ఇంటి పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి
గుడివాడ ఆక్వా పరిశ్రమ యజమానులతో మాట్లాడుతున్న డీపీవో మూర్తి
ఎస్.రాయవరం: ఇంటిపన్ను చెల్లించని మొండి బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీవో ఎస్.ఎస్.ఎన్. మూర్తి ఆదేశించారు.మండలంలో తిమ్మాపురం,కొరుప్రోలు,గుడివాడ, పెదగుమ్ములూరు, ఎస్.రాయవరం పంచాయతీల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఇంటిపన్ను వసూళ్లకు చివరి రోజు కావడంతో డీపీవో ఆయా గ్రామాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఇంటిపన్ను, పరిశ్రమల ట్యాక్స్ చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుడివాడలో రొయ్యల పరిశ్రమల యజమానులతో మాట్లాడి, బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


