దేవరాపల్లి : రేషన్ డీలర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఆదాయ మార్గాలను చూపించ కుండా ప్రభుత్వం రేషన్ డీలర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని మండిపడ్డారు. డీలర్ల కమీషన్‌తో పనిలేకుండా గౌరవ వేతనం చెల్లించాలని గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. పౌర సరఫరాల శాఖలో ప్రక్షాళన పేరుతో డీలర్ల ఆదాయ మార్గాలను నియంత్రించి రేషన్ డీలర్లను దొంగలుగా చూపిస్తున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా రేషన్ షాపులను నమ్ముకొని బతుకుతున్న డీలర్ల ఆర్థిక పరిస్థితుల కోసం పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు. డీలర్లషిప్‌లను వదులుకోలేక, అప్పులు చేసి దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. గతంలో బియ్యం, కిరోసిన్, పంచదార, పప్పు ఇతర సరుకులు పంపిణీ చేసే వారని, ప్రస్తుతం బియ్యం, పంచదార తప్ప ఇతర సరుకులు పంపిణీ చేయడం లేదన్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ నుంచి కమీషన్ ద్వారా డీలర్లకు వచ్చే ఆదాయానికి గండిపడిందన్నారు. రాష్ట్రంలోని సుమారు 30 వేలకు పైబడి ఉన్న డీలర్లకు కనీస ఆదాయ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.


