ఫాగింగ్‌ ముసుగులో ఫుడ్‌ పాయిజన్‌? | - | Sakshi
Sakshi News home page

ఫాగింగ్‌ ముసుగులో ఫుడ్‌ పాయిజన్‌?

Feb 10 2026 7:35 AM | Updated on Feb 10 2026 7:35 AM

ఫాగింగ్‌ ముసుగులో ఫుడ్‌ పాయిజన్‌?

ఫాగింగ్‌ ముసుగులో ఫుడ్‌ పాయిజన్‌?

● విద్యార్థుల అస్వస్థతపై అనుమానాలు ● తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నమా? ● అధికారుల చర్యలపై తల్లిదండ్రుల ఆగ్రహం

కొమ్మాది(విశాఖ): స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయలో 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ప్రస్తుతం పెను వివాదంగా మారింది. పాఠశాల యాజమాన్యం చెబుతున్న కారణాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వెల్లువెత్తుతున్న అనుమానాలు

పాఠశాలలో ఫాగింగ్‌ చేయడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం బుకాయిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది ఫుడ్‌ పాయిజన్‌ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటనలో వెలుగు చూసిన అంశాలు ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. ఫాగింగ్‌ వల్లే అనారోగ్యం కలిగితే, మరి నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని, మురుగు పేరుకుపోయిన డ్రైనేజీలు, అపరిశుభ్రమైన వాటర్‌ ట్యాంకులు దేనికి సంకేతమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులు

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాఠశాల వంటగదిని పరిశీలించినప్పుడు అక్కడ నిల్వ ఉంచిన మొలకెత్తిన బంగాళదుంపలు, వాడిపోయిన కూరగాయలు కనిపించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చాటి చెబుతోంది. వారం రోజుల క్రితం కూరగాయలను వాడడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్నాక్స్‌గా ప్యాకేజీ ఫుడ్‌ తీసుకోవడం వల్లే వాంతులు, విరేచనాలు అయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పైగా చికిత్స అందించిన వైద్యులు కూడా ఇది ఫుడ్‌ పాయిజన్‌ అని ధ్రువీకరించడం గమనార్హం.

యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం

ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే నెపంతో ఫుడ్‌ పాయిజన్‌ను ఫాగింగ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక విద్యార్థికి మలేరియా సోకడం అక్కడ పారిశుధ్య లోపానికి నిదర్శనం. ఇంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం పత్రికా సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

చర్యలకు డిమాండ్‌

పాఠశాల నిర్వహణ లోపం వల్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు విమర్శించారు. కలెక్టర్‌ ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement