కొత్త జోన్.. బదిలీ టెన్షన్
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సిబ్బంది తరలింపు షురూ..
సీనియారిటీ పోతుందనే ఆందోళనలో ఉద్యోగులు
డివిజన్ల మార్పులతో 2,000 మందిపై ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో.. ఉద్యోగుల విభజన ప్రక్రియ సెగలా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల నుంచి ఉద్యోగుల బదిలీలను విశాఖ రైల్వే జోన్‌కు ప్రారంభించినా.. సీనియారిటీ కోల్పోతామనే ఆందోళన కొత్త చిచ్చు రేపుతోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు 259 అకౌంట్ పోస్టులు, 699 ఇతర విభాగాల పోస్టులను హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. అయితే.. బదిలీ అవుతున్న పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది, తమ సీనియారిటీతో పాటు సర్వీసుకు బ్రేక్ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో రైల్వే బోర్డు నాన్–గెజిటెడ్ ఉద్యోగుల కోసం ఒక సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్‌తో పాటు రాయగడ డివిజన్‌లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఆసక్తి ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు.. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్‌లో చేర్చారు. కొత్త జోన్ హెడ్‌క్వార్టర్స్‌లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్‌లో పనిచేసేందుకు ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. విశాఖ జోన్, రాయగడ డివిజన్ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్–గెజిటెడ్ ఉద్యోగులను కేడర్ వారీగా విభజించి కేటాయింపులు జరిపారు.
డివిజన్ల హద్దుల మార్పే అసలు సమస్యా?
కొత్త జోన్ ఏర్పాటుతో పలు రైల్వే సెక్షన్లు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు మారబోతున్నాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలోని 108 కి.మీ. పొడవున్న రాయచూర్–వాడి సెక్షన్ ఇకపై సికింద్రాబాద్ డివిజన్ కిందకు రానుంది. గుంటూరు డివిజన్ పరిధిలోని 142 కి.మీ. ఉన్న విష్ణుపురం–జానపాడు సెక్షన్ కూడా సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ కానుంది. సికింద్రాబాద్ డివిజన్‌లోని 46 కి.మీ. ఉన్న కొండపల్లి–మోటుమర్రి సెక్షన్ ఇప్పుడు విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. ఈ మార్పుల వల్ల దాదాపు 2,000 మంది సిబ్బంది ప్రభావితం కానున్నారు. వీరికి నచ్చిన రైల్వే జోన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాలని అధికారులు ఇప్పటికే ప్రతిపాదించినా.. సరిహద్దుల మార్పులతో తమ సీనియారిటీకి ఇబ్బందులొస్తాయన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
రివర్స్ ఆప్షన్ కోసం ఉద్యోగుల పట్టు
సూపర్‌వైజరీ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఈ, పీ.వే, టీఆర్‌డీ వంటి హోదాల్లో ఉన్న సుమారు 2,512 మంది సిబ్బంది భవిష్యత్తుపై ప్రస్తుతం స్పష్టత కరువైంది. ప్రధాన కార్యాలయం నియంత్రణలో ఉండే ఈ కేడర్ల ఉద్యోగులు, కొత్త జోన్‌కు వెళ్తే తమ సీనియారిటీ దెబ్బతింటుందని భయపడుతున్నారు. అలాగే నిర్మాణ విభాగంలో పని చేస్తున్న వారి పేర్లను ఎన్‌వోసీ జాబితాలో చేర్చకపోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బదిలీ అవుతున్న పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది తమ సీనియారిటీ, సర్వీసు ప్రయోజనాల దృష్ట్యా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జోన్ ప్రధాన కార్యాలయం పరిధిలో పని చేస్తున్న దాదాపు 279 మంది సిబ్బంది, తమను తిరిగి దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోనే కొనసాగించాలని ‘రివర్స్ ఆప్షన్’కోరుతున్నారు. వీరంతా ప్రస్తుతం కొత్త జోన్ పరిధిలోని డివిజన్ల కింద ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం పాత జోన్‌లోనే ఉండేలా అవకాశం కల్పించాలని కార్మిక సంఘాలు రైల్వే బోర్డును డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించి, ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు సైతం రైల్వే బోర్డుకు లేఖలు రాశారు. ఈ సమస్యలను పరిష్కరించి, ఉద్యోగులకు స్పష్టమైన హామీ వస్తే తప్ప.. సిబ్బంది విభజన ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం లేదని జోనల్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త జోన్.. బదిలీ టెన్షన్


