పంచదార్ల గ్రామం, రాంబిల్లి మండలం

ఎమ్మెల్యే అండతోనే బెదిరిస్తున్నారు..

మాకు 2.78 సెంట్లు డి–పట్టా భూమి ఉంది. స్థానిక టీడీపీ నాయకుడు బిన్నిబాబు పోలీసులు, ఎంఆర్‌వోతో కలిసి మా భూములు లాక్కోవడమే కాకుండా మమ్మల్ని క్రేన్‌తో తొక్కించేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే అండతో దిన్‌బాబు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు.

– గూటాల జయలక్ష్మి, పంచదార్ల గ్రామం,

న్యాయం జరిగేవరకూ పోరాడతాం..

మా భూమిలో మాకు తెలియకుండా పొక్లెయిన్‌లతో తవ్వుతున్నారు. అడ్డుకుంటే మహిళనని కూడా చూడకుండా చంపేస్తామని బెదిరించారు. ఎమ్మార్వో కేసులు పెడతామంటూ బెదిరించారు. పోలీసులు కూడా వచ్చారు. మీరు అడ్డుకుంటే మీ పిల్లలపై కేసులు పెడతామంటూ బెదిరించారు. మాకు న్యాయం జరగకుంటే ప్రాణాలు పోయినా తవ్వడానికి ఒప్పుకోము. –గారపాటి చిన్నమ్మలు, పంచదార్ల గ్రామం

కేసులకు భయపడేది లేదు..

మా తాతల కాలం నాటి మా స్వాధీనంలో ఉన్న భూముల్ని లాక్కోడానికి ఎమ్మెల్యే సుందరపు, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు. ఆ భూములు ఇవ్వకుంటే కేసుల్లో ఇరికిస్తామని రెవెన్యూ, పోలీస్‌ అధికారుల ద్వారా బెదిరిస్తున్నారు. దళితుల్ని చిన్నచూపు చూస్తే సహించేది లేదు. మా భూముల్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలకై నా సిద్ధంగా ఉన్నాం. మా భూముల్లో వంటావార్పు చేస్తుండగా మా భూముల్లోకి పొక్లెయిన్‌లతో వచ్చి మమ్మల్ని బెదిరించారు. ఎమ్మార్వో, వీఆర్‌వో, పోలీసులు వచ్చి మీపై కేసులు పెడుతున్నామంటూ బెదిరించారు. –తెరపల్లి ప్రసన్న, పంచదార్ల

ఎమ్మెల్యే కనుసన్నల్లోనే...

దళితుడినైన నాకు 47 ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం డి.పట్టాతో 2.78 ఎకరాల భూమి ఇచ్చింది. మా భూమికి వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా ప్రతి ఏటా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ పడింది. పన్ను చెల్లిస్తున్నాం. స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ కనుసన్నల్లోనే టీడీపీ మండల నేత దిన్నిబాబు బెదిరించి మా భూమి లాక్కొంటున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవోకు, కలెక్టర్‌కు వినతి ఇచ్చాం. న్యాయం జరగలేదు.

–గూడబండి రమేష్‌, పంచాదార్ల గ్రామం

బాధితులకు అండగా ఉంటాం

47 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు భూములను ఇచ్చింది. వాటిని మింగేద్దామని కూటమి ప్రభుత్వం చూస్తుంది. పొజిషన్‌లో ఉన్నవారికి నోటీసులు లేకుండా దళితుల భూములు దోచుకుంటామంటే మంచి పద్ధతి కాదు. దళితులను మోసం చేసిన ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. దళితులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుంది. 13న ఉదయం 10 గంటలకు నిరసన తెలియజేస్తున్న దళితులను కలిసి వారికి మద్దతు పలుకుతాను.

– కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త

పొక్లెయిన్‌లను అడ్డుకుంటున్న బాధిత దళిత రైతులు

దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను

రూ.200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమి కబ్జాకు యత్నం

సెజ్‌ నిర్వాసితులకు ఇంటి స్థలాలంటూ హడావుడి

ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు దిన్నిబాబుపై పేద దళితులు ఆగ్రహం

పొక్లెయిన్‌లను అడ్డుకున్న దళితులను తొక్కించేస్తామంటూ బెదిరింపులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా 11వ రోజుకు చేరుకున్న దళితుల నిరసన

కేసులు పెడతామంటూ

ఎంఆర్‌వో, సీఐ బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement