సింహగిరిపై పెళ్లి సందడి | - | Sakshi
Sakshi News home page

సింహగిరిపై పెళ్లి సందడి

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

సింహగిరిపై పెళ్లి సందడి

సింహగిరిపై పెళ్లి సందడి

సింహాచలం : సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవానికి నాందిగా జరిగే ‘డోలోత్సవం’ మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారు పెళ్లి కుమారుడిగా ముస్తాబై, కొండ దిగువన ఉన్న తన సోదరి అడవివరం పైడితల్లి అమ్మవారిని పిల్లను అడిగే ఈ వేడుకను స్థానికులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ఏడాది చంద్రగ్రహణం కారణంగా ఉత్సవ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో జె. వెంకటరావు తెలిపారు.

గ్రహణం వేళ.. తెల్లవారుజామునే వేడుకలు

సాధారణంగా పగలు జరిగే ఈ ఉత్సవం, చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభం కానుంది. స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను పల్లకిలో ఉంచి మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. తొలుత పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి పుష్కరిణి సత్రం వద్ద ఉన్న ఉద్యానవన మండపానికి స్వామిని వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవం, చూర్ణోత్సవం, డోలోత్సవ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి అడవివరం గ్రామంలో తిరువీధి ఉత్సవం జరుగుతుంది. ఉదయం 8 గంటలకల్లా స్వామివారు తిరిగి కొండపైకి చేరుకున్నాక ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు.

తరతరాల సంప్రదాయం

ఈ డోలోత్సవం వెనుక ఒక మనోహరమైన గాథ ఉంది. సింహగిరి నాథుడికి సోదరి సమానురాలైన పైడితల్లి అమ్మవారి కుమార్తెనే స్వామి పెళ్లి చేసుకున్నారని భక్తుల విశ్వాసం. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగే కల్యాణానికి ముందు, ఫాల్గుణ పౌర్ణమి నాడు స్వామివారు స్వయంగా దిగి వచ్చి పిల్లను అడగడం ఇక్కడి సంప్రదాయం. తొలుత అమ్మవారు నిరాకరించడం, ఆపై స్వామివారి వైభవాన్ని చూసి అంగీకరించడం వంటి ఘట్టాలను స్మరిస్తూ భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుక అనంతరం ఉగాది నాడు పెళ్లిరాట వేయడంతో కల్యాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ డోలోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్న అధికారులు, ఉద్యానవన మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement