శరణం.. అమ్మ దివ్య చరణం
ఘనంగా మోదమ్మ పాదాలు తీర్థం
అమ్మా నీ పాద సన్నిధే భక్తుల పెన్నిధి..అది తెలిసిన వారి జన్మ ధన్యం అంటూ మోదమ్మ పాదాలను దర్శించుకుని జనం పరవశించిపోయారు.. కాపాడు తల్లీ అని వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో మోదమ్మ పాదాలు తీర్థం వైభవంగా జరిగింది. భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.
మాడుగుల: మండలంలోని ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు మోదకొండమ్మ పాదాలు తీర్థం ఆదివారం వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ప్రత్యేకంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో పాల్గొని, అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళల కోలాటాలు, నేలవేషాలు, తోడుపెద్దు ఉత్సవాలు, అమ్మవారి ప్రతిరూపమైన ఘటాల ఊరేగింపు తదితర కార్యక్రమాలతో ఉత్సవం కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణ సంచాకాల్చారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిలను వేర్వేరుగా ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఘన చరిత్ర ఉన్న చల్లని, మహిమ గల తల్లి మోదకొండమ్మ అని తెలిపారు.
ఆకట్టుకున్న గుర్రాల పరుగు పోటీ
ఉత్సవం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు పోటీ ఉత్సాహంగా సాగింది. ఈ పోటీల్లో 16 గుర్రాలు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కోట్ని సత్యనారాయణ, పుట్టా బలరామ్, పెచ్చేటి కొండలరావు, పెచ్చేటి నానాజీ, యన్నంశెట్టి వెంకటరమణ, కోట్ని శ్రీనివాసరావు, కరణం లింగరాజు, వై.సంతోష్ కుమార్, అద్దేపల్లి సత్యారావుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకటరాజారామ్, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ దేవరాపల్లి మండల అధ్యక్షుడు బూరే బాబూరావు, శేనాపతి గంగాధర్, శ్రీనాదు జగ్గారావు, మోదునాయుడు, దాసరి రాజు, కరణం రాము తదితరులు పాల్గొన్నారు.
శరణం.. అమ్మ దివ్య చరణం
శరణం.. అమ్మ దివ్య చరణం
శరణం.. అమ్మ దివ్య చరణం


