సీనరేజీ పేరిట దోపిడీ!
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనరేజీ వసూలు చేసే ప్రైవేట్ ఏజెన్సీ దోపిడీ మితిమీరిపోయింది. అడ్డూ అదుపూ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.అడిగినంత చెల్లించని వారిపై సిబ్బంది దౌర్జన్యానికి దిగుతున్నారు. సొంత అవసరాల కోసం సొంత పొలంలో మట్టిని తవ్వినా ప్రైవేట్ సంస్థ సిబ్బంది వదలడం లేదు. – నర్సీపట్నం
గొలుగొండ మండలం ఏటిగైరంపేట గ్రామానికి చెందిన రైతు పొలం వద్ద పశువుల షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం తన సొంత పొలంలోని మట్టిని ట్రాక్టర్లలో తీసుకువెళ్తున్నాడు.ఆ సమయంలో వచ్చిన కొంతమంది డబ్బులు కట్టకుండా ఎలా తీసుకెళతారని గద్దించి మరీ వసూలు చేశారు.
● నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగునాథునిపాలెంలో ఓ నిరుపేద ఇంటి నిర్మాణం చేపట్టాడు. ట్రాక్టరుతో మట్టి తీసుకువెళ్తున్నాడు. ఇంతలో కొంత మంది వచ్చి ట్రాక్టరును అడ్డగించారు. డబ్బులు కడితేనే కానీ కదలనివ్వబోమని భీష్మించారు. పోనీ కదాఅని సొమ్ము చెల్లిస్తే రసీదు ఇవ్వడం లేదు. డిజిటల్ చెల్లింపులకు ఒప్పుకోవడం లేదు. నగదు మాత్రమే చెల్లించాలంటూ గూండాల్లా వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనరేజీ వసూలు బాధ్యత తీసుకున్న ఏఎంఆర్ సంస్థ నిర్వాకమిది. కనీస నిబంధనలు పాటించకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. జిల్లాలో సీనరేజీ వసూలు బాధ్యత తీసుకున్న ఏఎంఆర్ అనే సంస్థ రెండేళ్లకు రూ.450 కోట్లు చెల్లించే విధంగా చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. చెల్లించిన మొత్తంతో పాటు లాభాలు దండుకోవడం కోసం సదరు సంస్థ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది.
అడిగినంత చెల్లించాల్సిందే...
ట్రాక్టర్ మట్టికి సీనరేజీ రూ.300లోపే చెల్లించాల్సి ఉంది. అయితే సిబ్బంది రూ.410పైగా వసూలు చేస్తున్నారు. 500 చదరపు అడుగులలోపు చేపట్టే ఇంటి నిర్మాణాలకు గ్రావెల్, మట్టి తరలించేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ నిబంధనను సదరు సంస్థ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు తమ సొంత పొలాల్లో మట్టి తవ్వుకున్నా సరే సీనరేజీ చెల్లించే వరకూ వేధిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకుంటోంది. మాఊళ్లలో మీ పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. అడ్డగోలు వసూళ్లపై నర్సీపట్నంలో ట్రాక్టర్ యజమానులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ సంస్థ సిబ్బంది తీరుపై గొలుగొండ మండలం, చీడి గుమ్మలలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించి, వ్యాపారం చేసే ట్రాక్ట ర్లు, లారీ యజమానుల నుంచి వసూలు చేస్తే ఫరవాలేదు కానీ..సొంత అవసరాల కోసం తీసు కెళ్తున్న సామాన్యుల నుంచి డబ్బులు గుంజడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రాక్టర్ల యజమానులు గృహస్థుల నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఇసుకతో పాటు గ్రావెల్‌కు అధిక మొత్తం చెల్లించాల్సి రావడంతో గృహాలు కట్టుకునేందుకు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన భూగర్భ గనులశాఖ మిన్నకుంటోంది. ఈ విషయమై మైనింగ్ ఏడీ శివాజీ స్పందిస్తూ అదనంగా వసూళ్లు చేస్తున్నట్టు తన దృష్టికి రాలేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సీనరేజీ కంటే అదనంగా చెల్లించవలసిన పనిలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు
దందా సాగిస్తున్న ప్రైవేటు సంస్థ సిబ్బంది
అడిగినంత చెల్లించకపోతే దౌర్జన్యం
సిబ్బంది తీరుపై జనం ఆగ్రహం


