హర్షించతగ్గ యోగాసనాలు
దేవరాపల్లి: రైవాడ బాలిక యోగా పోటీల్లో అద్భుత మే చేస్తోంది. సంగీతానికి అనుసంధానమైన యోగా భంగిమలను వేదికపై అవలీలగా ప్రదర్శిస్తోంది. శరీరాన్ని విల్లులా వంచి అత్యంత కష్టతరమైన యోగాసనాలను సైతం సునాయాసంగా వేస్తూ ఔరా అనిపిస్తోంది. బాలురకు తాను ఎక్కడా తీసిపోనంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ ల్లో పతకాలను కొల్లగొడుతోంది. ఇప్పటి వరకు 11 బంగారు, 4 వెండి, 4 కాంస్య పతకాలు సాధించడమే ఆమె ప్రతిభకు గీటు రాయిగా చెప్పవచ్చు.
కుటుంబ నేపధ్యం ఇలా....
రైవాడ గ్రామానికి చెందిన దుక్క రామకృష్ణ, దేముళ్లమ్మ దంపతుల రెండో సంతానం హర్షిత ఒకటి నుంచి 4వ తరగతి వరకు రైవాడ ప్రాథమిక పాఠశాలలో చదివింది. 5వ తరగతి నుంచి తానాం రెసిడెన్షియల్ స్కూల్‌లో చేరింది. ప్రస్తుతం అక్కడ 9వ తరగతి చదువుతోపాటు యోగాలో రాణిస్తోంది. ఐదో తరగతి నుంచి స్థానిక యోగా కోచ్ ఆంజనేయులు తర్ఫీదుతో యోగా సాధన ప్రారంభించింది. ఆర్టిస్టిక్స్ ఫెయిర్, రిథమిక్ ఫెయిర్, ట్రెడిషనల్ విభాగాల్లో తనదైన శైలిలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది.
అవలీలగా కష్టతరమైన యోగాసనాలు...
యోగాలో కష్టతరమైన కోకిలాసనం, వామదేవ త్రిపురాసనం, ద్విపాద కోకిలాసనం, ఓంకారసానం, విభక్త పాద శివలింగాకారసానం, డింబాసనం, మలయాసనం, పరివృత్త ఉపవిష్ఠ కోణాసన, సరసాసనం, వామనాసనం, వృశ్చికాసనం తదితర ఆసనాలను అవలీలగా ప్రదర్శిస్తూ అబ్బుర పరుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రముఖల నుంచి మెడల్స్, మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందుకుంటూ పలువురి మన్ననలు పొందింది.
సాధించిన విజయాలు ఇవే...
● నంద్యాలలో 2022లో జరిగిన 47వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో 12 ఏళ్ల లోపు వయసు విభాగంలో ప్రథమ స్థానం
● చోడవరంలో 2022 నవంబర్‌లో జరిగిన 35వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జూనియర్ గర్‌ల్స్ విభాగంలో ప్రథమ స్థానం
● పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 2023 నవంబర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో అండర్–14 యోగా ట్రెడిషనల్ విభాగంలో ప్రథమ స్థానం
● కర్నూల్‌లో 2024 అక్టోబర్‌లో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఆర్టిస్టిక్స్ ఫెయిర్ విభాగంలో సబ్ జూనియర్ గర్‌ల్స్‌లో ప్రథమ స్థానం
● అనంతపురం జిల్లాలో 2025 డిసెంబర్‌లో జరిగిన 6వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్‌లో ద్వితీయ స్థానం
● అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 డిసెంబర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ 66వ అంతర్ జిల్లాల యోగా చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం
● విశాఖపట్నంలో 2022 ఆగస్టులో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో 8 నుంచి 10 ఏళ్ల వయసు విభాగంలో ద్వితీయ స్థానం
● జాతీయ స్థాయిలో పశ్చిమబెంగాల్, అస్సాం, హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది.
‘యోగా’లో రైవాడ విద్యార్థిని అదుర్స్
అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం
తానాం రెసిడెన్షియల్ స్కూల్‌లోని యోగా గురువు ఆంజనేయులు నిత్యం రెండు గంటలపాటు యోగా శిక్షణిచ్చి, మెలకువలు నేర్పిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు ఉపాధ్యయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకా లు సాధించగలిగాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాను.
– దుక్క హర్షిత, విద్యార్థిని, రైవాడ
ఓంకారసానంలో హర్షిత
హర్షించతగ్గ యోగాసనాలు
హర్షించతగ్గ యోగాసనాలు
హర్షించతగ్గ యోగాసనాలు
హర్షించతగ్గ యోగాసనాలు
హర్షించతగ్గ యోగాసనాలు


