అనకాపల్లి : పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం అనకాపల్లి బాలోత్సవం–2026 కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా బాలోత్సవం–2026 కార్యక్రమాలను స్థానిక న్యూకాలనీ రోటరీ ప్రాంగణంలో ఈనెల 6, 7 తేదీల్లో చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా 100కు పైగా పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని, 35 రకాల అకడమిక్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమాజ భాగస్వామ్యంలో భాగంగా రామాబాలల సంఘం, రోటరీ క్లబ్ లాంటి 20 సంస్థలు భాగస్వాములుగా అనకాపల్లి బాలోత్సవం నిర్వహించడం శుభ పరిణామని అన్నారు.
ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాలను రెండు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి 2026 బాలోత్సవం ప్రోగ్రామ్ చైర్మన్, సిద్దార్ధ సోషల్ సర్వీస్– కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొప్పే ఉమామహేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కడిమిశెట్టి త్రిమూర్తులు పాల్గొన్నారు.


