వెంకన్న కల్యాణం చూతమురారండి...
ఉపమాక వెంకన్న కల్యాణానికి
అంకురార్పణ
మాడవీధుల్లో పెళ్లి కావిడ ఊరేగింపు
నేడే స్వామివారి కల్యాణం
ఐదురోజుల పాటు ఉత్సవాలు
నక్కపల్లి: కోనేటిరాయుడి కల్యాణానికి వేళయింది. ఉపమాక గరుడాద్రి పర్వతంపై ఏకశిలపై షఢ్బుజాలతో అశ్వారూఢుడై వెలసిన వెలసిన వేంకటేశుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సం శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠనాధుని కల్యాణం తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తకోటి ఉపమాక తరలివస్తోంది. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆలయం విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది.
ఘనంగా అంకురార్పణ
కల్యాణోత్సవాలకు సంబంధించి గురువారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి కల్యాణమండపంలో ఉభయదేవేరులను ఉంచి సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. దీన్నే అంకురార్పణ అంటారు. విశేష పూజలు, గరుడ ప్రాణప్రతిష్ట హోమాలు, నీరాజన మంత్ర పుష్ఫం వంటి కార్యక్రమాలు నిర్వహించి గరుడప్పాలు నివేదన చేశారు. స్వామివారి పెళ్లి కావడిని ఉపమాక మాఢవీదుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపుకుంకుమలు, పసుపుకొమ్ములు, కొబ్బరిబొండాలు కానుకలుగా సమర్పించుకున్నారు. పెళ్లి కావిడ ఊరేగింపులో అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్దానం సిబ్బంది పాల్గొన్నారు.
నేడే స్వామివారి కల్యాణం
స్వామివారి కల్యాణం శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం కన్యావాద సంవాదం (ఉపమాక సింహద్రాచార్యులు ఇంటి వద్ద స్వామివారి అమ్మవార్ల పెండ్లిమాటలు, గుణగణాలను వివరించే తంతును నిర్వహిస్తారు) తరిగొండ వేంగమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపకురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం జరుతుంది. అనంతరం కల్యాణ వేడుకలు జరుగుతాయి. మార్చి1న పండిత సభ, 2న తోటోత్సవం, స్వామివారికి గజవాహనంపై తిరువీధిసేవ, 3న పౌర్ణమినాడు రాజయ్యపేట సముద్రతీరంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి డోలోత్సవం, అద్దపుసేవ జరుగుతుంది. 3వ తేదీ పౌర్ణమినాడు చంద్ర గ్రహణం కావడంతో ఉదయాన్నే స్వామివారిని రాజయ్యపేట సముద్రతీరానికి చక్రవారీ స్నానం కోసం తీసుకెళ్లి మధ్యాహ్నంలోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఆలయం మూసివేయడం జరుగుతుందని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. తిరిగి 4న సంప్రోక్షణ నిర్వహించి ఆలయాన్ని తెరవడం జరుగుతుందన్నారు. 4 నుంచి 6వ తేదీ వరకు స్వామివారి పుష్పయాగోత్సవాలు జరుగుతాయన్నారు. స్వర్ణాలంకరణ భూషితుడైన స్వామివారిని చూసేందుకు భక్తులు తరలిరానున్నారు.
8లో
వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు వేళాయె..
వెంకన్న కల్యాణం చూతమురారండి...


