అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపునేతలు | - | Sakshi
Sakshi News home page

అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపునేతలు

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపునేతలు

అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపునేతలు

రేపు విశాఖ, అనకాపల్లి నుంచి వందకు పైగా కార్లతో

ర్యాలీగా వెళ్లేందుకు సన్నాహం

రింగురోడ్డు పార్టీ కార్యాలయంలో సమావేశమైన కాపు నేతలు

హాజరైన మాజీ మంత్రి అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ తదితరులు

సాక్షి, అనకాపల్లి : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్‌ చేయడమే కాకుండా ఆయన ఇంటిపై టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడులు చేయించారని కాపునేతలు మండిపడ్డారు. గుంటూరులోని సిద్ధార్థనగర్‌లో అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించినా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రే పోషించారే తప్ప నిలువరించలేదని విమర్శించారు. టీడీపీ రౌడీమూకల దాడిలో ఽకాపు నేత అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా కారు అద్దాలు పగలుగొట్టి, కారును కాల్చివేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కాపు నేతలు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. విశాఖ నుంచి వందకు పైగా కార్ల ర్యాలీగా గుంటూరుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అనకాపల్లి టౌన్‌లో రింగురోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించి ధైర్యం కల్పించేందుకు పార్టీలకతీతంగా కాపునేతలు సమాయత్తమవుతున్నారు.

పథకం ప్రకారమే కాపునేతలపై దాడులు...

కాపు నేత అంబటి రాంబాబుపై పథకం ప్రకారమే టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని కాపునేతలు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని, దీనిని టార్గెట్‌ పెట్టుకుని దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. దీనిపై శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నాడు కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని, అదే రీతిలో ఇపుడు వంగవీటి రంగా శిష్యుడుగా పేరున్న అంబటి రాంబాబును, ఆయన కుటుంబాన్ని హతమార్చాలని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి అంబటి కుటుంబానికి అండగా నిలబడి ధైర్యం కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, బాణాల శ్రీనివాసరావు, కాపు నేతలు వీసం రామకృష్ణ, మలసాల రమణారావు, జాజులు రమేష్‌, దొండా రాంబాబు, మలసాల కిశోర్‌, ఏడువాక సత్యారావు, కలగా గున్నయ్యనాయడు, ఎ.వి. రత్నకుమారితో పాటు పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement