దళిత ఐపీఎస్‌లపై వేధింపులు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

దళిత ఐపీఎస్‌లపై వేధింపులు ఆపాలి

Feb 27 2026 7:26 AM | Updated on Feb 27 2026 7:26 AM

దళిత ఐపీఎస్‌లపై వేధింపులు ఆపాలి

దళిత ఐపీఎస్‌లపై వేధింపులు ఆపాలి

● బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలి ● విదసం నాయకుల డిమాండ్‌

కోటవురట్ల : అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.2 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును తక్షణమే అరెస్టు చేయాలని విస్తృత దళిత సంఘాల(విదసం) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో విదసం ఐక్య వేదిక అనకాపల్లి జిల్లా సమితి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్‌ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ప్రజలిచ్చిన అధికారాన్ని, డిప్యూటీ స్పీకర్‌ పదవిని దుర్వినియోగం చేస్తూ ఐపీఎస్‌ అధికారి సునీల్‌నాయక్‌ను అరెస్టు చేయడం కోసం, మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ కోసం ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రఘురామకృష్ణరాజే ఒక ఆర్థిక నేరస్తుడుగా బెయిల్‌పై బయట ఉన్నాడని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.1796 కోట్లు రుణాన్ని ఎగ్గొట్టి సీబీఐ కేసులో నిందితుడుగా ఉన్నాడన్నారు. ఇండ్‌ పవర్‌ కార్పోరేషన్‌ కోసం ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రూ.970 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.826 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టినందుకు 2022లో రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జిషీట్‌ వేసిందన్నారు. 2024 అక్టోబరులో ఇతని ఆస్తులు వేలానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇంతటి ఆర్థిక నేరస్తుడు డిప్యూటీ స్పీకర్‌ హోదాలో ఉండి అధికారాన్ని అడ్డంపెట్టుకుని తాను అరెస్టు నుంచి తప్పించుకోవడమే కాకుండా వ్యక్తిగత కక్ష సాధింపుతో దళిత ఐపీఎస్‌ అధికారులను అరెస్టు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. బీహార్‌ కేడర్‌ ఐజీ స్థాయి అధికారి సునీల్‌నాయక్‌ను, రాష్ట్ర డీజీ సునీల్‌కుమార్‌ను లక్ష్యంగా పెట్టుకుని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని జైళ్లో పెట్టించాలని కుట్రలకు పాల్పడడం ప్రజా ప్రాతినిధ్య చట్టాలకు వ్యతిరేకం అన్నారు. చిన్న చిన్న ఆరోపణలకే ముఖ్యమంత్రులను సైతం జైళ్లకు పంపించిన ఈడీ, సీబీఐ అధికారులు రూ.2 వేల కోట్ల ప్రజల సొమ్మును కాజేసిన రఘురామకృష్ణరాజును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కూటమి సర్కారు దళిత ఐపీఎస్‌ను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతూ వేధిస్తోందని మండిపడ్డారు. మట్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వడ్లమూరి ఫ్రాన్సిస్‌, ఎం.చిట్టియ్య, నడింపల్లి నూకరాజు, మైలపల్లి త్రిమూర్తులు, మద్దెల కృష్ణప్రసాద్‌, గంట్యాడ చిరంజీవి, బూకా ఏసుదాసు, ఎస్‌.వీరబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement