కాసులిచ్చుకో!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
మీ ఊళ్లో బరి గీసుకోండి. ఊరికి మూడు కోళ్లు, రూ. 12 వేలు ఇవ్వండి! ఇదీ అనకాపల్లి జిల్లాలోని ఓ ఎస్‌ఐ సంక్రాంత్రి వసూళ్ల లెక్క!
భారీగా ‘బరి’లు గీసుకోండి. మందు, డ్యాన్సులు మీ ఇష్టం. స్థానిక ప్రజా ప్రతినిధులూ పాల్గొంటున్నారు కాబట్టి ఇబ్బందేమీ లేదు. గుండాట, లాటరీ బల్ల.. ఏ ఆటైనా మీ ఇష్టం. మా వాటా మాకిస్తే చాలు. ఇదీ అనకాపల్లి జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల కథ!
మీ ఊళ్లో ఉత్సవం ఉందా? కోడి పందాలు నిర్వహించుకోండి. మేమేమీ పట్టించుకోం!! ఇది మరో నియోజకవర్గంలో పరిస్థితి..
ఇలా అన్ని చోట్లా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహించుకుంటుంటే అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా చీడికాడలో కోడి పందాల నిర్వహణలో బరిలో నిలిచిన కోళ్లకు తగిలించిన కత్తి తగిలి ఏకంగా వడిసిలి అప్పలనాయుడు అనే వ్యక్తి చనిపోయారు. ఈ విషయం ఫిబ్రవరి 1వ తేదీన జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారనే ఆరోపణలున్నాయి. అయితే, ఈ విషయం కాస్తా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో భారీగా చేతులు తడిపిన పోలీసుల వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం.
గోదావరి జిల్లాలకు దీటుగా...!
గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ అధికార పార్టీ నేతల అండదండలతో భారీగా ‘బరి’లు రంగంలోకి వచ్చాయి. గతంలో సంక్రాంత్రి పందెం కోళ్ల బరిలను చూసేందుకు పక్కనే ఉన్న గోదావరి జిల్లాలకు వెళ్లేవారు. అయితే, ఈ దఫా మాత్రం అదే స్థాయిలో స్థానికంగానే నిర్వహించారు. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఓ రేంజ్‌లో పందాలు నిర్వహించారు. అలాగే పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో కూడా ఓ మోస్తరుగా పందెం బరిలు ఏర్పా టు చేసుకున్నారు. కోడి పందాలతో పాటు డ్యాన్సులూ హోరెత్తాయి. భారీగా మద్యం అమ్మకాలతో పాటు గుండాట, లాటరీ బల్ల ఆటలకూ స్టాళ్ల కేటాయింపులు జరిగాయి. ఒక్కో స్టాలుకు రూ.8 లక్షల చొప్పున వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల ఊపుతో ఇప్పుడు గ్రామాల్లో ఉత్సవాలకు కూడా కోడి పందాల జాడ్యం పాకడం గమనార్హం.
కాసుల రుచి మరిగి...
సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణతో భారీగా ఆదాయానికి అలవాటు పడిన పోలీసు, రెవెన్యూ వర్గాలు గ్రామీణ ఉత్సవాల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా చీడికాడలో నిర్వహించిన కోడి పందాలతో బరిలో ఉన్న కోళ్లకు కట్టిన కత్తి తెగి కాస్తా ఏకంగా ఒక వ్యక్తి మరణించాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదేవిధంగా చోడవరంలో కూడా తాజాగా బయటకు వచ్చిన డ్యాన్సుల వీడియో కూడా హల్‌చల్ చేసింది. అశ్లీల నృత్యాలు కాదంటూ స్థానిక నేత లు చెబుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ తరహాలో ఉత్సవాలను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. చీడికాడలో వ్యక్తి మృతిచెందిన వ్యవహారంలో ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు అందనప్పటికీ కోడి పందాలతోనే చనిపోయాడని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై బదిలీ వేటు పడింది. అంతేకాకుండా ఉత్సవాల పేరుతో పందాల నిర్వహణకు అనుమతించిన పోలీసులు, వారి వసూళ్లపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ నగర శివారులోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరిపై బదిలీ వేటు పడనుందనేది చూడాల్సి ఉంది.
చీడికాడ కోడిపందాల్లో కోడికత్తి తగిలి మృతి చెందిన అప్పలనాయుడు


