ఇనాంచుతున్నారు
ఏళ్లుగా సమస్యను పరిష్కరించని అధికారులు
రైత్వారీ ఇనాం సాగు భూములకు పట్టాల కోసం రైతుల ఎదురుచూపు
ప్రభుత్వ పథకాలు వర్తించక ఇబ్బందులు
విక్రయించేందుకు అవకాశం లేక అవస్థలు
కె.కోటపాడు : మండలంలో చౌడువాడ, పాచిలవానిపాలెం గ్రామాలకు చెందిన 400 మంది రైతులు 270 ఎకరాలను సుమారు మూడు తరాలకు పైబడి సాగు చేసుకుంటున్నా పాసుపుస్తకాలు లేక వారికి ఎటువంటి హక్కులు, ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. పాచిలవానిపాలెంలో 140 ఎకరాలు, చౌడువాడలో 130 ఎకరాలు భూమిని సాగు చేస్తూ అన్నదాతలు జీవనం సాగిస్తున్నారు. 1959లో అప్పటి తహసీల్దార్ పాచిలవానిపాలెంను రైత్వారీ జమీందార్ గ్రామంగాను, భూములను రైత్వారీ ఇనాం భూములుగా గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు. దీంతో పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములు రైత్వారీ ఇనాం భూములగా గుర్తించి పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేయాల్సిందిగా 1989లో అప్పటి విశాఖపట్నం ఆర్డీవో కోర్టును రైతులు ఆశ్రయించారు. ఆర్డీవో భూముల పూర్తి రికార్డులను పరిశీలించి పాచిలవానిపాలెం గ్రామంలో గల భూములు ఎటువంటి ట్రస్టీకి చెందినవి కావని, రైత్వారీ ఇనాంభూములని తీర్పు ఇచ్చారు. ఆర్డీవో తీర్పును సవాల్ చేస్తూ చింతలపాటి బుచ్చి సీతయ్యమ్మ ట్రస్ట్‌కు చెందిన వారు డీఆర్వోను ఆశ్రయించారు. దీంతో పునర్విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోకు డీఆర్వో సూచించారు. దీంతో పాచిలవానిపాలెం గ్రామాలకు చెందిన సాగు రైతులు మళ్లీ 1989లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 1994లో రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 1998లో పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన 50 మంది రైతులకు సుమారు 20 ఎకరాల భూమికి అప్పటి తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు.
ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్న రైతులు
తరతరాలుగా రైత్వారీ ఇనాం భూములను సాగు చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు, పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సమయాల్లో ఈ భూములను విక్రయించలేకపోతున్నామని వాపోయారు. పంటల సాగుకు పెట్టుబడి కాలంలో ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, పీఎం కిసాన్ నగదును కూడా పొందలేకపోతున్నారు. ప్రకృతి విపత్తులు తలెత్తే సమయాల్లో పంటకు జరిగిన నష్టాన్ని అధికారులు గుర్తిస్తున్నా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేపోవడంతో పరిహారాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సాగులో ఉన్న రైతుల వివరాలను గుర్తించడంతో పాటు గతంలో గల రెవెన్యూ రికార్డులను పరిశీలించి, తమ పేరును పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేయాలని రెండు గ్రామాలకు చెందిన సాగుదారులైన 400 మంది రైతులు కోరుతున్నారు.
రీసర్వేలో రైతుల వివరాలను నమోదు చేయాలి
ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే లో పాచిలవానిపాలెం, చౌడువాడ గ్రామాలకు చెందిన రైతుల సాగులో ఉన్న రైత్వారీ ఇనాం భూములను గుర్తించాలి. రైతుల పేర్లను నమోదు చేసి వారి పేరున ఎల్‌పీ నంబర్లను మంజూరు చేయాలి. ఏపీ ఇనాం రద్దు చట్టం సెక్షన్ 7(1) కింద రైతుల సాగులో ఉన్న భూములకు రైత్వారీ పట్టాలను ఇప్పించాలి.
–రొంగలి సూర్యనారాయణ, రైతు, పాచిలవానిపాలెం.
టీడీపీ హయాంలో మార్పుతో ప్రయాసలు
పాచిలవానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో సాగు చేస్తున్న రైతుల భూ వివరాలు రికార్డుల్లో రైత్వారీ ఇనాం కింద నమోదై ఉండేవి. 2015లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మళ్లీ చింతలపాటి బుచ్చి సీతయ్యమ్మ ట్రస్ట్ పేరుతో సత్రం భూములుగా ఆన్‌లైన్‌లో మార్పు చేశారు. రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో పేరు మార్పు చేసే సమయంలో రైతులకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఎండోమెంట్ అధికారులు చెప్పినట్లుగా ఈ పక్రియను పూర్తి చేశారు. 1998లో పాచిలవానిపాలెంకు చెందిన సుమారు 50 మంది రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న భూములను కూడా సత్రం భూములుగా నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల రైతులు హైకోర్టు తీర్పు, సాగుదారులైన వారికి మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను చూపుతూ న్యాయం చేయాలని కోరుతున్నా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు.
ఇనాంచుతున్నారు
ఇనాంచుతున్నారు
ఇనాంచుతున్నారు


