గ్యాస్ డెలివరీకి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
దేవరాపల్లి: గ్రామాల్లో గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కి.మీ పరిధి వరకు ఉచితంగా సరఫరా చేయాలని, ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీల్లేదని జిల్లా పౌర సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. దేవరాపల్లి రైవాడ అతిథి గృహ ఆవరణలో గురువారం జరిగిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ. 4500 విలువ చేసే గ్యాస్ కనెక్షన్‌ను అందజేస్తున్నామన్నారు. ఈ గ్యాస్ కనెక్షన్‌తో స్టౌ, సిలిండర్, రెగ్యులేటర్, ధృవపత్రం తదితర సామగ్రిని అందజేస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో నిర్ణీత ధర కంటే మండల కేంద్రంలోనే రశీదుపై ధర కంటే ఎక్కువగా సొమ్ము తీసుకుంటున్నారని డీఎస్‌వో వద్ద స్థానిక విలేకరులు ప్రస్తావించగా,. దీనిపై డీఎస్‌వో మూర్తి స్పందిస్తూ గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి 15 కిలోమీటర్ల పరిధి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేసి నిర్ధారణ అయితే నివేదికను సదరు ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సైతం పంపిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధి దారులు తక్షణమే ఆన్‌లైన్ రశీదు తీసుకుని, రశీదులో ఉన్న సొమ్ము మాత్రమే చెల్లించాలని సూచించారు. ఆయన వెంట సీఎస్‌డీటీ కె.రవి పాల్గొన్నారు.


