మైన్స్ చెక్‌పోస్టుల పేరిట అక్రమ వసూళ్లు
దేవరాపల్లి : గ్రామాలలో నిబంధలనకు విరుద్ధంగా మైన్స్ పేరిట ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు చెక్ పోస్టుల ద్వారా అక్రమ సీనరేజ్ వసూలు చేయడంపై స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి వాకపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వాకపల్లిలో సోమవారం జరిగిన నూతన భూమి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవి సమక్షంలో ఎమ్మెల్యే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాలలో ఏర్పాటు చేసిన మైన్స్ చెక్ పోస్టుల ద్వారా రైతులు తమ సొంత పంట పొలాలు చదును చేసుకునేందుకు మట్టి తీసుకుంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యం చేసి మరీ వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ డీఆర్‌సీలో సమస్య లేవనెత్తామన్నారు. చెక్ పోస్టులకు సంబంధించిన నిబంధనలను తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులకు సైతం తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌కు కోరామన్నారు.


