8న ఉక్కు నిర్వాసితుల భారీ బహిరంగ సభ
సీతంపేట: భూములిచ్చిన తమకు ఉద్యోగాలివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిచేయి చూపుతున్నాయని, దీనికి నిరసనగా ఈ నెల 8న గాజువాక లంక గ్రౌండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉక్కు నిర్వాసితుల ముఖ్య సలహాదారు వై.మహదేవ్ తెలిపారు. సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహదేవ్, సంఘం నాయకులు పితాని భాస్కరరావు మాట్లాడుతూ 26 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో మిగిలి ఉన్న 8,500 మంది నిర్వాసితులకు వెంటనే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన కూటమి నాయకులు నేడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు వంటి ప్రముఖులు హాజరవుతారని, నిర్వాసితులు తమ కుటుంబాలతో కలిసి భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


