వెంకన్న కల్యాణోత్సవాలకునేడే అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

వెంకన్న కల్యాణోత్సవాలకునేడే అంకురార్పణ

Feb 26 2026 7:42 AM | Updated on Feb 26 2026 7:42 AM

వెంకన

వెంకన్న కల్యాణోత్సవాలకునేడే అంకురార్పణ

ఉదయం పెండ్లి కావిడి ఊరేగింపు

రేపు రాత్రి కల్యాణం

ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ

నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. శుక్రవారం రాత్రి ఉపమాకలో గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణం ఘనంగా జరగనుంది. గురువారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కల్యాణోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. గురువారం ఉదయం స్వామివారి పెండ్లి కావిడెను ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ, కంకణధారణ, అంతరాలయ పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. తదుపరి సాయంత్రం అంకురార్పణ చేస్తారు. దీంతో స్వామివారి కల్యాణ ఉత్సవాలు ప్రారంభమైనట్లేనని ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్‌ తెలిపారు.

– శుక్రవారం ఉదయం ఉభయ దేవేరులను పెద్ద పల్లకిలో అధిష్టింపజేసి ఆలయంలోను, గ్రామంలోను అష్టదిక్పాలకు అవాహనం చేసిన తర్వాత ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి వేంకటేశ్వరస్వామిని ఇత్తడి గరుడ వాహనంపైన, ఉభయ దేవేరులను శేష వాహనంపైన ఉంచి ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద కన్యావాద సంవాదం(ఎదురు సన్నాహ మహోత్సవం) నిర్వహిస్తారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్‌ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎదురు సన్నాహ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం, అదే రోజు అర్ధరాత్రి కల్యాణం జరగనుంది.

ప్రత్యేక ఏర్పాట్లు : వేసవి కాలం సమీపించడం, ఎండ వేడిమి ప్రారంభం కావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెంకన్న కల్యాణం తిలకించడాన్ని ఉత్తరాంధ్రలో భక్తులు సెంటిమెంట్‌గా భావిస్తారు. స్వామివారిని ఉదయం దర్శించుకుని, రాత్రి కల్యాణం తిలకించి తిరుగు పయనమవ్వడం అనాధిగా వస్తోంది. ఆలయ రాజగోపురం ఎదురుగా భారీ స్థాయిలో జర్మన్‌ టెంట్లు, షెడ్లు వేశారు. మెట్ల మార్గం వద్ద రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో స్నానమాచరించే భక్తులు ప్రమాదానికి గురికాకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు. గర్భాలయం, బేడా మండపాల చుట్టు పెంటార్లు వేశారు. ధ్వజస్తంభం, రాజగోపురం ఎదురుగా అఖిలాండం నుంచి ప్రత్యేక ఇనుప గ్రిల్స్‌తో క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉపమాక పెద్ద చెరువు, మనబాన వానిపాలెం సెంటర్లలో ఏర్పాటు చేసిన స్వాగత ధ్వారాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్‌ కాంతులతో ఆలయ ప్రాంగణం కాంతులీనుతుంది. ఈ ఏడాది కల్యాణోత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది భక్తులు తరలివస్తారని పోలీసు శాఖ అంచనా వేసింది.

300 మందితో పోలీసు బందోబస్తు : జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు కల్యాణోత్సవాలకు సుమారు 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ మురళి తెలిపారు. సీఐలు, ఎస్‌ఐలతో పాటు,స్పెషల్‌ బ్రాంచి పోలీసులు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మఫ్టీలో సిబ్బంది భద్రత కోసం పని చేస్తారన్నారు. తిరువీధి సేవలు, తిరునాళ్లు జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్‌ కెమెరాల సాయంతో భద్రత పర్యవేక్షిస్తామన్నారు. మనబానవానిపాలెం, నక్కపల్లిలో పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు. ఉపమాక వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 27వ తేదీ ఉదయం నుంచి మద్యాహ్నం వరకు మాత్రమే ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతిస్తామని సీఐ చెప్పారు.

వెంకన్న కల్యాణోత్సవాలకునేడే అంకురార్పణ1
1/1

వెంకన్న కల్యాణోత్సవాలకునేడే అంకురార్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement