బాణసంచా కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు
తుమ్మపాల/అనకాపల్లి టౌన్: జిల్లాలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ఆదివారం పోలీసు, రెవెన్యూ, ఫైర్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. అనకాపల్లి మండలంలో కొప్పాక, రాజుపాలెం తదితర ప్రాంతాల్లో బాణసంచా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ ఆనందకుమార్, ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు, రూరల్ సీఐ జి.అశోక్ కుమార్, ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: ఎస్పీ
బాణసంచా తయారీలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్లు జరిగిన దృష్ట్యా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో ఆదివారం తనిఖీలు చేసినట్టు తెలిపారు. షెడ్లలో పరిమితికి మించి పేలుడు పదార్థాలు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, మిక్సింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్ ఎండబెట్టే విభాగాలు నిబంధనల ప్రకారం నిర్ణీత దూరంలో ఉన్నాయో లేదో పరిశీలించామని చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎర్తింగ్ తదితర సౌక ర్యాలు ఉన్నాయోలేదో పరిశీలించినట్టు తెలిపారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకా ర్మికులు ఉన్నారా తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. అగ్నిమాపక పరికరాల లభ్యత, ఎగ్జిట్ పాయింట్లు, పొగతాగడంపై నిషేధం వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా బాణసంచా తయారు చేసినా, నిల్వ ఉంచినా తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అన్ని పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, ఫైర్, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు.


