తీపి మాటలతో పీల్చి పిప్పి..!
ఎన్నికల ముందు ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక చెరకు రైతులను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మిగిలిన ఒకే ఒక సహకార చక్కెర కర్మాగారం...ఎంతో ఘన చరిత్ర కలిగి ఆధునికీకరణతో మరెన్నో మెట్లు ఎక్కాల్సిన సంస్థ... చంద్రబాబు ప్రభుత్వం నిరాదరణతో నేడు మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఏకై క గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని పూర్తిగా మూసివేసే దిశగా చాపకింద నీరులా ఈ ఏడాది క్రషింగ్ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు బకాయిల చెల్లింపుపైనా స్పష్టత ఇవ్వడం లేదు. గతేడాది సుమారు లక్షా 14 వేల టన్నులు క్రషింగ్ చేశారు. ఆ చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు. ఫ్యాక్టరీ కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదు. రైతులకు, కార్మికులకు కలిసి సుమారు రూ.32 కోట్లు తక్షణం చెల్లించాల్సి ఉంది.
● చెరకు రైతుల పాలిట శాపంగా చంద్రబాబు ప్రభుత్వం
● రాష్ట్రంలో మిగిలిన ఏకై క గోవాడ చక్కెర కర్మాగారం పరిస్థితి అధోగతి
● రెండు జిల్లాల్లో 25 వేల చెరకు రైతులతో చెలగాటం
● సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేసిన ఘనత చంద్రబాబుదే
సాక్షి, అనకాపల్లి:
గోవాడ చక్కెర కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడమే కాకుండా ప్రస్తుత సీజన్‌లో ఫ్యాక్టరీ పరిధిలోని చెరకును విజయనగరం జిల్లా సంకిలిలోని జీఎంఆర్ సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని గత నవంబర్ నెలలో చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకు బకాయిలను ఇంకా చెల్లించలేదు. ఇక్కడ నుంచి సంకిలికి చెరకు తరలించడానికి రవాణా చార్జీలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోగా, గత సీజన్‌లో ఫ్యాక్టరీకి తోలిన చెరకుకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమని రైతులు వాపోతున్నారు.
గత ప్రభుత్వంలో
రూ.89 కోట్ల బకాయిలు చెల్లింపు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికే 2013–19 మధ్యకాలంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సుమారు రూ.150 కోట్ల వరకు నష్టాల్లో ఉంది. ఆ సమయంలోనే టీడీపీకి చెందిన పాలకవర్గం కోట్లాది రూపాయలు అప్పులు చేసి నష్టాల్లోకి నెట్టింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని, రైతులను ఆదుకోవాలన్న ఆశయంతో ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చొప్పున సాయం చేసి ఐదేళ్లలో సుమారు రూ.89 కోట్ల మేర అందించింది. దీంతో ఫ్యాక్టరీ నష్టాల్లోంచి కొంత మేర గట్టెక్కడంతో పాటు రైతులకు చెరకు పేమెంట్లు, కార్మికులకు జీతాలు ఎక్కడా బకాయి లేకుండా ఐదేళ్లు క్రషింగ్ నిరాటంకంగా జరిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్లీ పరిస్థితి అధోగతిపాలైంది.
67 ఏళ్లలో ఏనాడూ క్రషింగ్ ఆగలేదు..
ఫ్యాక్టరీ ఆవిర్భవించాక గత 67 ఏళ్లలో ఏనాడూ క్రషింగ్ చేయకుండా లేదు. ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఏడాదిన్నర కాలంలో సాయం చేయకపోవడంతో చెరకు రైతులపైన, ఫ్యాక్టరీ మనుగడపైన ప్రస్తుత పాలకులకు ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది.
గత సెప్టెంబర్ 30వ తేదీన జరపాల్సిన ఫ్యాక్టరీ మహాజన సభను నిరవధికంగా ఆరునెలల పాటు వాయిదా వేసిన ప్రభుత్వం అక్టోబర్ 24వ తేదీన ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరకును విజయనగరం జిల్లా సంకిలిలోని ప్రైవేటు సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. చెరకు రవాణా ఖర్చులు 50 శాతం రైతులు పెట్టుకుంటే, 50 శాతం సంకిలి ఫ్యాక్టరీ భరిస్తుందని, రైతులు పెట్టుకున్న రవాణా సొమ్ము ప్రభుత్వం తరువాత చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాత బకాయిలు చెల్లించలేక ఈ ఏడాది క్రషింగ్ చేయకుండా ఫ్యాక్టరీని మూసేయాలని చూస్తున్న ప్రభుత్వం ఆ రవాణా ఖర్చు రైతులకు ఎలా తిరిగిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. గోవాడ ఫ్యాక్టరీలో ఒకసారి క్రషింగ్ ఆపేస్తే.. పునరుద్ధరణ అసాధ్యమని, ఫ్యాక్టరీని పూర్తిగా మూసేయడానికే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చెరకు రైతుల బకాయిలు రూ.28 కోట్లు..
గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో 2023–24, 2024–25 క్రషింగ్ సీజన్లకు సంబంధించి సభ్య రైతులకు చెరకు బకాయిలు రూ.28 కోట్లు, రవాణా చార్జీలు రూ.కోటి కలిపి సుమారు రూ.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక కార్మికులకు ఆరు నెలల వేతన బకాయిలు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి చెల్లించాల్సిన వివిధ రకాల ప్రయోజనాలు కలిపి సుమారు రూ.10 కోట్లు ఉంటాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీలో వున్న పంచదార, మొలాసిస్ నిల్వల విలువ రూ.6 కోట్లకు మించి ఉండదు.
చెరకు రైతులకు, ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిల చెల్లించాలంటే మరో రూ.35 కోట్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్కాబ్‌తో పాటు ఏ బ్యాంకు కూడా సుగర్ ఫ్యాక్టరీకి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక భారమంతా ప్రభుత్వంపైనే ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.
చెరకు రైతుల కంట నీరు
దేశ వ్యాప్తంగా సుగర్ ఫ్యాక్టరీలు పెరుగుతుంటే ఏపీలో మాత్రం ఉన్న సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయాయి. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గతంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా చెరకు సాగు చేసేవారు. ప్రస్తుతం 3 లక్షల ఎకరాలు కూడా చెరకు సాగు చేయలేని పరిస్థితులున్నాయి. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఒక లక్షా 30 వేల ఎకరాల్లో పండించే చెరకు సాగు ప్రస్తుతం 9 వేల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో మిగిలిన ఏకైక గోవాడ సుగర్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు హయాంలోనే క్రషింగ్ నిలిపివేయడం గమనార్హం. ఇంకా, రైతులు, కార్మికుల బకాయిలు ఇవ్వలేదు. రెండు జిల్లాల్లో రైతులు 25 వేల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రైతుల కంట నీళ్లొస్తున్నాయి. – కర్రి అప్పారావు,
చెరకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
బాబు పాలనలోనే ఫ్యాక్టరీలకు ఉరి
‘‘ఎన్నికల ముందు ఆదుకుంటామని తీపి మాటలు చెప్పి.. తీరా గద్దె నెక్కాక చక్కెర కర్మాగారాలను పీల్చి పిప్పి చేసి మూసివేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ చక్కెర సహకార ఫ్యాక్టరీలన్నీ నిర్వీర్యం చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు(1995–2004) హయాంలో 6 సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మూతపడిన అనకాపల్లి(తుమ్మపాల), చిత్తూరు, తెనాలి, కడప(ఎన్‌వీఆర్ జంపనీ), అదిలాబాద్, రేణుగుంట సహకార చక్కెర కర్మాగారాలకు నాడు మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చి రాగానే అన్నింటిని పునరుద్ధరించారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10 సుగర్ ఫ్యాక్టరీలు( చిత్తూరు–2, అనకాపల్లి–3, నెల్లూరు–1, పశ్చిమ గోదావరి–2, విజయనగరం–1, కడప–1 సహకార చక్కెర ఫ్యాక్టరీలు) మూతపడ్డాయి. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ హయాంలో కడప, చిత్తూరు తెరవడంతో పాటు ఏటికొప్పాక, తాండవ, గోవాడ, అనకాపల్లి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు రూ.89 కోట్లు విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో మిగిలిన ఏకైక గోవాడ చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోయింది.
చక్కెరకు
‘సహకారం’ లేనట్టే..!
తీపి మాటలతో పీల్చి పిప్పి..!
తీపి మాటలతో పీల్చి పిప్పి..!
తీపి మాటలతో పీల్చి పిప్పి..!
తీపి మాటలతో పీల్చి పిప్పి..!


