మా దారి... అడ్డదారి! | - | Sakshi
Sakshi News home page

మా దారి... అడ్డదారి!

Feb 12 2026 7:21 AM | Updated on Feb 12 2026 7:21 AM

మా దా

మా దారి... అడ్డదారి!

పట్టుకున్నారు..వదిలేశారు?

ఈ విషయమై రెండు లారీల డైవర్లను ప్రశ్నించగా పోలీసులు రాత్రి పట్టుకున్నారని, ఉదయం వదిలేశారని తెలిపారు. పెనాల్టీ ఎంత విధించారని అడగ్గా, లారీ ఓనర్‌ పోలీసులతో మాట్లాడుకున్నారని, డబ్బులు ఏమీ కట్టలేదని చెప్పడం గమనార్హం. జాతీయ రహదారి మీదుగా వెళ్లకుండా అడ్డదారిలో ఎందుకు తీసుకెళ్తున్నారని ఆరా తీయగా...ఓవర్‌ లోడ్‌ అని, టోల్‌ గేట్‌ మీదుగా వెళ్తే రూ.4వేలు పెనాల్టీ కట్టాలని అందుకు ఇలా దొడ్డిదారిన వెళ్తున్నామని చెప్పడం విశేషం.

నక్కపల్లి : కంచే చేను మేస్తే కాపాడేదెవరు అన్నట్లు ఉంది కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వ్యవహారశైలి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలకు అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. రక్షకులే భక్షకులుగా మారి అడ్డగోలు వ్యాపారాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి సామర్ధ్యంతో దొడ్డిదారిన రాకపోకలు సాగించే భారీ వాహనాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. అధికారుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడడంతోపాటు, పట్టుమని పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్లు మూన్నాళ్లకే శిథిలమవుతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన నివసించేవారు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్నినెలలుగా సాక్షాత్తూ హోంమంత్రి ఇలాకా లో జరుగుతున్న ఈ బాగోతం అరికట్టేందుకు ఉన్నతాధికారులెవరూ దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలు...షరా‘మామూలే’...

కాకినాడ జిల్లా రౌతులపూడి నుంచి అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎన్‌ఈవోబీకి బండరాళ్లు భారీ టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. నిబంధన ప్రకారం ఒక్కో టిప్పర్‌లో 40 టన్నులకు మించి లోడ్‌ చేయడానికి వీల్లేదు. కానీ ఈ టిప్పర్లలో 70 నుంచి 80 టన్నులు మించి లోడింగ్‌ చేసి రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాల ముందు ఒక వ్యక్తి పైలట్‌గా వ్యవహరిస్తూ అడ్డగించిన వారికి మామూళ్లు ఇస్తూ నక్కపల్లి నుంచి తుని దాటేవరకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల సిబ్బందితో పాటు, ఒక ఎలక్ట్రానిక్‌ మీడియాపేరు చెప్పుకుంటున్న ఒక వ్యక్తి కూడా లారీల రాకపోకలకు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాహనం ముందు పైలట్‌గా వెళ్లి ఒక్కో లారీకి వెయ్యిరూపాయలు వసూలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

టోల్‌ఫీజు ఎగ్గొట్టేందుకు...

తుని దాటిన తర్వాత వేంపాడు సమీపంలో ఉన్న టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగిస్తే అక్కడ సామర్ధ్యాన్ని తనిఖీ చేసి 40 టన్నులకు మించితే రూ.4వేలు అదనంగా పెనాల్టీ విధిస్తున్నారు. అలాగే మైనింగ్‌, పోలీసు అధికారులు కూడా ఈ వాహనాలను తనిఖీ చేసి రూ.7వేల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. కానీ టోల్‌ఫీజు ఎగ్టొట్టేందుకు లారీ యజమానులు వేంపాడు నుంచి అమలాపురం, కాగిత మీదుగా నిర్మాణంలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ రోడ్డుకు చేరుకుని అక్కడనుంచి రాంబిల్లి వెళ్తున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో ఇవే లారీలు పరవాడ వద్ద ఉన్న హిందూజా పవర్‌ప్లాంట్‌ నుంచి ఫ్లైయాష్‌ను లోడింగ్‌ చేసుకుని సామర్లకోటకు రవాణా చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా వీరు టోల్‌ఫీజు ఎగ్గొట్టేందుకు కాగిత అమలాపురం, వేంపాడు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వాహనాలు రెండు వైపులా రాకపోకల సందర్భంగా 8 వేల రూపాయలు టోల్‌గేట్‌ వద్ద పెనాల్టీ ఎగ్గొట్టేస్తున్నారు. అలాగే ఈ వాహనాలను తనిఖీ చేస్తే ఒక్కో వాహనం నుంచి మరో 15 వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇలా ప్రతిరోజు సుమారు 50 నుంచి 80 లారీలు రౌతులపూడి రాంబిల్లి, సామర్లకోట వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై పోలీసు, మైనింగ్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా మంగళవారం రాత్రి రెండు లారీలను పెట్రోలింగ్‌ చేసే సిబ్బంది పట్టుకున్నారు. వీటిని నక్కపల్లి తరలించారు. ఉదయం వరకు వీటిని నక్కపల్లి బస్టాండ్‌లో ఉంచి మధ్యాహ్నం విడిచిపెట్టారు. ఈ వాహనాలు యథావిధిగా టోల్‌ఫీజు ఎగ్టొట్టేందుకు కాగిత సమీపంలో నిర్మాణంలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ రోడ్డుమీదుగా రాకపోకలు సాగించాయి.

రోడ్లు శిథిలం..

వేంపాడు, అమలాపురం మీదుగా ఈ భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల ఆయా గ్రామాల్లో రాకపోకల కోసం నిర్మించిన రోడ్లు శిథిలమవుతున్నాయి. దీనికితోడు ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో, లారీ అదుపు తప్పి బోల్తాపడితే ఏం జరుగుతుందోనని రోడ్డుపక్కన నివసించే వారు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నారు.

ఈ వ్యవహారంపై నక్కపల్లి సీఐ జె.మురళి వద్ద ప్రస్తావించగా నైట్‌ డ్యూటీ చేసే సిబ్బంది ఈ వాహనాలను పట్టుకున్నట్టు తెలిపారు. రికార్డులు పరిశీలించి సక్రమంగా ఉన్నందున విడుదల చేయడం జరిగిందన్నారు.

నిర్మాణంలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ రోడ్డులో రాకపోకలు

కాగా స్టీల్‌ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌పార్క్‌ కోసం కాగిత నుంచి చందనాడ వరకు రూ.24 కోట్లతో ఆర్‌అండ్‌బీ వారు 80 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు నిర్మిస్తున్నారు. రైతుల నుంచి 60 ఎకరాలను సేకరించి నిర్మాణపు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎర్త్‌ వర్క్‌ జరుగుతోంది. గ్రావెల్‌ వేసి రోడ్డు చదును చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ రోడ్డులో నుంచి ఈ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా చేయడం చట్టవిరుద్ధం అయినప్పటికీ రోడ్డుపనులు చేస్తున్న కాంట్రాక్టరు గాని, పర్యవేక్షిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులు గాని పట్టించుకోవడం లేదు. వాహనదారుల నుంచి ప్రతిరోజు మామూళ్లు అందడం వల్లే ఈ వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేయడం లేదని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు.

ఓవర్‌ లోడ్‌ లారీలకు అధికారుల

అండదండలు

అక్రమ మార్గాలకు లైన్‌క్లియర్‌

ప్రభుత్వాదాయానికి గండి

పట్టుకున్నా కేసుల్లేకుండా వదిలేస్తున్న వైనం

టోల్‌ఫీజు ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిన

రాకపోకలు

నిర్మాణంలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ రోడ్డులో ప్రయాణం

మా దారి... అడ్డదారి!1
1/1

మా దారి... అడ్డదారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement