రెవెన్యూ ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించండి
తుమ్మపాల: రెవెన్యూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. రీసర్వేపై వచ్చిన ఫిర్యాదులపై రీవెరిఫికేషను చేసి సరి చేయాలని, తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలను ప్రజలకు అందించాలన్నారు. రీసర్వే, పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, నీటితీరువా, సివిల్ సప్లయి తదితర పలు రెవెన్యూ అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీసర్వేలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రీ వెరిఫికేషను తరువాత పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం వివరాల్లో తప్పులు లేని పాసుపుస్తకాలను భూయజమానులకు అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పంపిన నివేదికలోని వివరాలను సరిచూసుకుని సంతృప్తి పొందిన తరువాత మాత్రమే తహసీల్దార్లు రిపోర్టు పంపించాలన్నారు. రీ–వెరిఫికేషన్ తరువాత భూ వివరాలు, పాసుపుస్తకాల్లో తప్పులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, వివరాలను పిర్యాదుదారునికి తెలియజేసి ఎండార్స్‌మెంట్ కాపీ అందజేయాలని సూచించారు. జిల్లాలో రీసర్వే పనులు షెడ్యూలు ప్రకారం పూర్తిచేయాలని, రీ సర్వే, భూమి వివరాలను భూయజమానులకు తప్పని సరిగా తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల వివరాలను తప్పని సరిగా రికార్డుల్లో నమోదుచేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ పూర్తిచేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి శతశాతం నీటి తీరువా వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సివిల్ సప్లయికి సంబంధించి డిజిటల్ కార్డులన్నింటిని పంపిణీ చేయాలని, రేషన్ షాపుల్లో నెలవారీ తనిఖీలు చేయాలని, దీపం పథకం నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సర్వే వేగవంతం
కుటుంబ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలను ఆదేశించారు. రెండు రోజుల్లో దీనిని పూర్తిచేయాలన్నారు. కుటుంబ సర్వే, అక్షర ఆంధ్ర, ఈపీటీఎస్ అప్లోడ్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువు లోపలే గృహ సర్వేను శత శాతం పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు 72 శాతం పూర్తయిందన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం క్రింద జిల్లాలో 89,944 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారందరినీ వలంటీర్లతో మ్యాప్ చేసి, అక్షరాస్యులుగా దిద్దే కార్యక్రమం వెంటనే చేపట్టాలని సూచించారు. మార్చిలో నిర్వహించే ప్రత్యేక పరీక్షకు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి నెలలో కనీసం 3 నుంచి 5 ఉద్యోగి సామర్థ్యం పెంచే కోర్సుల్లో ఐగాట్ కర్మ యోగి పోర్టల్ ద్వారా శిక్షణ పొందాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు శచీదేవి, పూర్ణిమదేవి, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ సమన్వయ అధికారి ఎస్.మంజుల వాణి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్


