పాలిటెక్నిక్‌కు శాపం
ఈపీడీసీఎల్ నిర్లక్ష్యం...
ఆర్‌ఈసీఎస్ అనుబంధ కళాశాలపై శీతకన్ను
● రూ.కోట్ల ఆదాయం తీసుకుంటూ నిర్వహణ గాలికి..
● అఫిలియేషన్ ఫీజు చెల్లించకపోవడంతో ఆందోళన
● కళాశాల అనుమతిని విద్యాశాఖ రద్దు చేసే అవకాశాలు
● రోడ్డున పడనున్న 600 మంది విద్యార్థులు, 50 మంది ఉద్యోగులు
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు
సాక్షి, అనకాపల్లి: ఈపీడీసీఎల్‌లో గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(ఆర్‌ఈసీఎస్)ను విలీనం చేసిన తరువాత దానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి దయనీయంగా మారింది. దానిని పూర్తిగా గాలికి వదిలేశారు. ఆర్‌ఈఎస్‌కు గల వందల కోట్ల ఆస్తులు, భారీగా వస్తున్న ఆదాయాన్ని లాక్కొని అనాథగా వదిలేయడంతో ఉద్యోగులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల పాలిటెక్నిక్ కాలేజీ మనుగడే ప్రమాదంలో పడింది. జిల్లాలో ఐదు మండలాల పరిధిలో గల గ్రామాల్లో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాల నిమిత్తం 50 ఏళ్ల క్రితం ఆర్‌ఈసీఎస్ విద్యుత్ సరఫరా కార్యకలాపాలను ప్రారంభించింది. 2021 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆర్‌ఈసీఎస్ సంస్థ కార్యకలాపాలను ఈపీడీసీఎల్‌కు అప్పగిస్తూ ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. నాటి నుంచి ఆర్‌ఈసీఎస్ కార్యకలాపాలను, సంస్థ ఆస్తులను, కార్యాలయాలను, విద్యుత్ పంపిణీ వ్యవస్థను, ఆదాయాన్ని ఈపీడీసీఎల్ హస్తగతం చేసుకుంది. విలీన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకపోయినా..సంస్థ కార్యకలాపాల వరకే అప్పగించినా..సంస్థ ఆదాయం మొత్తం ఈపీడీసీఎల్ ఖాతాలోనే జమవుతోంది. అయితే సంస్థ ఆస్తులు, అప్పుల సెటిల్‌మెంట్ జరిగే వరకు అనుబంధ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ బాధ్యతను ఆర్‌ఈసీఎస్ ఆదాయంతోనే చేపట్టాలని స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులను, కార్యాలయాలను వాడుకుంటూ వ్యాపారం చేస్తున్న ఏపీఈపీడీసీఎల్ సంస్థ కళాశాల పూర్తి బాధ్యతను మాత్రం గాలికి వదిలేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ కళాశాల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో దయనీయంగా మారింది. పాలిటెక్నిక్ కళాశాలలో సిబ్బందికి ఏడాదిగా జీతాలు ఇవ్వకుండా, కళాశాల నిర్వహణ బాధ్యత తీసుకోకుండా ఏపీఈపీడీసీఎల్ కాలయాపన చేస్తూ వచ్చింది. ‘సాక్షి’ లో పలుమార్లు కథనాలు రావడంతో కళాశాల సిబ్బందికి, టీచర్లకు గత ఏడాది అక్టోబర్ నెల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. కానీ కళాశాల నిర్వహణను గాలికొదిలేశారు. కళాశాల నిర్వహణకు అనుమతి కోసం, అఫిలియేషన్ కోసం విద్యాశాఖకు చెల్లించాల్సిన ఫీజులు కూడా చెల్లించలేదు. టెలిఫోన్, ఇంటర్నెట్, స్టేషనరీ, టాయిలెట్ నిర్వహణ వంటి ఖర్చులకు కూడా నగదు చెల్లించకుండా ఈపీడీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ఫీజులు చెల్లించకపోతే పాలిటెక్నిక్ కళాశాలకు అనుమతి, అఫిలియేషన్‌లను రద్దు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే 600 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. 50 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు పలుమార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇంటర్నెట్ రుసుం, స్టేషనరీకి నగదు చెల్లించకపోవడం వల్ల రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కష్టతరంగా మారిందని, నిధులు లేక టాయిలెట్లను శుభ్రం చేయకపోవడం వల్ల తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నా..ఈపీడీసీఎల్ అధికారుల్లో స్పందన కనిపించలేదు. చివరికి పాలిటెక్నిక్ ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదు సరికదా, చెల్లిస్తున్న అరకొర జీతాలకు కూడా నిబంధనలకు విరుద్ధంగా గరిష్ట పరిమితి విధించి తగ్గిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు జీతాన్ని తగ్గించారు. తమ జీతాన్ని పునరుద్ధరించాలని పలుమార్లు వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది.
కశికోటలోని ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల
బైలాకు విరుద్ధంగా...
విద్యుత్ వినియోగదారుల పిల్లలకు సాంకేతిక విద్యను అందించేందుకు 2008 సెప్టెంబర్ నెల లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి కశింకోటలో రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐదుఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా కళాశాల నిర్వహణ బాధ్యత, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, భవనాల నిర్మాణం, ప్రయోగ పరికరాల కొనుగోలు ఇతర నిర్వహణ ఖర్చులకు నగదును ఆర్‌ఈసీఎస్ నిధుల నుంచి చెల్లించేలా తీర్మానం చేశారు. 2009లో రాజీవ్ గాంధీ ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అంతేకాకుండా వినియోగదారుల పిల్లలకే సగం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఆర్‌ఈసీఎస్ యాజమాన్యం కల్పించిన మౌలిక సదుపాయాలతో 120 మంది విద్యార్థులతో కళాశాల ప్రారంభమైంది. ఇక్కడ చదివిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించి వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. ఈ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ వ్యయం, విద్యార్థుల ఫీజులు, సిబ్బంది జీతభత్యాలు సంస్థ ఆదాయం నుంచే చెల్లించాలని బైలాలో పేర్కొన్నారు. అయితే దాని కి విరుద్ధంగా ఈపీడీసీఎల్ అధికారులు వ్యవహ రిస్తున్నారు. 2021 నుంచి 2025 మే మధ్యకాలంలో విద్యుత్ వినిమయ బిల్లుల బకాయిల చెల్లింపులు రూ.574.32 కోట్ల ఆదాయం రాగా .. సిబ్బంది జీతాలు,రికరింగ్, నాన్‌రికరింగ్ ఖర్చుల కోసం రూ.171.35కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 402.96 కోట్ల నగదును ఈపీఆర్‌సీ బ్యాంకు ఖాతాలో జమచేయాల్సి ఉంది. కానీ ఏపీఈపీడీసీఎల్ వారి ఖాతాలలో జమచేసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణలో ఆటంకాలపై ఈపీడీసీఎల్ అధికారులకు చాలా సార్లు వినతిపత్రాలు అందజేసినట్టు చెప్పారు. ప్రభుత్వానికి అఫిలియేషన్ ఫీజు చెల్లించకపోతే రద్దయ్యే ప్రమాదం ఉంది.
పాలిటెక్నిక్‌కు శాపం


