వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
నక్కపల్లి: వచ్చే నెలలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది. ఈ భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. చందనాడ, డీఎల్‌పురం, వేంపాడు, అమలాపురం పరిసర ప్రాంతాల్లో 2,200 ఎకరాల్లో ఆర్సిలర్ మిట్టల్ యాజమాన్యం రూ.67వేల కోట్ల వ్యయంతో 10.5 వేల లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. బుధవారం కలెక్టర్ విజయ కృష్ణన్ కాగిత, చందనాడ ప్రాంతాల్లో పర్యటించారు. కాగిత వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని, ప్రధాని సభ వద్దకు చేరుకునే ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్‌పటేల్, అడ్డురోడ్డు ఆర్‌డీవో వి.వి.రమణ, రెవెన్యూ ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
డీఐజీ, ఎస్పీ పర్యటన
ప్రధాని పర్యటన ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్ట్టి, జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని డీఐజీ స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్‌పీ జి.ఆర్.మోహన్, నర్సీపట్నం డీఎస్‌పీ శ్రీనివాసరావు, పీఐలు మురళి, అప్పన్న, ఎస్‌ఐ సన్నిబాబు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


