పంచదార్ల దళిత రైతుల నిరసన ఉధృతం
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లలో దళితులు కొద్ది రోజులుగా చేపడుతున్న నిరసనను మరింత ఉధృతం చేశారు. యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 17 మంది దళితులకు ఇచ్చిన డీ పట్టా భూముల్ని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తీసుకునేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ దళిత కుటుంబాలు నిరసన తెలుపుతూ దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం దళితులు వంటా వార్పు నిర్వహించారు. అదే సమయంలో సర్వే నంబర్ 3లో పొక్లెయిన్‌తో మట్టిని పెకిలిస్తూ సర్వే నంబర్ 2లోకి నెట్టివేయడాన్ని చూసిన నిరసనకారులు అభ్యంతరం చెప్పారు. తమ భూములకు పరిహారం లేదా ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇవ్వాలని తెలిపారు. ఆయా భూముల్లో దళితులు ప్రస్తుతం సాగులో లేరని, ఆ ప్రాంతంలో అక్ర మ మైనింగ్ చేపట్టారంటూ అధికారుల ద్వారా నోటీసులు ఇవ్వడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. డీ పట్టా భూములిచ్చి ఐదు దశాబ్దాలు కావడంతో లబ్ధిదారుల వారసులు సైతం ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని దళిత రైతులు చెబుతున్నారు. స్థానిక టీడీపీ నేత చెప్పినట్టే అధికారులు వ్యవహరించడం సమంజసం కాదని వాపోతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే 42 ఎకరాల దళితుల డీ పట్టా భూముల వ్యవహారం రోజుకి రోజుకి దుమారాన్ని రేపుతోంది.


