ఎల్‌కేజీ విద్యార్థులకు మోకాళ్ల శిక్ష!
● డీఈవోకు ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఫిర్యాదు
● విచారణకు ఆదేశం
యలమంచిలి రూరల్ : మండలంలోని ఏటికొప్పాకలో ఓ ప్రైవేటు స్కూల్ ఆవరణలో బుధవారం ఎల్‌కేజీ విద్యార్థులను ఎండలో మోకాళ్లపై నిలబెట్టి శిక్షించిన ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా నేతలు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా చిన్న పిల్లలకు కఠినమైన శిక్షలు విధిస్తూ, హింసిస్తున్నారని తెలియజేసేలా కొన్ని ఫోటోలను డీఈవోకు పంపించినట్టు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ తెలిపారు. విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా శిక్షించడంతో పాటు నిబంధనలు పాటించడం లేదన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా యలమంచిలి ఎంఈవో సూర్యప్రకాష్‌ను డీఈవో ఆదేశించారు. జిల్లాలో పలు ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, యాజమాన్యాలన్నీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేశారు. ఏటికొప్పాకలో చిన్నపిల్లలను శిక్షించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని బాలాజీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరపనున్నట్టు ఎంఈవో సూర్యప్రకాష్ తెలిపారు.


