మార్చి చివరికల్లా కేజీబీవీల్లో భవన నిర్మాణాలు పూర్తి
రూ.21.52 కోట్లతో కేజీబీవీల్లో డార్మిటరీల నిర్మాణం
రూ.12.52 కోట్లతో పాఠశాలల్లో
అభివృద్ధి పనులు
సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ వెల్లడి
దేవరాపల్లి: దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ. 2.05 కోట్ల సమగ్ర శిక్ష నిధులతో నిర్మిస్తున్న టైప్–4 కేజీబీవీ భవన నిర్మాణాన్ని మార్చి నెలాఖరుకు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ వెల్లడించారు. మండల కేంద్రం దేవరాపల్లిలో టైప్–4 కేజీబీవీ భవన స్లాబ్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ రెండు అంతస్తుల భవన నిర్మాణం పూర్తయితే వంద మంది బాలికలకు సరిపడా తరగతి గదులు, డార్మిటరీ, భోజన శాల, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు సమకూరుతాయన్నారు. జిల్లాలో టైప్–4 కేజీబీవీలు గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లోను, మరొకటి దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 కేజీబీవీల్లో రూ. 21.52 కోట్ల వ్యయంతో డార్మిటరీలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 2025–2026 విద్యా సంవత్సరానికి సమగ్ర శిక్ష ద్వారా రూ. 12 కోట్ల వ్యయంతో పాఠశాల్లో ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల సదుపాయం, భవిత కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అలాగే పీఎంశ్రీ పథకం ఫేజ్–7 కింద ఆరు పాఠశాలల్లో రూ. 2.33 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట సమగ్ర శిక్ష ఏఈ సంతోష్ పాల్గొన్నారు.


