వైభవంగా కేశవస్వామి పుష్పాంజలి సేవ
చోడవరం : కేశవస్వామివారి పుష్పాంజలి సేవ కనువిందుగా జరిగింది. వందలాద మంది భక్తులు స్వామివారి ఊంజల సేవలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన చోడవరం శ్రీ కేశవస్వామివారి 753వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. జనవరి 27వతేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి స్వామివారి పుష్పాంజలి సేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి,భూదేవి సమేతుడైన కేశస్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని రకరకాల పూలతో సర్వాంగసుందరంగా తయారు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఊయలలో శ్రీదేవి,భూదేవి, కేశవస్వామి ఉత్సవ మూర్తులను ఉంచి వేదపండితులు సీతారామాచార్యులు, రామకృష్ణచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఊంజల సేవ చేశారు. పూలు, రకరకాల పండ్లు, స్వీట్లుతో అంతా అలంకరించారు. భక్తులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి,భూదేవి సమేతుడైన కేశవస్వామివార్ల ఉత్సవ మూర్తులను చోడవరం పట్టణ పురవీధుల్లో వైభవంగా తిరువీధోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉపాధ్యాయుల శ్రీనివాస్, దేవదాయ శాఖ ఈవో సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.


