రూ.2కోట్లే!
రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రం
ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ
● విశాఖ మెట్రోకు విజయవాడ లింక్.. పనులపై నీలినీడలు
● ఏయూ, సాగునీటి ప్రాజెక్టులపైనా చిన్నచూపు
● తాండవ ఎత్తిపోతలకు చెక్.. నిర్వహణకే పరిమితం
● విశాఖ–చైన్నె కారిడార్ భారం జీవీఎంసీపైనే
● అరకు కాఫీపై అదే పాత పాట
అనకాపల్లి జిల్లాకు నిరాశే మిగిల్చింది
2026–27 వార్షిక బడ్జెట్ అనకాపల్లి జిల్లా ప్రజలను, నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్‌గా పేరుగాంచిన అనకాపల్లి జిల్లాకు ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపడం విచారకరం. ముఖ్యంగా ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం ఊసే లేదు. తాడి, మూలస్వయంభూవరం గ్రామాల తరలింపు కోసం నిధులు కేటాయిస్తారని కొండంత ఆశతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. పర్యావరణానికి నష్టం కలిగించే కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– గనిశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
భారీ బడ్జెట్ లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విశాఖ నగర అభివృద్ధికి విదిల్చిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ. 2 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో విశాఖ నగరానికి దక్కింది 0.000006 శాతం మాత్రమే. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా.. మరోవైపు విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్ పనుల భారాన్ని జీవీఎంసీపై మోపింది. ఇందుకోసం జీవీఎంసీ ఖజానా నుంచి రూ.22.28 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు.. ఇంకా ఆమోదం లభించని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులను కేటాయించింది. దీనిని బట్టి విజయవాడ మెట్రో పనులు మొదలయ్యేదాకా విశాఖలో పనులు మొదలుపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్లయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తాండవ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. కేవలం ప్రాజెక్టు నిర్వహణ కోసం మాత్రమే తూతూమంత్రంగా నిధులను కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 605 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా.. ఆచరణలో ఈ నిధుల్లో అత్యధిక భాగం కేవలం పునరావాసం, జీత భత్యాలకే సరిపోనున్నాయి. మరోవైపు ఏజెన్సీపై అదే వివక్షను కొనసాగించింది. గత ఏడాది చెప్పినట్టుగానే ఈ సారి కూడా 25 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.16 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో చూపారు.
నగర అభివృద్ధిపై శ్రద్ధ ఏదీ?
రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం పదే పదే వల్లె వేస్తోంది. కానీ, నిధుల కేటాయింపు విషయానికి వచ్చే సరికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడుతోంది. తాజాగా విజయవాడ, విశాఖ మెట్రోలకు కలిపి బడ్జెట్‌లో కేవలం రూ.15.50 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇంకా ఆమోదం కూడా లభించలేదు. కానీ, ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు ప్రత్యేక కేటాయింపులు జరపకుండా.. అనుమతులు లేని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులు విదిల్చడం విశాఖపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేదాకా విశాఖ మెట్రో పనుల్లో కదలిక ఉండదనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. సిటీస్ ప్రాజెక్టు కింద ఒక కోటి రూపాయలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మరో కోటి రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. నగర అభివృద్ధి కోసం ఇలా కేవలం రూ.2 కోట్లు విదిల్చిన ప్రభుత్వం.. మరో చేత్తో ఏకంగా రూ. 22 కోట్లకు పైగా నిధులను కాజేస్తోంది. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్‌లో పలు అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీ నిధులపై ప్రభుత్వం కన్నేసింది. ఈ పనుల కోసం ఏకంగా రూ. 22.28 కోట్లు జీవీఎంసీ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కంటే జీవీఎంసీపై పడుతున్న అదనపు భారమే ఎక్కువగా ఉండటం గమనార్హం.
‘సూపర్ సిక్స్’జాడేది?
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించిన ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. యువతకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందించే పథకానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మరోవైపు గ్యాస్ రాయితీ కింద ఇవ్వాల్సిన మొత్తానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్‌లో చూపించడం గమనార్హం. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం ద్వారా, పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరికొన్ని అరకొర కేటాయింపులివే...
● విశాఖ, తిరుపతి జూ పార్కులకు కలిపి బడ్జెట్‌లో కేవలం రూ. 3.30కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన విశాఖ జూ పార్కు వాటా రూ.1.65 కోట్లకు పరిమితమైనట్లేనని స్పష్టమవుతోంది.
● విశాఖపట్నం, కడప జిల్లాలోని ఉన్న మానసిక ఆసుపత్రులకు రూ.13 కోట్లను కేటాయింపులు జరిగాయి. ఇందులో విశాఖ మానసిక ఆసుపత్రికి సగటున రూ. 6.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చే నిధులు కావడం గమనార్హం.
● తొట్లకొండ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రేహౌండ్స్ భవనాలకు రూ. 3 కోట్లు, విశాఖలోని గ్రేహౌండ్స్ రీజనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ. 3 కోట్లు కేటాయించారు. పీఎంపాలెంలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి రూ. 3.5 కోట్లు కేటాయించారు.
● విచిత్రమేమిటంటే... విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనంతో పాటు... ఆరిలోవ ఏసీపీ కార్యాలయం, మహారాణిపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1.5 కోట్లు విదిల్చారు. మొత్తంగా నగరాభివృద్ధితో పాటు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ అరకొర కేటాయింపులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖకు విదిల్చింది..
ఉపాధి కార్మికులకు నష్టమే
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జీరాంజీ పథకానికి రూ.8,365 కోట్లు మాత్రమే కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు రూ.12 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 66 లక్షల మందికి 125 రోజులు పనిక ల్పించాలంటే రూ.31,680 కోట్లు అవసరమవుతాయి. మిగిలిన రూ.11 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించలేకపోవడం వల్ల ఉపాధి కూలీల పనిదినాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంత వలసల నివారణకు తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఉత్తరాంధ్ర స్రవంతి ప్రాజెక్ట్ ప్రభుత్వాల నిర్లక్య్యాని గురవుతోంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.
– రాజాన దొరబాబు,
సీపీఐ జిల్లా కార్యదర్శి, అనకాపల్లి
భృతి లేదు, భర్తీ లేదు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నిరుద్యోగ భృతి, ఉద్యోగల భర్తీ ఊసే ఎత్తడం లేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతిగా రూ.3వేలు అందిస్తామని, జాబ్ కాలెండర్ కూడా విడుదల చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. ఈ సారి బడ్జెట్‌లో కూడా నిరుద్యోగ భృతికి పైసా కూడా కేటాయించకుండా నమ్మక ద్రోహం చేశారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతూ విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో కోచింగ్ ఫీజులు, పుస్తకాలు, ప్రయాణ ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారింది. కుటుంబాలపై ఆధారపడుతూ జీవనం సాగించడం అవమానంగా అనిపిస్తోంది. ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం ఇచ్చే భృతి అయినా వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నామాకు నిరాశే ఎదురైంది.
–నందవరపు సాయి, నిరుద్యోగి, రేబాక గ్రామం
నిరాశాజనకంగా బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని బడ్జెట్‌లో పేర్కొనడం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే. డయాఫ్రమ్ వాల్ సమస్యలు, నిర్వాసితుల పరిహారం తేలకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. విదేశాల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చి కడుతూ..దానికి స్వయం సమృద్ధి అని రంగు పూయడం మసిపూసి మారేడు కాయ చేయడమే. సూపర్ సిక్స్ హామీలు అమలుకు నిధులు కేటాయింపులో సర్కార్ విఫలమైంది.
– కె.శివనారాయణరాజు, పన్ను చెల్లింపుదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి, నర్సీపట్నం
చెరకు రైతులకు బడ్జెట్‌లో మొండి చెయ్యి
గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంతోపాటు, చెరకు రైతులకు , కార్మికులకు రూ. 28కోట్లు బకాయిలు చెల్లింపునకు సంబంధించి బడ్జెట్‌లో ఎక్కడా కేటాయింపులు చేయలేదు. కార్మికులు, చెరకు రైతులు కలిసి బకాయిల కోసం ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక దీక్షలు చేస్తే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యే వచ్చి బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం పెద్దలతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్‌లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. చెరకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది.
–వి.వి. శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, చోడవరం
నెలకు రూ.1500 ఏవీ?
చంద్రబాబు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు.అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఆ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు.బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే ఇకపై కూడా అమలు చేస్తారన్న నమ్మకం కూడా కలగడం లేదు. మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి ఆ హామీని అటకెక్కించారు. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి.
– ధూళి అమ్మాజీ,ఎంపీటీసీ,పంచదార్ల
ఏయూపై అదే వివక్ష
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!
రూ.2కోట్లే!


