రోజ్‌వుడ్‌పై గొడ్డలి వేటు
స్మగ్లర్లకు కల్పతరువులా మారిన వైనం
సీలేరు నుంచి నర్సీపట్నం మీదుగా అక్రమ రవాణా
కొరవడిన నిఘా
సరిహద్దులు దాటుతున్న
రోజ్‌వుడ్ గృహోపకరణాలు
నర్సీపట్నం : అల్లూరి జిల్లా, సీలేరు నుంచి రోజ్‌వుడ్ ఫర్నిచర్ అక్రమ రవాణా నర్సీపట్నం మీదుగా జరుగుతోంది. అటవీ అధికారుల అండతో స్మగ్లర్లు రోజ్‌వుడ్ కలపను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజ్‌వుడ్ గృహోపకరణాల తయారీకి సీలేరు కేంద్రంగా మారింది. ఖరీదు ఎంతైనా రోజ్‌వుడ్ ఫర్నిచర్‌ను కొనేందుకు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్మగ్లర్లకు రోజ్‌వుడ్ అక్రమ రవాణా కల్పతరవుగా మారింది. రాష్ట్రంలో రోజ్‌వుడ్ అంతరించిపోయిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వివిధ రకాల రోజ్‌వుడ్ ఫర్నిచర్ సీలేరులో లభిస్తోంది. చింతపల్లి, సీలేరు, జీకే.వీధి అడవుల్లో అంతంత మాత్రంగా ఉన్న రోజ్‌వుడ్ స్మగ్లర్ల కాసుల కక్కుర్తితో కరిగిపోతోంది. నర్సీపట్నం మీదుగా అక్రమ రవాణా సాగుతుండడంతో నర్సీపట్నం అటవీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఇటీవల కారులో తరలిస్తున్న రోజ్‌వుడ్ ఫర్నిచర్‌ను ఏటిగైరంపేట చెక్‌పోస్టు వద్ద డీఎఫ్‌వో శామ్యూల్ ఆదేశాలతో రేంజర్ రాజేష్ పట్టుకుని కేసు నమోదు చేశారు.
సీలేరు కేంద్రంగానే...
సీలేరు కేంద్రంగా రోజ్‌వుడ్ పరిశ్రమ నడుస్తోంది. డబుల్‌కాట్, సింగిల్ కాట్, టీపై, కుర్చీలు వంటి ఫర్నిచర్ ఇక్కడ సిద్ధమవుతోంది. వీటిలో డబుల్‌కాట్‌కు మంచి గిరాకీ ఉంది. ఏజెన్సీలో పని చేస్తున్న అధికారులు వారి సొంతానికి, బంధువులకు రోజ్‌వుడ్ ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తున్నారు. సీలేరు నుంచి డబుల్‌కాట్ మంచం తీసుకురావాలంటే సీపీజి రూపంలో ప్రభుత్వానికి రూ.18 వేలు చెల్లించాల్సి ఉంది. స్మగ్లర్లకు, అధికారుల నడుమ లాలూచితో 4 నుంచి 5 మంచాలు తీసుకువెళ్లినా ఒక మంచానికే సీపీజీ రాస్తున్నారు. మామూళ్ల మత్తులో అటవీ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీసుకువెళ్లేది రోజ్‌వుడ్ ఫర్నిచర్ అయినప్పటికీ మారుజాతి కలపగా రికార్డులో చూపుతున్నారు. సీలేరులో డబుల్‌కాట్ మంచం రూ.60 వేలు ఉంటుంది. అదే మంచం ఇతర జిల్లాలకు చేర్చాలంటే రూ.లక్షకు ఫైగా ఖర్చు అవుతుంది. లంబసింగి, డౌనూరు చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ రోజ్‌వుడ్ సరిహద్దులు దాటుతుంది. ఏజెన్సీ, నర్సీపట్నం అటవీ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఏజెన్సీ నుంచి రోజ్‌వుడ్ ఫర్నిచర్‌తో వచ్చే వాహనాలను పట్టుకుని కేసులు పెడుతున్నారు.
రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు..
రోజ్‌వుడ్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాం. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నర్సీపట్నం మీదుగా ఫర్నిచర్ తీసుకువెళ్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనిని నియంత్రించేందుకు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చాను. పక్కా సమాచారంతో పది రోజుల క్రితం విలువైన రోజ్‌వుడ్ ఫర్నిచర్‌ను సిబ్బంది పట్టుకున్నారు. ఏటిగైరంపేట చెక్‌పోస్ట్ వద్ద నిఘా మరింత పటిష్టం చేశాం. మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా అయితే మన రాష్ట్రంలో రోజ్‌వుడ్ అంతరించిపోయింది. సీలేరు సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం నుండి రోజ్‌వుడ్ తీసుకువస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
–ఎం.శామ్యూల్, జిల్లా అటవీశాఖ అధికారి, అనకాపల్లి
రోజ్‌వుడ్‌పై గొడ్డలి వేటు
రోజ్‌వుడ్‌పై గొడ్డలి వేటు


