రచ్చకెక్కిన కూటమి విభేదాలు
గ్రామకంఠంపై వివాదం
బీసీ మహిళా సర్పంచ్‌ను నిర్బంధించిన టీడీపీ నాయకులు !
బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
నునపర్తిలో ఉద్రిక్తత
అచ్యుతాపురం రూరల్ : కూటమిలో కుమ్ములాటలు తార స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం నునపర్తి గ్రామంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నునపర్తి పంచాయతీలో శుక్రవారం పలు అంశాలపై చర్చించేందుకు పంచాయతీ కార్యదర్శి మధు స్థానిక సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల రెండున్నర సెంట్ల గ్రామ కంఠం భూమిపై టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వివాదం జరిగింది. గ్రామ కంఠం అంశంపై హైకోర్టులో కేసు నడుస్తుండడంతో గ్రామ సభ అజెండాలో ఎలా పెడతారని, వెంటనే ఈ అంశాన్ని తొలగించాలని స్థానిక టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.దానికి పంచాయతీ కార్యదర్శి స్పష్టత ఇవ్వకుండా గ్రామ సభ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి ఈ విషయాన్ని సర్పంచ్ చుక్కా అనూరాధ(బీజేపీ) తెలియజేయడంతో ఆమె సమావేశం ప్రదేశానికి వచ్చారు. ఆమెను కూడా టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే బీజేపీకి చెందిన బీసీ మహిళా సర్పంచ్ చుక్కా అనూరాధ, కార్యదర్శి మధును టీడీపీ నేతలు నిర్బంధించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తాము గ్రామ కంఠం గురించి ప్రశ్నించామే తప్ప ఎవరీ నిర్బంధించలేదని టీడీపీ నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు వంటావార్పు చేశారు. ఈ వివాదం అర్ధరాత్రి వరకూ కొనసాగింది ఇంతజరగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు, ఎంపీడీవో చూసీచూడనట్టు వ్యవహరించారు.
రచ్చకెక్కిన కూటమి విభేదాలు
రచ్చకెక్కిన కూటమి విభేదాలు


