సి,డి గ్రేడుల విద్యార్థులపైప్రత్యేక శ్రద్ధ అవసరం
యలమంచిలి రూరల్ : మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక పునశ్చరణ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం తనిఖీ చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెం, పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రైల్వేస్టేషన్ రోడ్డు ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణ తీరు,విద్యార్థుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులకు రోజువారీగా నిర్వహిస్తున్న పరీక్షలు, వారు సాధించిన మార్కులను పరిశీలించారు. సి,డి గ్రేడుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. సి,డి గ్రేడుల విద్యార్థుల కోసం రూపొందించిన 30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో జీఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలవుతున్న తీరును తనిఖీ చేశారు. అభ్యసనా సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలని సూచించారు. ఆయన వెంట యలమంచిలి ఉపవిద్యాశాఖాధికారి పి.అప్పారావు, ఎంఈవో సుసర్ల సూర్య ప్రకాష్, వెంకటేశ్వర్రావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


